Share News

నిరాశ్రయుల్ని చేయం

ABN , Publish Date - Mar 07 , 2026 | 05:04 AM

రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మించాలన్నా.. రేడియల్‌ రోడ్డు వేయలన్నా.. బుల్లెట్‌ రైలు తీసుకురావాలన్నా.. ఎవరిదో ఒకరిది, ఎంతో కొంత భూమి తీసుకోక తప్పదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

నిరాశ్రయుల్ని చేయం

  • భూ నిర్వాసితులకు మంచి పరిహారం చెల్లించే బాధ్యత నాది

  • అభివృద్ధి జరగాలంటే ఎవరిదో ఒకరి భూమి ఎంతో కొంత తీసుకోక తప్పని పరిస్థితి

  • భూమి పోయిన దుఃఖం ఎవరికైనా ఉంటుంది

  • మీరు మాకు శత్రువులు కాదు.. మిత్రులు

  • ఏం చేసినా అడ్డం పడతామంటున్న కేటీఆర్‌, ఆ అక్క చాలాసార్లు మంత్రి అయ్యారు

  • తన ప్రాంతం వారికోసం ఆలోచన చేయలేదు

  • ట్రంప్‌, ఎలాన్‌మ్‌స్క సంస్థలు రాబోతున్నాయి

  • కొత్వాల్‌గూడ ఎకో పార్కు ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌ సిటీ, మార్చి6 (ఆంధ్రజ్యోతి): రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మించాలన్నా.. రేడియల్‌ రోడ్డు వేయలన్నా.. బుల్లెట్‌ రైలు తీసుకురావాలన్నా.. ఎవరిదో ఒకరిది, ఎంతో కొంత భూమి తీసుకోక తప్పదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఎవరికైనా భూమి పోయిన దుఃఖం ఉంటుందని, కానీ.. మరో చోట భూమి కొనుక్కునేలా మంచి నష్టపరిహారం ఇచ్చే బాధ్యత తనదని చెప్పారు. ‘‘మిమ్మల్ని అనాథల్ని, నిరాశ్రయుల్ని చేయం. మీ ఆస్తి అక్కడ పోతే.. ఇంకో దగ్గర కొనేలా చేస్తాం. ఒకవేళ ఇల్లు పోయినా.. మీకు మంచి సౌకర్యాలు కల్పించి, మీకు మంచి నష్ట పరిహారం ఇచ్చి, మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడతాం. మీరు మాకు శత్రువులు కాదు. మంచి మిత్రులు’’ అని సీఎం భరోసా ఇచ్చారు. శుక్రవారం బుద్వేల్‌ లేఅవుట్‌తో కలిపే రేడియల్‌ రోడ్డు-2 ఇంటర్‌చేంజ్‌కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. కొత్వాల్‌గూడలో ఎకో పార్కును, అందులోని అతిపెద్ద పక్షిశాలను ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో అమెరికా, సింగపూర్‌, ఇంగ్లండ్‌కు, దేశంలో కశ్మీర్‌కు వెళ్లి మంచి మంచి సినిమాల షూటింగ్‌లు చేస్తారని తెలుసుకుంటామని, కానీ.. హైదరాబాద్‌, రంగారెడ్డిల కంటే మంచి నగరం, సుందరమైన నగరం ప్రపంచంలోనే లేదని అన్నారు. మంచి ప్రభుత్వం, మంచి మంత్రులుంటే హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయిలో పోటీపడే నగరంగా అభివృద్ధి చేసుకోవచ్చునన్నారు.


ప్రపంచంలోనే అందమైన నగరం..

హైదరాబాద్‌ గొప్ప చారిత్రక నగరమే కాకుండా.. ప్రపంచంలో అందమైన నగరమని సీఎం రేవంత్‌ అన్నారు. కానీ, ఆక్రమణలకు గురై ప్రభుత్వాల నిర్లక్ష్యానికి లోనై నేడు నగరమంతా చెత్త నిండిపోయిందన్నారు. చెత్త ఎత్తేవాళ్లు లేరనే స్థితికి చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత గొప్ప నగరమైనా, ఎన్ని కోట్లు ఖర్చు చేసి ఇటాలియన్‌ మార్బుల్‌ వేసుకున్నా.. ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే మట్టికొట్టుకుపోతుందని అన్నారు. ‘‘మన నగరాన్ని మంచిగా చేసుకుందామంటే కొంతమంది అట్లెట్ల అయితది? మేము చేయలేదు.. నువ్వెట్ల చేస్తవు? అంటున్నారు. నువ్వు నీ సొంతానికి జన్వాడలో ఫామ్‌హౌస్‌ కట్టుకున్నావు. ఇంకొకాయన మొయినాబాద్‌లో కట్టుకున్నాడు. ఇలా మీ సొంతానికి పెద్ద పెద్ద బంగ్లాలు, ఫామ్‌హౌస్‌లు కట్టుకుంటే.. మాకేమీ అభ్యంతరం లేదు’’ అని సీఎం ఎద్దేవా చేశారు. ఆగర్భ శ్రీమంతులకు, ఫామ్‌హౌస్‌లలో ఉన్నోళ్లకు పేదోళ్ల గురించి తెలియదని, ఎవరినీ దగ్గరకు రానివ్వరని అన్నారు. పేదోళ్లు పిల్లల్ని తీసుకోని ఎక్కడికైనా పోవాలంటే ఆర్థిక స్థోమత లేదని, ఊరు విడిచి, దేశం విడిచి పోవడం సాధ్యమవుతుందా? అని ప్రశ్నించారు. అందుకే దేశ విదేశాల్లో ఉన్న వాటి కంటే అత్యున్నతమైనవి హైదరాబాద్‌లో ఉండేలా ప్రణాళికలు చేస్తున్నామని తెలిపారు.


బుల్లెట్‌ రైలు చూడాలంటే శంషాబాద్‌కు రావాల్సిందే

‘మూసీనది మొత్తం మురికితో నిండిపోయింది. ఊర్లలో నుంచి వచ్చిన పేదలు నగరంలో ఎక్కడా ఉండానికి వీలు లేక మూసీనదిలో దోమలకు, ఈగలకు అక్కడే ఉండి బతుకుతున్నారు’’ అని సీఎం రేవంత్‌ అన్నారు. వారిని అక్కడి నుంచి బయటకు తీసుకురావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ‘‘ఐదేళ్లలో శంషాబాద్‌ పెద్ద జంక్షన్‌ అయ్యి బుల్లెట్‌ ట్రైన్‌ వస్తుంది. దేశంలో ఎవరు బుల్లెట్‌ ట్రైన్‌ చూడాలన్నా శంషాబాద్‌కు రావాల్సిందే. అన్ని అనుమతులూ వచ్చాయి’’ అని తెలిపారు. ప్రపంచంలోనే గొప్ప నగరాన్ని నిర్మిస్తున్నామని, ఇది ప్రారంభమేనని అన్నారు. రాబోయే రోజుల్లో ఇక్కడ అభివృద్ధికి ట్రంప్‌, ఎలాన్‌మ్‌స్కల వ్యాపార సంస్థలతో మాట్లాడుతున్నామని, పెద్ద పెద్ద సంస్థలను తీసుకురాబోతున్నామని చెప్పారు. ఆహ్లాదంతోపాటు వ్యాపారం లాభసాటిగా ఉండేందుకు చర్యలు చేపడుతున్నామని, ఆటో డ్రైవర్‌, ట్యాక్సీ, హోటళ్ల నుంచి రియల్టర్ల వరకు లాభాలుంటాయని అన్నారు. ‘‘మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుంటే.. గుంపులు గుంపులుగా వచ్చి అడ్డుపడుతున్నారు. ఆ అక్క మస్తుసార్లు మంత్రి అయ్యింది. ఏనాడైనా మీకోసం ఆలోచన చేసిందా.? ఇక్కడ అభివృద్ధి జరుగుతుంటే అందరినీ తీసుకొచ్చి తిప్పుతుంది. అక్కా.. నీకు, నీ కుటుంబానికి ఈ ప్రాంతమంతా 40 ఏళ్ల నుంచి అండగా నిలబడ్డారు. ఇక్కడ అభివృద్ధి జరుగుతుంటే ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నావు? మీ నాయకులకు కడుపుల మంట ఉండొచ్చు. నేను ఏదైనా చేయబోతే కేటీఆర్‌ వచ్చేసి.. నువ్వు ఏమి చేసినా నేను అడ్డం పడుతా అనేవిధంగా తయారయ్యిండు. ఇట్లాంటివి మానేయండి’’ అని సీఎం వ్యాఖ్యానించారు. మూసీనది రివర్‌ ఫ్రంట్‌ను అభివృద్ధి చేసి.. దాని చుట్టురా రాత్రిపూట మొత్తం వ్యాపారాలు ఓపెన్‌ చేస్తామని చెప్పారు. యువ నిరుద్యోగులకు ఉపాధికి అవకాశం కల్పించి శాంతిభద్రతలు పటిష్టంగా అమలు చేస్తామన్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో ఏ నియోజకవర్గంలోని వారికి అక్కడే ప్రభుత్వ స్థలాలను వెతికి ఇళ్లు నిర్మించేలా చేస్తామని హామీ ఇచ్చారు.

Updated Date - Mar 07 , 2026 | 05:04 AM