ధాన్యం కొనుగోలు ఆగొద్దు
ABN , Publish Date - May 13 , 2026 | 04:12 AM
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా, పర్యవేక్షణ చేయకపోయినా జిల్లా కలెక్టర్లపై చర్యలు తీసుకోవటానికి వెనకాడబోనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.
నిర్లక్ష్యం చేస్తే కలెక్టర్లనూ వదిలేది లేదు
ప్రతి ఒక్క అధికారి జవాబుదారీతనంతో పని చేయాలి
లారీలు సమకూర్చని కాంట్రాక్టర్లపై క్రిమినల్ చర్యలు
సెంటర్‌లో ధాన్యం లోడెత్తగానే రైతులకు రశీదు ఇవ్వాలి
కొనుగోలు కేంద్రాల్లో రైతుకు ఎలాంటి ఇబ్బందీరావొద్దు
కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్ హెచ్చరిక
హైదరాబాద్, మే 12 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా, పర్యవేక్షణ చేయకపోయినా జిల్లా కలెక్టర్లపై చర్యలు తీసుకోవటానికి వెనకాడబోనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. ప్రతి ఒక్క అధికారి జవాబుదారీతనంతో పని చేయాలని ఆదేశించారు. సమస్య తీవ్రతను గుర్తించి జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు సరైన చర్యలు తీసుకోవాలన్నారు. మంగళవారం ఆయన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో సమస్యలపై కలెక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి కొనుగోళ్ల తీరును పరిశీలించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు. గోనె సంచులు, హమాలీల కొరత లేకుండా చూడాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోదాములకు తరలించాలని చెప్పారు. ఒప్పందం మేరకు లారీలను అందుబాటులో ఉంచని కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులకు వెనకాడొద్దని అన్నారు. గోదాముల సమస్య ఉన్నట్లు తెలుస్తోందని, అవసరాన్నిబట్టి తాత్కాలిక ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. రైతుబజార్లు, ఫంక్షన్ హాళ్లు అద్దెకు తీసుకొని ధాన్యాన్ని తరలించాలని ఆదేశించారు. మొక్కజొన్న పంట ఎక్కువగా వచ్చే జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అవసరమైన చోట పోలీస్ సాయం తీసుకుని ధాన్యం సేకరణ సాఫీగా జరిగేలా చూడాలని చెప్పారు. కొనుగోళ్లపై కలెక్టర్లు ఎప్పటికప్పుడు సీఎస్కు నివేదిక పంపాలన్నారు.
కల్లాల వద్ద ధాన్యం తడవకుండా ఉండేందుకు అవసరమైన టార్పాలిన్లను రైతులకు అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశించారు. వాతావరణ శాఖ సూచనలు ఎప్పటికప్పుడు రైతులను చేరవేసేందుకు మండల స్థాయిలో అధికారిని నియమించాలని చెప్పారు. ఐకేపీ సెంటర్‌కు ఒక అధికారిని నియమించి కొనుగోలు కేంద్రాల వద్ద సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. ప్రతీ రైస్ మిల్లును బాధ్యతాయుతమైన అధికారి పర్యవేక్షించాలని సూచించారు. లోడెత్తటంలో జాప్యం జరగకుండా హమాలీలను గుర్తించి పని చేయించుకోవాలని సూచించారు. లోడ్ చేసిన వెంటనే కొనుగోలు కేంద్రంలోనే రైతులకు రశీదు అందేలా చూడాలని చెప్పారు. అప్పుడే తాలు, తరుగు పేరుతో అక్రమాలు జరగకుండా చూడొచ్చని ముఖ్యమంత్రి సలహా ఇచ్చారు. దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ట్రాక్టర్లు, ఇతర వాహనాలను కూడా ధాన్యం తరలించేందుకు వాడాలన్నారు. కొనుగోళ్ల విషయంలో కలెక్టర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ అన్నారు. ఎక్కడ సమస్యలున్నా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, అవసరమైన అన్ని సహాయ, సహకారాలను అందిస్తామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తోందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. పొరుగు రాష్ట్రాల రైతులు కూడా రావడం వల్లే కొన్ని ప్రాంతాల్లో సమస్యలు వస్తున్నాయని అన్నారు. సంబంధిత జిల్లా కలెక్టర్లు దీన్ని అడ్డుకోవాలని సూచించారు. నెలాఖరులోగా ధాన్యం సేకరణ పూర్తి కావాలన్నారు.