రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు అధిక ప్రాధాన్యం
ABN , Publish Date - Nov 19 , 2026 | 04:36 AM
ఎస్సీ, ఎస్టీలకు తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం కల్పిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
రాజకీయంగా సముచిత అవకాశాలు కల్పించాం..
ఆరోగ్య శ్రీ, సీఎంఆర్‌ఎఫ్‌లో సగం నిధులు వారికే
ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన రాష్ట్రం తెలంగాణనే
పార్లమెంటరీ కమిటీకి వివరించిన సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ, ఎస్టీలకు తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం కల్పిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి సంబంధించిన పార్లమెంటరీ కమిటీ చైర్మన్ ఫగ్గన్ సింగ్ కులస్తే, కమిటీ సభ్యులతో బుధవారం సీఎం సమావేశమయ్యారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు విద్య, ఉపాధి, ఆర్థిక, రాజకీయ రంగాల్లో సముచిత స్థానాన్ని కల్పిస్తున్నామని కమిటీకి వివరించారు. అసెంబ్లీ స్పీకర్‌గా, మంత్రులుగా దళితులకు రాజకీయంగా సముచిత అవకాశాలు కల్పించామన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తోపాటు వివిధ కార్పొరేషన్లలో అనేక అవకాశాలు కల్పించామని తెలిపారు.
వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా దళిత ప్రొఫెసర్‌కు అవకాశం కల్పించామన్నారు. అర్హత, అవకాశం ఉన్న ప్రతి చోటా ఎస్సీ, ఎస్టీలకు స్థానం కల్పించామని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరులోనూ వారినే ప్రాధాన్యంగా తీసుకున్నామని వివరించారు. సీఎంఆర్‌ఎఫ్, ఆరోగ్యశ్రీ నిధుల్లో 50శాతానికి పైగా నిధులను ఎస్సీ, ఎస్టీల కోసం ఖర్చు చేస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అని గుర్తుచేశారు. వర్గీకరణను అమలు చేయడం, యంగ్‌ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుపై ముఖ్యమంత్రిని కమిటీ సభ్యులు అభినందించారు. సమావేశంలో ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీగణేశ్, కమిటీ సభ్యులు తాపీర్‌గావ్, హరీశ్చంద్రమీనా, అనిల్ ఫిరోజియా, అరుణ్‌కుమార్, ప్రసాదరావు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ ఓటర్ల జాబితాపై ఈసీ కీలక నిర్ణయం
బాబా బర్త్‌డే స్పెషల్.. బెంగళూరు-ధర్మవరం మధ్య ప్రత్యేక ప్యాసింజరు రైలు
Read Latest Telangana News And Telugu News