పేదవాడి ఇళ్లు కూలగొట్టే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు: సీఎం
ABN , Publish Date - Mar 09 , 2026 | 09:30 PM
గతంలో తాను మల్కాజ్‌గిరి ఎంపీగా ఉన్న సమయంలో నిధులు లేక ఈ నల్లచెరువును అభివృద్ధి చేయలేక పోయినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. కూకట్‌పల్లిలో ప్రస్తుతం నల్లచెరువు అభివృద్ధిని చూసి స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు.
హైదరాబాద్, మార్చి 09: గతంలో తాను మల్కాజ్‌గిరి ఎంపీగా ఉన్న సమయంలో నిధులు లేక ఈ నల్లచెరువును అభివృద్ధి చేయలేక పోయినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. కూకట్‌పల్లిలో ప్రస్తుతం నల్లచెరువు అభివృద్ధిని చూసి స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ను 100 శాతం అభివృద్ధి చేస్తానన్నారు. సోమవారం కూకట్‌పల్లిలో హైడ్రా పునరుద్దరించిన నల్లచెరువును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం నల్లచెరువుకు గంగా హారతి ఇచ్చారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేస్తామన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత అభివృద్ధితోపాటు సంక్షేమంపై దృష్టి పెడతామని తెలిపారు. ఏ పేదవాడి ఇళ్లు కూలగొట్టే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. చెరువుల పునరుద్ధరణలో నిర్వాసితులకు న్యాయం చేస్తామని ప్రకటించారు.
హైడ్రా తెచ్చినప్పుడు చాలా విమర్శలు వచ్చాయన్నారు. చెరువులు, కాల్వలు ఆక్రమించి ఇళ్లు నిర్మిస్తే అనేక ఇబ్బందులొస్తాయని తెలిపారు. ప్రభుత్వానికి సహకరించాలంటూ ఈ సందర్భంగా చెరువులు, నాలాల ఆక్రమణదారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. నిర్వాసితులకు ప్రభుత్వం పూర్తి న్యాయం చేస్తుందన్నారు. అలాగే నిర్వాసితులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కేటాయిస్తామని ప్రకటించారు.
చెరువులను అభివృద్ధి చేసుకోవాలని ప్రజలకు సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. కొందరికి కష్టం వచ్చినా.. బాధపడినా చెరువులను అభివృద్ధి చేస్తున్నామని కుండబద్దలు కొట్టారు. అభివృద్ధిని అడ్డుకోవద్దని కోరుతున్నానంటూ ప్రతిపక్షాలకు ఆయన సూచించారు. ఢిల్లీలో కాలుష్యంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని గుర్తు చేశారు. ఢిల్లీ లాంటి పరిస్థితులు మనం తెచ్చుకోకూడదంటూ హైదరాబాద్ నగర ప్రజలకు తెలంగాణ సీఎం హితవు పలికారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసుకోవాలంటూ నగర ప్రజలకు సీఎం రేవంత్ సూచించారు.
హైడ్రా మొదలైనప్పుడు చాలా విమర్శలు, ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. కానీ అవన్నీ తాను మౌనంగా భరించానన్నారు. కానీ ఇప్పుడు ఈ డెవలప్‌మెంట్ చూసి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తుంటే తనను తిట్టిన తిట్లు కూడా ఆశీర్వాదంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఇక్కడ అనధికారికంగా నివాసాలు నిర్మించుకున్న కొందరని ఇబ్బంది పెట్టి ఉంటామని.. వారందరికీ డబుల్ బెడ్ రూంలు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నానని ప్రకటించారు. చెరువులు కబ్జాకు గురైతే వరదలు వస్తే ఇంట్లోకి వచ్చి మన వస్తువులు మొత్తం మునిగిపోతాయని వివరించారు. చెరువులను ఆక్రమించిన వాళ్ళు సహకరించాలని కోరుతున్నానని తెలిపారు. ఇలాంటి ప్రదేశాల్లో మహిళలకు స్వయం సహాయక స్టాల్స్ ఏర్పాటు చేయమని చెప్పానని గుర్తు చేశారు.
చిన్న పిల్లలకు ఆట స్థలం కోసం కూడా ఈ పార్క్‌లు పనికి వస్తాయన్నారు. ఇక్కడ ఇంతకు ముందు కోరినట్లు షటిల్ కోర్టు నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. నాలాలకు రక్షణగా గోడలు కట్టాలన్నారు. ఢిల్లీలో పార్లమెంట్‌కు సెలవులు ప్రకటించే పరిస్థితి పొల్యూషన్ వల్ల వచ్చిందని గుర్తు చేశారు. ముందు చూపు లేక ఢిల్లీకి ఆ పరిస్థితి వచ్చిందన్నారు. బొంబాయిలో వర్షం కురిస్తే ఇంట్లోంచి బయటకి రాలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. అలాంటి పరిస్థితి హైదరాబాద్‌కి రావద్దంటే మూసి ప్రక్షాళన చేయాల్సిందేనని కుండబద్దలు కొట్టారు.
మూసి ప్రక్షాళన వద్దంటే అది హైదరాబాద్ ఫ్యూచర్‌ను అడ్డుకున్నట్లేనని పేర్కొన్నారు. నిధులు ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని.. మంచి అధికారులను మీకు ఇచ్చానని తెలిపారు. పని చేయించుకోవడం మీ వంతు అంటూ ప్రజలకు సూచించారు. సరైన డాకుమెంట్స్ ఉంటే టీడీఆర్ ఇవ్వమని చెప్పానని గుర్తు చేశారు. ఇక్కడ అభివృద్ధిని ఎవరూ అడ్డుకోకండంటూ ప్రజలకు హితవు పలికారు. తాను కష్ట కాలంలో ఉన్నప్పుడు ఇక్కడ తనను ఎంపీగా గెలిపించారని చెప్పారు. తన తల తాకట్టు పెట్టయినా అప్పు తెచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. పార్టీలకు అతీతంగా ఇక్కడ అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. అందరు అభివృ కి సంపూర్ణంగా సహకరిస్తారని తాను భావిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.