Share News

రావణాసురుడి వల్ల రాముడికి పేరొచ్చిన మాదిరిగానే..

ABN , Publish Date - Mar 31 , 2026 | 05:26 AM

కేసీఆర్‌ వల్లనే తనకు గుర్తింపు వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. రావణాసురుడు లేకుంటే శ్రీరామునికి పేరు వచ్చేదే కాదన్నారు.

రావణాసురుడి వల్ల రాముడికి పేరొచ్చిన మాదిరిగానే..

  • పాముకన్నా ప్రమాదకారి హరీశ్‌రావు

  • కేసీఆర్‌ను గృహనిర్బంధం చేశారని అనిపిస్తోంది

  • పంటల మార్పిడిపై రైతుల్లో చైతన్యం తెస్తాం

  • మంత్రులు, వర్సిటీలు, స్వచ్ఛంద సంస్థలకు బాధ్యత

  • సన్నబియ్యంపై ఏటా రూ.15,000 కోట్లు పెడుతున్నాం

  • భారం పంచుకుంటే మోదీ ఫొటో పెట్టేందుకు సిద్ధం

  • పప్పులు పండించండి.. కొని రేషన్‌లో పంచుతాం

  • రాష్ట్రంలో అందరికీ క్యాన్సర్‌ పరీక్షలు నిర్వహిస్తాం

  • మీడియాతో ‘చిట్‌చాట్‌’లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, మార్చి 30(ఆంధ్రజ్యోతి): కేసీఆర్‌ వల్లనే తనకు గుర్తింపు వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. రావణాసురుడు లేకుంటే శ్రీరామునికి పేరు వచ్చేదే కాదన్నారు. శనికి పాత్ర లేకుంటే మహాభారత యుద్ధం జరిగుండేది కాదని, శ్రీకృష్ణుడికి గుర్తింపు వచ్చుండేదీ కాదని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌కు, తనకు పోలికే లేదన్నారు. వరి వేస్తే ఉరి అని కేసీఆర్‌ అంటే.. తాను సన్న వరి వేసిన రైతులకు బోనస్‌ ఇస్తున్నానని చెప్పారు. తాను హామీ ఇచ్చినవి చేసుకుంటూ వస్తున్నానని, కేసీఆర్‌ ఎప్పుడూ చెప్పింది చేయలేదని అన్నారు. కేసీఆర్‌ ఫామ్‌ హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారంటూ బీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నప్పటికీ హరీశ్‌రావు, కేటీఆర్‌లు కలిపి ఆయన్ను గృహనిర్భంధం చేసిఉంటారని తాను అనుమానిస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు.


దారిన వెళుతున్నపుడు తాచుపాము, హరీశ్‌రావులు ఎదురొస్తే పాము కంటే హరీశ్‌రావే ఎక్కువ ప్రమాదకరమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. శాసనమండలి కాన్ఫరెన్సు హాల్లో సోమవారం ఆయన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఆహార కల్తీని ఉక్కుపాదంతో అణచి వేయనున్నట్లు ప్రకటించారు. ఆహారంలో కల్తీని అరికట్టేందుకు ఈగల్‌, హైడ్రాల తరహాలో ప్రత్యేక వ్యవస్థను తీసుకురానున్నట్లు చెప్పారు. దేశంలోని చట్టాలను అధ్యయనం చేసి ఈ వ్యవస్థను పగడ్బందీగా ఏర్పాటు చేస్తామని అన్నారు. రాష్ట్రంలో పంటల మార్పిడి జరగాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. అయితే, పంటల మార్పిడి పైన రైతుల్లో అవగాహన కల్పిస్తామే తప్ప కేసీఆర్‌ తరహాలో ఒత్తిడి చేయబోమని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి వ్యవసాయ, పౌర సరఫరాల శాఖల మంత్రులు, వ్యవసాయ వర్శిటీ, ఇతర ఎన్జీవోలతో టాస్క్‌ ఫోర్స్‌ కమిటీని వేసి, ఆ కమిటీ నివేదికల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. దళారుల దోపిడీని అరికట్టేందుకు కనీస మద్దతు ధర చట్టాన్ని గత కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకువచ్చిందని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. నిత్యావసరాలను బ్లాక్‌ మార్కెట్‌ చేయకుండా పీడీ చట్టలనూ తెచ్చిందని ప్రస్తావించారు. చౌక దుకాణాల ద్వారా కిలో బియ్యం రూ.1.90కి పంపిణీ పథకాన్ని 1982లో మొదటగా తీసుకువచ్చింది విజయభాస్కర్‌రెడ్డి ప్రభుత్వమేనని చెప్పారు. తర్వాత వచ్చిన ఎన్టీఆర్‌ రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని కొనసాగించారని, అది ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లిందని వివరించారు. గత 40 ఏళ్లుగా చౌక దుకాణాల ద్వారా కేవలం దొడ్డు బియ్యం ఇస్తూ వస్తున్నారని ముఖ్యమంత్రి చెప్పారు. ధరల్లో మార్పులు వచ్చాయే కానీ.. నాణ్యతలో మాత్రం రాలేదన్నారు. దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల పేదలకు ఉపయోగం లేదని గుర్తించిన తమ ప్రభుత్వం పేదలు తినగలిగే సన్నబియ్యం పథకాన్ని గతేడాది మార్చి 30న ఉగాది సందర్భంగా ప్రారంభించినట్లు గుర్తు చేశారు. రైతులు సన్న బియ్యం వడ్లు పండించడం కోసం క్వింటాలుకు రూ.500 చొప్పన బోన్‌సనూ ఇచ్చి ప్రోత్సహించామని చెప్పారు. సన్నబియ్యం వడ్లు పండించిన రైతులకు రెండు పంటలకు కలిపి ఎకరాకు సరాసరి రూ.25 వేల చొప్పున బోనస్‌ చెల్లిస్తున్నామని వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో సన్న వడ్ల పంట 60 శాతం మేరకు పెరిగిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సన్నబియ్యం పథకం ద్వారా 3.39 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారని వివరించారు. రాష్ట్ర జనాభాలో 86 శాతం మందికి సన్నబియ్యం అందుతోందని, రేషన్‌ కార్డుల మంజూరును నిరంతరంగా కొనసాగిస్తున్న నేపథ్యంలో 90 శాతానికీ భవిష్యత్తులో చేరనుందని చెప్పారు. సన్నబియ్యం పంపిణీతో బ్లాక్‌ మార్కెట్‌ మాఫియా కూడా తగ్గిందని, మార్కెట్లో సన్నబియ్యం ధర స్థిరీకరణా జరిగిందని వివరించారు.


పంటల మార్పిడి అవసరం

విద్యలో నాణ్యత, నైపుణ్యాలను పెంచడం, భోజనంలో పౌష్టికాహారం తీసుకురావడమే తమ తదుపరి లక్ష్యమని ముఖ్యమంత్రి చెప్పారు. సన్న బియ్యం ఒక్కదారితోనే ప్రజలకు పౌష్టికాహారం అందదని ముఖ్యమంత్రి అన్నారు. అందుకే రైతులు పంటల మార్పిడి దిశగా కదలాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్‌ జిల్లాలోని ఒక ఊరిలో రైతులు ఒకే రోజు71 మారుతీ కార్లను కొన్నారని, వాణిజ్య పంటలు పండించడమే దీనికి కారణమని చెప్పారు. రాష్ట్రంలో భూములు వాణిజ్య పంటలు పండించడానికి అత్యంత అనుకూలమని ముఖ్యమంత్రి అన్నారు. ఖమ్మంలో పత్తి, మిర్చి.. నల్లగొండలో వరి, జొన్న, మహబూబ్‌నగర్‌లో సజ్జలు, జొన్నలు, కందులు, ఉమ్మడి రంగారెడ్డిలో పండ్ల తోటలు పండుతాయని సీఎం ప్రస్తావించారు. పంటల మార్పిడిని ప్రోత్సహించాలని నిర్ణయించామని చెప్పారు. రైతులు పప్పు ధాన్యాలను పండిస్తే వాటిని ప్రభుత్వం సేకరించి పప్పుగా మార్చి చౌక దుకాణాల ద్వారా పేదలకు పంపిణీ చేస్తుందని ప్రకటించారు. రాష్ట్ర అవసరాలకు సరిపడా పాలు, గుడ్లు వంటివి ఇక్కడ ఉత్పత్తి కాకపోవడం వల్ల ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ఇదంతా ఒక్క రాత్రిలో మారిపోదని ముఖ్యమంత్రి అంగీకరించారు. పంటల మార్పిడి విషయంలో ప్రభుత్వం రైతులపై ఒత్తిడి తేబోదని స్పష్టం చేశారు. వారంతట వారే పంట మార్పిడి చేసుకునేలా అవగాహన, చైతన్యం కల్పిస్తామన్నారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతం.. ఏ పంటకు అనుకూలం అన్నదానిపై అధ్యయనం చేయిస్తామని చెప్పారు. ఆహార కల్తీని అరికట్టేందుకు ఈగల్‌, హైడ్రా తరహాలో ప్రత్యేక వ్యవస్థను తీసుకువస్తామన్నారు. పేదలకు కల్తీలేని, పౌష్టికాహారం అందించడం ద్వారా జబ్బులు రాకుండా ఆపాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు. ప్రతి పనినీ తాము సంతృప్త స్థాయిని లక్ష్యంగా పెట్టుకుని చేస్తున్నట్లు చెప్పారు. సన్నబియ్యం పథకం కోసం ఏటా రూ.15 వేల కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అందరికీ క్యాన్సర్‌ పరీక్షలూ నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. సన్నబియ్యంలో కోతలు ఉండబోవని, రూ.500కి గ్యాస్‌ పథకంలో ఎలాంటి మార్పులు చేయబోమని చెప్పారు. చౌక దుకాణాల ద్వారా దొడ్డు బియ్యం పంపిణీకి కేంద్రం తన వాటా నిధులు ఇస్తోందే కానీ.. సన్న బియ్యం పథకానికి కాదని గుర్తు చేశారు. సన్నబియ్యం పథకానికీ వారు నిధులు ఇస్తే ఈ పథకంలో మోదీ ఫొటో పెట్టడానికి తమకు అభ్యంతరం ఏమీ లేదన్నారు.


సీఎం మానస పుత్రిక: మంత్రి ఉత్తమ్‌

పేదలకు సన్నబియ్యం పంపిణీ పథకం సీఎం రేవంత్‌రెడ్డి మానస పుత్రికని, ఈ పథకం క్రెడిట్‌ పూర్తిగా ఆయనకే దక్కుతుందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వానికి ఎంత భారమైనా పేదలకు మేలు చేయాలన్న ఆలోచనతోనే ఈ పథకాన్ని తీసుకు వచ్చామని చెప్పారు. సన్నబియ్యం నాణ్యతపైఇంతవరకు రాష్ట్రంలో ఎలాంటి ఫిర్యాదూ రాలేదన్నారు. సోనియాగాంధీ తీసుకువచ్చిన ఆహార భద్రతా చట్టానికి తెలంగాణలో ప్రస్తుతం న్యాయం జరుగుతోందన్నారు. రైతుల నుంచి ధాన్యం సేకరించిన 48 గంటల్లో వారి ఖాతాలో డబ్బులు వేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - Mar 31 , 2026 | 05:59 AM