అసెంబ్లీకి వెళ్లిన దానికంటే జైలుకే ఎక్కువసార్లు వెళ్లా: సీఎం రేవంత్ రెడ్డి
ABN , Publish Date - Sep 28 , 2026 | 07:13 PM
తెలంగాణ అసెంబ్లీకి వెళ్లిన దాని కంటే తాను ఎక్కువగా జైలుకే వెళ్లానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తనను అనేకసార్లు జైలుకు పంపారని పేర్కొన్నారు. ఢిల్లీలో నిర్వహించిన ‘ది కాన్‌క్లేవ్ 2026’ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీకి వెళ్లిన దాని కంటే తాను ఎక్కువగా జైలుకే వెళ్లానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తనను అనేకసార్లు జైలుకు పంపారని పేర్కొన్నారు. 2014 తర్వాత తెలంగాణలో కేసీఆర్ వర్సెస్ రేవంత్‌గా మారిందని ఆయన చెప్పారు. ఢిల్లీలో నిర్వహించిన ‘ది కాన్‌క్లేవ్ 2026’ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘ఇండియాస్ నెక్ట్స్ చాప్టర్’ అంశంపై మాట్లాడిన ఆయన.. తెలంగాణ రాజకీయాలు, విద్య, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, డీలిమిటేషన్, ఎన్నికల ప్రక్రియల గురించి చర్చించారు. అలాగే తాను కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంపైనా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
విద్య వల్లే అంబేడ్కర్ రాజ్యాంగం రచించారు..
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..'దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ప్రారంభంలో పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ విద్యకు ప్రాధాన్యం ఇచ్చారు. విద్యార్థులకు ప్రస్తుతం నాణ్యమైన విద్య, పోషకాహారం అందించాల్సిన అవసరం ఉంది. చదువు వల్లే అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రచించే స్థాయికి చేరుకున్నారు. చదువుకోవడం వల్లే మన్మోహన్ సింగ్ ప్రధాని స్థాయికి, అబ్దుల్ కలాం రాష్ట్రపతి స్థాయికి ఎదిగారు. తెలంగాణలో నాణ్యమైన విద్యను అందించడమే మా మొదటి ప్రాధాన్యం. అందుకే ప్రైవేటుకు ధీటుగా రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నాం. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యకు, ఆ తర్వాత స్కిల్స్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాం. అందుకే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం.
తెలంగాణలో బీజేపీకి ప్రాధాన్యం లేదు
తెలంగాణలో విద్యార్థి సంఘాల ప్రభావం తక్కువ. రాష్ట్రంలో లెఫ్ట్, రైట్ విద్యార్థి సంఘాలు మాత్రమే ఉన్నాయి. ఎన్ఎస్‌యూఐ ప్రభావం పెద్దగా లేదు. ఉత్తరాది, దక్షిణాదిలో రాజకీయాల శైలి భిన్నం. ఏబీవీపీలో గెలిచిన విద్యార్థి నేతలు ఆ తర్వాత.. కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ యూనివర్సిటీ, గ్రామ రాజకీయాలు వేర్వేరు. తెలంగాణలో బీజేపీకి పెద్దగా ప్రాధాన్యం లేదు. విద్యార్థి రాజకీయాల్లో ఏబీవీపీ ప్రభావం ఉంటే.. రాజకీయాల్లో కాంగ్రెస్ ప్రభావం ఉంటుంది.
అందుకే కాంగ్రెస్‌లో చేరా..
2006లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి జడ్పీటీసీగా గెలిచా. 2007లో స్వతంత్ర ఎమ్మెల్సీగా విజయం సాధించా. రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించా. అప్పట్లో తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ రెండు పార్టీలే ఉండేవి. ప్రభుత్వంపై పోరాడాలంటే ప్రతిపక్షమే మేలని టీడీపీలో చేరా. టీడీపీ నుంచి 2009, 2014లో ఎమ్మెల్యేగా గెలిచా. 2017లో కాంగ్రెస్‌లో చేరా. 2019లో ఎంపీగా పోటీ చేసి విజయం సాధించా. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో టీడీపీ ప్రాధాన్యం తగ్గింది. ఏపీలో టీడీపీ నాయకత్వం ఉండటంతో తెలంగాణలో పార్టీ బలహీనపడింది. ప్రజల సూచనతో కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నా. రాహుల్ గాంధీని తొలిసారి కలిసినప్పుడు 15 నిమిషాలు మాట్లాడా. ఆ రోజే రాహుల్ గాంధీని నాయకుడిగా నిర్ణయించుకున్నా. ఆయనకు వ్యక్తిగత ఎజెండాలు లేవు.. దేశమే ముఖ్యం.
ఎక్కడ ఉన్నా దేశం, రాష్ట్రం కోసమే..
2014 తర్వాత తెలంగాణలో పోటీ కేసీఆర్ వర్సెస్ రేవంత్‌గా మారింది. కేసీఆర్ నన్ను అనేకసార్లు జైలుకు పంపారు. అసెంబ్లీకి వెళ్లిన దానికంటే జైలుకే ఎక్కువసార్లు వెళ్లా. అప్పట్లో తెలంగాణలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం, కేంద్రం, ఏపీలో ఎన్డీఏతో పోరాడాల్సిన పరిస్థితి. రాహుల్ గాంధీ, దిగ్విజయ్ సింగ్, జైరాం రమేశ్ నా శ్రేయోభిలాషులు. విద్యార్థి సంఘం, టీడీపీ, కాంగ్రెస్ నేను ఎక్కడ ఉన్నా దేశం, రాష్ట్రం కోసం పనిచేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లో కొనసాగుతున్నా' అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఆసియా క్రీడల్లో ఈషా సింగ్‌కు వెండి పతకం.. సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
ఖైరతాబాద్ స్థానం ఖాళీ అయినట్లుగా గెజిట్ నోటిఫికేషన్..