Share News

ప్రతి 17 గంటలకో బాల్య వివాహం!

ABN , Publish Date - Nov 28 , 2026 | 04:01 AM

రాష్ట్రంలో ప్రతి 17 గంటలకు ఓ బాల్య వివాహం జరుగుతోందని మహిళా భద్రతా విభాగం డీజీ సౌమ్య మిశ్రా చెప్పారు.

ప్రతి 17 గంటలకో బాల్య వివాహం!

  • రాష్ట్రంలోని పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదులు అందుతున్నాయ్‌

  • మౌనంగా ఉండొద్దు.. చిన్నారుల భవిష్యత్తును కాపాడండి

  • మహిళా భద్రత విభాగం డీజీ సౌమ్య మిశ్రా

హైదరాబాద్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రతి 17 గంటలకు ఓ బాల్య వివాహం జరుగుతోందని మహిళా భద్రతా విభాగం డీజీ సౌమ్య మిశ్రా చెప్పారు. ఇవి పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన కేసులు మాత్రమేనని.. రానివి ఎన్నో ఉంటాయని అన్నారు. 2024 నుంచి ఈ ఏడాది నవంబరు 25 వరకు 1,497 బాల్య వివాహాల కేసులు నమోదయ్యాయని తెలిపారు. పెరిగిన ప్రతి సంఖ్య వెనుక ఒక చిన్నారి భవిష్యత్తు ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. మౌనమే అసలు ప్రమాదమని, బాల్య వివాహాల గురించి ఏ చిన్న సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పారు. మహిళా శిశు సంక్షేమశాఖ, జస్ట్‌ రైట్స్‌ ఫర్‌ చిల్డ్రన్‌ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం బేగంపేటలో నిర్వహించిన రాష్ట్ర స్ధాయి సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సగటున రోజుకు ఒకటి, రెండు కేసులు నమోదవుతున్నాయని, ఇవి కేవలం పోలీస్‌ స్టేషన్‌ వరకూ వచ్చినవి మాత్రమేనని, రాకుండా ఏన్నో ఉండవచ్చని సౌమ్య మిశ్రా అన్నారు.


బాల్యవివాహాల నిర్మూలన సామాజిక బాధ్యతగా భావించాలని కోరారు. పోలీసులు, అధికారులు, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు, ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శులు కలిసి పనిచేస్తే బాల్య వివాహాలను అరికట్టవచ్చని తెలిపారు. బాల్య వివాహాలకు సహకరించవద్దని ఫంక్షన్‌ హాళ్ల నిర్వాహకులు, పూజారులను ఆమె హెచ్చరించారు. ప్రతి స్కూల్‌లో ఆడపిల్లల డ్రాపౌట్‌ను ముందస్తు హెచ్చరికగా భావించి ఉపాధ్యాయులు విచారణ జరపాలని సూచించారు. మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో ఫిబ్రవరిలో బాల్య వివాహాల నిర్మూలనపై రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహించనున్నట్లు తెలిపారు. 2030కల్లా తెలంగాణను బాల్య వివాహ రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. బాలల రక్షణ కోసం కృత్రిమ మేధ వంటి ఆధునిక సాంకేతికతను వాడుకోవాలని జస్ట్‌ రైట్స్‌ ఫర్‌ చిల్డ్రన్‌ జాతీయ కార్యదర్శి సంపూర్ణ బెహరా అన్నారు. టీనేజ్‌ గర్భాలు, తల్లి మరణాలను శాఖల సమన్వయంతో తగ్గించాలని శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌ సంగీత సత్యనారాయణ చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి...

సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్

అటవీ ప్రాంతాల్లో నిఘా, గస్తీ మరింత పటిష్ఠం చేయాలి: పవన్ కల్యాణ్

Updated Date - Nov 28 , 2026 | 04:07 AM