Share News

హైడ్రా అధికారిగా ఎవరిని నియమించాలనే విచక్షణ ప్రభుత్వానికి ఉంది: సీఎం రేవంత్

ABN , Publish Date - Jul 28 , 2026 | 04:11 PM

హైడ్రా పనులు కొనసాగించి తీరుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కబ్జా కోర్లు హైడ్రా వద్దంటున్నారని పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి విలేకర్లతో మాట్లాడారు.

హైడ్రా అధికారిగా ఎవరిని నియమించాలనే విచక్షణ ప్రభుత్వానికి ఉంది: సీఎం రేవంత్
CM Revanth Reddy

న్యూఢిల్లీ, జులై 28: హైడ్రా పనులు కొనసాగించి తీరుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కబ్జా కోర్లు హైడ్రా వద్దంటున్నారని పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి విలేకర్లతో మాట్లాడారు. కబ్జాలు చేస్తే బడా బాబులైనా, పేదలైనా ఊరుకోమని స్పష్టం చేశారు. గండిపేట బతుకమ్మ కుంటలను ఆక్రమించింది పేదలా? పెద్దలా? అని విపక్షాలను ఆయన ప్రశ్నించారు. ఎన్ కన్వెన్షన్ పేదలదా? పెద్దలదా? అని వారిని నిలదీశారు.


హైడ్రా తాము తీసుకొచ్చిన అతిపెద్ద సంస్కరణగా సీఎం అభివర్ణించారు. హైడ్రాకు ఉన్నతాధికారిగా ఎవరిని నియమించాలనే విచక్షణ తమ ప్రభుత్వానికి ఉందని కుండబద్దలు కొట్టారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్‌పైన 400 పైగా కోర్టు ధిక్కరణ కేసులున్నాయని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.


దురుద్దేశంతోనే కేసులు వేసి కోర్టును తప్పుదోవ పట్టించారంటూ బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. కోర్టు తీర్పుని పరిశీలించి.. ఆ తర్వాత తదుపరి కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు. హైడ్రా కార్యాచరణ పైన తమకు పూర్తి స్పష్టత ఉందని అన్నారు. కబ్జాకోరులకు సహకరించొద్దంటూ మీడియాకు సూచించారు. డబ్బులు పెట్టి సోషల్ మీడియాలో హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఆఫ్‌‌లైన్‌ పరీక్షల వల్లే ఎక్కువ సమస్యలు: సీఎం రేవంత్

ఆఫ్‌‌లైన్‌ పరీక్షల నిర్వహణ వల్లే ఎక్కువ సమస్యలు వస్తున్నాయని అన్నారు. అందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. విద్యాశాఖలో రాష్ట్రాల అధికారాలను లాక్కునే యత్నం చేస్తుందంటూ కేంద్రంపై నిప్పులు చెరిగారు. వర్సిటీలపై ఆధిపత్యం చెలాయించాలని కేంద్రం చూస్తోందని విమర్శించారు. విద్య అంశం వీలైనంత వరకు రాష్ట్రాల పరిధిలోనే ఉండాలని అభిప్రాయపడ్డారు.

పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రక్షాళన చేసి నియామకాలు చేపట్టామని వివరించారు. తెలంగాణలో పారదర్శకంగా పరీక్షలు నిర్వహించామని చెప్పారు. గ్లోబరీనా వంటి సంస్థలు నాడు అక్రమాలు చేశాయని గుర్తు చేశారు. గత ప్రభుత్వం చర్యలు తీసుకోనందునే సీబీఎస్ఈకి ఈ అక్రమాలు విస్తరించారని సీఎం రేవంత్‌ పేర్కొన్నారు.


రాష్ట్రానికి 11.56 లక్షల ఇళ్లు కేటాయించండి: కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ విజ్ఞప్తి

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) కింద తెలంగాణకు 11.56 లక్షల ఇళ్లు కేటాయించాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రితో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. గతంలో గ్రామీణ ఇళ్ల నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశారని తెలిపారు.


అలాగే VB G RAM Gలో అదనపు పనులు కేటాయించాలని కోరారు. ఇక ఈ VB G RAM Gలో 10 కొత్త పనులను చేర్చాలని అడిగారు. కూరగాయల పందిళ్లు, పశుగ్రాస ప్లాట్లు, మల్బరీ తోటలు.. పట్టు పురుగుల పెంపకం షెడ్లకు కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిని సీఎం రేవంత్ అనుమతి కోరారు. ఇందిరమ్మ ఇళ్ల పనులను VB G RAM G జాబితాలో చేర్చి.. లబ్ధిదారులకు 90 రోజుల పని కల్పించాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్‌కు సీఎం రేవంత్‌ విజ్ఞప్తి చేశారు.


హైడ్రా కమిషనర్‌పై హైకోర్టు అసంతృప్తి

లోతుకుంట భూముల కేసు విచారణ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఎ.వి.రంగనాథ్‌పై తెలంగాణ హైకోర్టు సోమవారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. హైడ్రా కమిషనర్‌ పదవి నుంచి రంగనాథ్‌ను తొలగించాని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఈ సందర్భంగా ఆదేశించింది. సెక్రటరీ ర్యాంక్‌ స్థానంలో ఉన్న ఉన్నతాధికారి.. కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడం ఏ మాత్రం సమంజసం కాదని ఈ సందర్భంగా తెలంగాణ హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.


అర్హత కలిగిన అధికారిని హైడ్రా కమిషనర్‌గా నియమించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి సూచించింది. హైడ్రా కమిషనర్‌గా రంగనాథ్‌ కొనసాగితే రూల్‌ ఆఫ్‌ లా తప్పుతుందని అభిప్రాయపడింది. ఆయన్ని తొలగించడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదని తెలంగాణ హైకోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ పైవిధంగా స్పందించారు.


ఇవి కూడా చదవండి..

అవకాశాలు సద్వినియోగం చేసుకోండి.. యువతకు నారా భువనేశ్వరి పిలుపు

పేపర్ లీక్‌లు అరికట్టేందుకే బిల్లు: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 28 , 2026 | 04:45 PM