కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. వెల్లడించిన మంత్రి ఉత్తమ్
ABN , Publish Date - Jun 18 , 2026 | 04:39 PM
వానాకాలం రైతు భరోసా నిధులు విడుదల చేయాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. జూన్ 30వ తేదీన మధిరలో రైతు సమ్మేళనం పేరిట నిర్వహించే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులు విడుదల చేస్తారని తెలిపారు.
హైదరాబాద్, జూన్18: వానాకాలం రైతు భరోసా నిధులు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. జూన్ 30వ తేదీన మధిరలో రైతు సమ్మేళనం పేరిట నిర్వహించే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులు విడుదల చేస్తారని తెలిపారు. గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విలేకర్ల సమావేశంలో వివరించారు.
ఏడు రకాల సన్నాలకు బోనస్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు మంత్రి ఉత్తమ్. మార్కెట్లో వాటికి ఉన్న డిమాండ్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మన రాష్ట్రం నుంచి కేంద్రం తక్కువ ధాన్యం సేకరించడంపై ఈ సమావేశంలో ఆందోళన వ్యక్తమైందని పేర్కొన్నారు. మొత్తం ధాన్యం కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా కేంద్రాన్ని డిమాండ్ చేశామని తెలిపారు.
కేంద్రం కనీస మద్దతు ధర ఇచ్చి కొనే ధాన్యాన్ని మాత్రమే తెలంగాణ కొనాలని నిర్ణయించామన్నారు. ఎరువుల కోటాను వెంటనే విడుదల చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై పలుమార్లు కేంద్రానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖలు రాశారని గుర్తు చేశారు. త్వరలో ఢిల్లీకి వెళ్లి ఆయా అంశాలను కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించామన్నారు.
రామగుండంలో తయారయ్యే యూరియాలో అత్యధిక శాతాన్ని తెలంగాణకే కేటాయించాలని కేంద్రానికి స్పష్టం చేశారు. అలాగే హైదరాబాద్ మెట్రో విస్తరణకు కూడా సహకరించాలని కేంద్రాన్ని కోరారు. అందుకు మెట్రో రెండో దశకు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఐఆర్‌ఎఫ్‌సీ (IRFC) నుంచి రావాల్సిన రుణాన్ని వెంటనే విడుదల చేయించాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు తెలిపారు.
రాష్ట్రాభివృద్ధికి అడ్డంకులు లేకుండా ప్రాజెక్టుల అనుమతులు ఇప్పించడానికి కలిసి రావాలని బీజేపీ ఎంపీలకు ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ పిలుపునిచ్చారు. ఇకపై డిజిటల్ క్యాబినెట్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. జూన్ 21వ తేదీన జరిగే నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని ఈ కేబినెట్ భేటీలో నిర్ణయించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
ఇక వీబీ- జీ ఆర్ఏఎం జీ(VB-G RAM G)పై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సబ్ కమిటీలో మంత్రులు సీతక్క, తుమ్మల, ఉత్తమ్ ఉంటారు. దీనిపై ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం తర్వాత.. జూన్ 25 లోపు ప్రభుత్వానికి కేబినెట్ సబ్ కమిటీ నివేదిక అందజేయనుందని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
కేబినెట్ భేటీలో రైతు భరోసా నిధుల విడుదలకు ముహూర్తం ఫిక్స్
పంట గిట్టుబాటు ధరలపై సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష
Read Latest TG News And Telugu News