బడ్జెట్ కేటాయింపులపై బీఆర్ఎస్ ఆగ్రహం.. ప్రజలకు మెుండిచెయ్యి చూపించారంటూ మండిపాటు..
ABN , Publish Date - Mar 22 , 2026 | 08:52 AM
బడ్జెట్ కేటాయింపులపై బీఆర్ఎస్ పార్టీ మరోసారి విమర్శలు గుప్పించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. ఈ బడ్జెట్‌లో కూడా ఆరు గ్యారెంటీలకు ఘోరీ కట్టారని, డిక్లరేషన్లకు పాతర వేశారని, సంక్షేమ పథకాలకు సమాధి కట్టారంటూ మండిపడింది.
హైదరాబాద్: ఈనెల 20న తెలంగాణ బడ్జెట్-2026ను కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క రూ.3.24లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే, ఈ బడ్జెట్ కేటాయింపులపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉద్యోగులు, నిరుద్యోగులు సహా మహిళలకు మెుండిచెయ్యి చూపించారని ఆగ్రహించారు. గొప్పగా చెప్పుకుంటున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికీ సరైన నిధులు కేటాయించలేదని విమర్శలు గుప్పించారు.
తాజాగా బీఆర్ఎస్ పార్టీ సైతం బడ్జెట్ కేటాయింపులపై మరోసారి విమర్శలు గుప్పించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. ఈ బడ్జెట్‌లో కూడా ఆరు గ్యారెంటీలకు ఘోరీ కట్టారని, డిక్లరేషన్లకు పాతర వేశారని, సంక్షేమ పథకాలకు సమాధి కట్టారంటూ మండిపడింది. మోసకారి కాంగ్రెస్‌ను అడుగడుగునా నిలదీయాలంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. మహిళలకు రూ.2500, విద్యార్థినులకు స్కూటీలు, తులం బంగారం ఇస్తామని గుండు సున్నా కేటాయించారంటూ బీఆర్ఎస్ ఆగ్రహించింది. రైతన్నలను దగా చేశారని.. రూ.15వేల రైతు భరోసా, రూ.500పంట బోనస్ ఇస్తామని చెప్పి మోసం చేశారంది.
కౌలు రైతులు, రైతు కూలీలకూ మెుండిచెయ్యి చూపించారని మండిపడింది. రూ.4వేల నిరుద్యోగ భృతి, 2లక్షల ఉద్యోగాలు ఎగ్గొట్టారని, 5లక్షల విద్యాభరోసా కార్డుల పేరుతో పది, ఇంటర్, డిగ్రీ విద్యార్థులనూ మోసం చేశారని విమర్శించింది. సబ్బండ వర్గాలకూ బడ్జెట్‌లో కాంగ్రెస్ సర్కార్ ద్రోహం చేసిందంటూ బీఆర్ఎస్ మండిపడింది. ఎస్సీ, ఎస్టీలకు సైతం రూ.12లక్షల పేరుతో మోసం చేశారని.. వారికి 70 శాతం నిధుల కోత పెట్టారంటూ ఆగ్రహించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. కాగా, ఈ ట్వీట్‌ను కేటీఆర్ రీట్వీట్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఆర్టీసీలో సూపర్‌వైజర్ ఉద్యోగాలకు హాల్ టికెట్లు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
జీవితాన్ని ‘రీసెట్’ చేద్దాం!