తెలంగాణలో గోవధపై మండిపడిన టీబీజేపీ చీఫ్ రాంచందర్ రావు..
ABN , Publish Date - May 21 , 2026 | 06:07 PM
తెలంగాణలో గోవధ నిషేధ చట్టాలు ఉల్లంఘనకు గురవుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్‌లో గోవుల అక్రమ రవాణా, వధ జరుగుతోందని అన్నారు.
హైదరాబాద్: తెలంగాణలో గోవధ నిషేధ చట్టాలు ఉల్లంఘనకు గురవుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్‌లో గోవుల అక్రమ రవాణా, వధ జరుగుతోందని అన్నారు. చట్టాలు ఉన్నప్పటికీ కొందరు కావాలనే వాటిని ఉల్లంఘిస్తున్నారని ఆయన మండిపడ్డారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా గోవధ జరుగుతోందని రాంచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గోమాత రక్షణ కోసం శాంతియుతంగా పనిచేస్తున్న గోరక్షకులు, బీజేపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని రాంచందర్ రావు ఆరోపించారు. గోరక్షకులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, అరెస్టు చేసిన కార్యకర్తలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమ కార్యకర్తలపై విధించిన బైండోవర్ చర్యలను వెంటనే రద్దు చేయాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో గోవుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా రాంచందర్ రావు సూచించారు. గోవధకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
పోలీసులు పక్షపాత ధోరణిని విడిచిపెట్టి చట్టాన్ని అందరికీ సమానంగా అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు విజ్ఞప్తి చేశారు. గోమాత హిందువుల జీవన విధానంలో పవిత్రమైన భాగమని, పండుగల పేరుతో గోవధ చేస్తే సహించబోమని హెచ్చరించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే శక్తులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఈ సందర్భంగా తెలంగాణలో గోవధ నిరోధక చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టయిన తమ కార్యకర్తలను వెంటనే విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఉప్పల్‌లో బెంగళూరు-హైదరాబాద్ మ్యాచ్‌కు ముందు బ్లాక్ టికెట్ల దందా.. పోలీసుల ప్రత్యేక నిఘా
అశ్విని వైష్ణవ్‌తో కిషన్ రెడ్డి భేటీ.. తెలంగాణ రైల్వే ప్రాజెక్టులపై చర్చ