మొరాయిస్తున్న భూభారతి
ABN , Publish Date - Nov 17 , 2026 | 03:28 AM
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమల్లోకి తెచ్చిన భూభారతి పోర్టల్ సాంకేతిక సమస్యలతో వినియోగదారులను ఇబ్బందులకు గురిచేస్తోంది.
మూడు రోజులుగా డాక్యుమెంట్ల డౌన్‌లోడ్ బంద్
రిజిస్ట్రేషన్లు పూర్తయినా అందని పత్రాలు
రోజుకు 1700 పైగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు
డౌన్‌లోడ్స్ పూర్తిగా నిలిచిపోలేదు: సీసీఎల్‌ఏ లోకేశ్‌కుమార్
హైదరాబాద్, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమల్లోకి తెచ్చిన భూభారతి పోర్టల్ సాంకేతిక సమస్యలతో వినియోగదారులను ఇబ్బందులకు గురిచేస్తోంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయినప్పటికీ గత మూడు రోజులుగా సర్వర్ సమస్యలతో డాక్యుమెంట్లు డౌన్‌లోడ్ కావడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. మరోవైపు రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకున్నవారికి రీషెడ్యూల్ చేసుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు 1,700లకు పైగా జరుగుతాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబరు వరకు సుమారు 3.64 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి.
రిజిస్ట్రేషన్ ప్రక్రియలో డాక్యుమెంట్ జనరేషన్ అత్యంత కీలకం. రిజిస్ట్రేషన్ వివరాలు నమోదు చేయడం, ఫీజుల చెల్లింపు, అధికారుల పరిశీలన, రిజిస్ట్రేషన్ పూర్తయిన తరువాత డాక్యుమెంట్ పీడీఎఫ్ రూపంలో అందుబాటలో ఉంచడం ఇందులో కీలక దశలు. అయితే, రిజిస్ట్రేషన్ వివరాల ఆధారంగా డాక్యుమెంట్ రూపొందించే సర్వర్ స్పందించకపోవడం వల్లనే డౌన్‌లోడ్ కావడం లేదని లావాదేవీల కోసం రెవెన్యూ కార్యాలయాలకు వచ్చినవాళ్లు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ వివరాలు, డాక్యుమెంట్ జనరేషన్ వ్యవస్థ మధ్య డేటా సమన్వయం లోపం వల్ల ఈ సమస్య తలెత్తిందా లేక డాక్యుమెంట్‌పై డిజిటల్ సంతకం చేసే ప్రక్రియలో అంతరాయం ఏర్పడిందా? ? డౌన్‌లోడ్ కోసం ప్రయత్నించినప్పుడు సర్వర్ నుంచి ఫైల్ అందించే ఏపీఐ స్పందించడం లేదా? అనే అంశాలపై రెవెన్యూ అధికారులు స్పష్టత ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. అనివార్య కారణాలతో స్లాట్ రీ షెడ్యూల్ కోసం తేదీ మార్చుకునే వారికి సిటిజన్ లాగిన్‌లో వెసులబాటు ఉండాలి.
కానీ, ప్రస్తుతం ఆ ఆప్షన్ కనిపించడం లేదని వినియోగదారులు చెబుతున్నారు. సర్వర్ లోపాలు ఉంటే సరిదిద్దాలని కోరుతున్నారు. ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లాలో జూనియర్ అసిస్టెంట్లకు లాగిన్ ఐడీలు అందించడంలో జాప్యం జరగడంతో సుమారు రెండు వారాలపాటు 18 తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. సిటిజన్ లాగిన్, స్లాట్ బుకింగ్, రీ షెడ్యూల్, చెల్లింపులు, దరఖాస్తుల స్టేటస్ తెలుసుకోవడంలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యల వల్ల వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈవిషయంపై సీసీఎల్‌ఏ, రెవెన్యూ కార్యదర్శి డీఎస్ లోకేష్‌కుమార్‌ను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా.. రీషెడ్యూల్ చేసుకోవాల్సిన అవసరం లేదని.. స్లాట్ బుక్ అయ్యాక రిజిస్ట్రేషన్ ఎప్పుడు కావాలంటే అప్పుడు నేరుగా చేసుకోవచ్చని చెప్పారు. డౌన్‌లోడ్ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోలేదని.. కొంత జాప్యంతో డాక్యుమెంట్లు డౌన్‌లోడ్ అవుతున్నాయని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
కాళేశ్వరం ప్రాజెక్టులో గేట్లు మూసి నీటిని నిల్వ చేసే అవకాశం లేదు: మంత్రి తుమ్మల
సజ్జనార్ ఆస్తుల కొనుగోళ్లపై విచారణ జరిపించాలి: రాజాసింగ్