Share News

ఏడు వర్సిటీల్లో 429 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు

ABN , Publish Date - Oct 19 , 2026 | 05:07 AM

రాష్ట్రంలోని ఏడు ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో 429 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ఏడు వర్సిటీల్లో 429 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు
429 Assistant Professor Vacancies

  • భర్తీ చేయాలని విద్యామండలికి సర్కారు ఆదేశం

  • తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలిసారిగా

  • వర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీ

హైదరాబాద్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఏడు ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో 429 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ విధానంలో ఈ పోస్టుల భర్తీకోసం విద్యాశాఖ ఇటీవలే మార్గదర్శకాలు సిద్ధం చేసింది. వర్సిటీల వారీగా భర్తీ చేసే పోస్టుల వివరాలతో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీ్‌పకుమార్‌ సుల్తానియా ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. భర్తీ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని, నియామకాలను ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా, పారదర్శకంగా చేపట్టాలని తెలంగాణ ఉన్నత విద్యామండలికి సూచించారు. మొత్తం 429 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేయనుండగా.. అందులో అత్యధికంగా ఉస్మానియా వర్సిటీ (ఓయూ)లో 252 పోస్టులు ఉన్నాయి.


ఉస్మానియా క్యాంప్‌సలోని 48 విభాగాలతోపాటు సిద్దిపేట, జోగిపేట, నర్సాపూర్‌లోని ఓయూ పీజీ కాలేజీల్లోనూ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక కాకతీయ వర్సిటీలో 49, శాతవాహన 49, పాలమూరు 45, అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో 16, సురవరం ప్రతా్‌పరెడ్డి తెలుగు వర్సిటీలో 16, తెలంగాణ వర్సిటీల్లో 2 పోస్టులు భర్తీ చేయనున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలోని వర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకాలు జరుగుతుండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. చివరగా ఉమ్మడి రాష్ట్రంలో 2013లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకాలు జరిగాయి. ఇక వర్సిటీల వారీగా కేటాయించిన పోస్టుల భర్తీకి ఉన్నత విద్యామండలి త్వరలో నోటిఫికేషన్‌ విడుదల చేస్తుంది.


అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించి, 1:10 నిష్పత్తిలో వడపోసి జాబితాను సంబంధిత వర్సిటీలకు పంపనుంది. వర్సిటీలు ఆ జాబితాలో నుంచి ఎంపిక చేసి తుది జాబితా ప్రకటిస్తాయి. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ విధానంలో ఎంపిక జరుగుతుందని, నియామకాలన్నీ అత్యంత పారదర్శకంగా, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తామని ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు ఆచార్య బాలకిస్టారెడ్డి తెలిపారు. అర్హతలు, రిజర్వేషన్లు, రోస్టర్‌ పాయింట్లు తదితర నిబంధనలకు అనుగుణంగా నియామక ప్రక్రియ ఉంటుందని వెల్లడించారు.


ఓయూలో 48 విభాగాల్లో..

ఉస్మానియా వర్సిటీలోని 48 విభాగాల్లో 252 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో అత్యధికంగా ఎకనామిక్స్‌లో 18, లా విభాగంలో 16, సివిల్‌ ఇంజనీరింగ్‌లో 15, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌లో 13 పోస్టులు ఉన్నాయి. ఇంగ్లిష్‌, పొలిటికల్‌ సైన్స్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విభాగాల్లో 12 పోస్టుల చొప్పున, వృక్షశాస్త్రంలో 9, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, జాగ్రఫీ, స్టాటిస్టిక్స్‌, జువాలజీలలో 7 పోస్టుల చొప్పున, కామర్స్‌, జెనెటిక్స్‌లలో 6 పోస్టుల చొప్పున, అప్లైడ్‌ జియోకెమిస్ట్రీ, జియాలజీ, జియోఫిజిక్స్‌, మ్యాథమెటిక్స్‌ విభాగాల్లో ఐదు పోస్టుల చొప్పున భర్తీ చేయనున్నారు. పలు ఇతర విభాగాల్లోనూ నియామకాలు చేపట్టనున్నారు.


ఈ వార్తలూ చదవండి

విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్

విజయనగరంలో ఎవరికి వారే!

For More AP News And Telugu News

Updated Date - Oct 19 , 2026 | 05:07 AM