సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే హరీశ్ రావు ఫైర్.. అంగన్‌వాడీల జీతాలు చెల్లించాలంటూ డిమాండ్
ABN , Publish Date - Jun 09 , 2026 | 03:25 PM
అంగన్‌వాడీలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జీతాలు చెల్లించడం లేదంటూ బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని రేవంత్ మభ్యపెడుతున్నారని ఆగ్రహించారు.
హైదరాబాద్: అంగన్‌వాడీలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జీతాలు చెల్లించడం లేదంటూ బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని రేవంత్ మభ్యపెడుతున్నారని ఆగ్రహించారు. అంగన్‌వాడీలకు ముందు జీతాలు చెల్లించి మహిళలపై ముఖ్యమంత్రికి ఉన్న గౌరవాన్ని నిరూపించుకోవాలన్నారు. రెండు నెలలుగా జీతాలు అందక 62 వేల మంది అంగన్‌వాడీలు కష్టాలు పడుతున్నారని మాజీ మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఎమ్మెల్యే హరీశ్ రావు స్పందించారు.
ఎమ్మెల్యే హరీశ్ రావు ఎక్స్ పోస్టు..
'రెండు నెలలుగా జీతాలు రాకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 62 వేల మంది అంగన్‌వాడీ సోదరీమణుల కష్టాలు మీకు కనిపించడం లేదా?. నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తప్పకుండా వారి ఉసురు తగులుతుంది. సాటి మహిళల కన్నీటి గోసను మహిళా మంత్రిగా ఉన్న సీతక్క అర్థం చేసుకోకపోవడం శోచనీయం. గత ప్రభుత్వంలో అంగన్‌వాడీల సేవలను గుర్తించిన కేసీఆర్ వారి గౌరవాన్ని పెంచారు. వారు వర్కర్లు కాదని, టీచర్లని పేర్కొంటూ హోదాను ఉన్నతీకరించారు. 2014 నాటికి అంగన్‌వాడీ టీచర్లకు కేవలం రూ.4,200, వారి సహాయకులకు రూ.2,200 వేతనం లభించేది.
కానీ, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అంగన్‌వాడీ టీచర్ల జీతాన్ని రూ.13,650కు, మినీ అంగన్‌వాడీ టీచర్ల జీతాన్ని రూ.7,800కు, అంగన్‌వాడీ హెల్పర్ల వేతనాన్ని రూ.7,800కు పెంచి దేశంలోనే అత్యధికంగా చెల్లించారు. అభయహస్తం పేరిట ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో అంగన్‌వాడీ టీచర్ల వేతనాన్ని రూ.18వేలకు పెంచుతామని, ఈపీఎఫ్ పరిధిలోకి తీసుకువచ్చి ఉద్యోగ భద్రత కల్పిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. మాయమాటలు చెప్పి రెండున్నరేళ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీకి అతీగతీ లేదు. ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠం చూపించి, అధికారంలోకి వచ్చాక అబద్ధాల ప్రచారం చేస్తున్నట్లు కాంగ్రెస్ వైఖరి ఉంది. సమస్యల పరిష్కారం కోసం 'ఛలో సెక్రటేరియట్' పిలుపునిచ్చిన అంగన్‌వాడీల పట్ల ప్రభుత్వం కర్కశంగా వ్యవహరించింది.
అంగన్‌వాడీలపై పోలీసులను ప్రయోగించి దుర్మార్గమైన చరిత్రను కాంగ్రెస్ మూటకట్టుకుంది. ఇప్పటికైనా కళ్లు తెరవండి. మీ పాలనను అన్ని వర్గాల ప్రజలు ఛీ కొడుతున్నారన్న విషయాన్ని గుర్తించండి. పెండింగ్‌లో ఉన్న అంగన్‌వాడీ, మినీ అంగన్‌వాడీల వేతనాలను తక్షణమే చెల్లించాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం' అంటూ పోస్టు పెట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో X అకౌంట్ హ్యాక్..
బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం వద్ద విషాదం..