రూ.20 వేల కోట్లతో పట్టణాభివృద్ధి ప్రణాళిక!
ABN , Publish Date - Nov 21 , 2026 | 06:02 AM
రాష్ట్రంలో పట్టణాల మౌలిక సదుపాయాల అభివృద్ధికి దాదాపు రూ.20 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు చేపట్టేందుకు పురపాలక శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
ప్రపంచబ్యాంకు, ఏడీబీ, ఏఐఐబీ, కేఎఫ్‌డబ్ల్యూ సహకారంతో ప్రాజెక్టులు
పురపాలక శాఖ ప్రతిపాదనలపై సీఎం రేవంత్ సమీక్ష
హైదరాబాద్, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పట్టణాల మౌలిక సదుపాయాల అభివృద్ధికి దాదాపు రూ.20 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు చేపట్టేందుకు పురపాలక శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ), ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడుల బ్యాంకు(ఏఐఐబీ), జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ బ్యాంకుతో పాటు దేశీయ ఆర్థిక సంస్థల సహకారంతో వీటిని చేపట్టనున్నారు. వాతావరణ మార్పులను తట్టుకునేలా, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ పట్టణాలను అభివృద్ధి చేయడం ఈ ప్రణాళిక లక్ష్యం.
ఈ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం తన నివాసంలో పురపాలక శాఖ అధికారులతో సమీక్షించారు. వరంగల్ నగరంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, వర్షపు నీటి పారుదల వ్యవస్థ, వరంగల్ కోట చుట్టూ ఉన్న కందకం పునరుద్ధరణ, హనుమకొండలో సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ అభివృద్ధి ప్రతిపాదనలపై సమావేశంలో చర్చించారు. వరంగల్ మెగా సిటీ ఎకనామిక్ రీజియన్ పరిధిలో వ్యర్థాల నుంచి 10 నుంచి 12 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంటు ఏర్పాటు ప్రతిపాదనను సీఎం సమీక్షించారు. బయో సీఎన్జీ ఉత్పత్తి, ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ల ఏర్పాటుపైనా చర్చించారు.
మురుగునీటికి ప్రత్యేక విధానం
రాష్ట్రంలో మురుగునీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించేందుకు ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తోంది. శుద్ధి చేసిన నీటిని పరిశ్రమలకు, ప్రధానంగా టెక్స్టైల్ పార్కులకు సరఫరా చేస్తే మంచినీటి వనరులపై ఒత్తిడి తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. పట్టణాల్లో తాగునీటి సరఫరా, నీటి శుద్ధి, పంపిణీ వ్యవస్థల్లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలని, పునరుత్పాదక ఇంధన వనరులను వినియోగించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా పట్టణాల్లో కర్బన ఉద్గారాలను తగ్గించడం, నీటి వనరులను సంరక్షించడం, వరద ముప్పును నివారించడం, పురపాలక సంస్థల నిర్వహణ వ్యయాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇవి కూడా చదవండి...
మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ నివాసంలో ఈడీ సోదాలు
కాంగ్రెస్ మంత్రులకు కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి రిక్వెస్ట్
Read Latest Telangana News And Telugu News