టాప్-4వ రైల్వేస్టేషన్‌గా సికింద్రాబాద్
ABN , Publish Date - Sep 02 , 2026 | 05:23 AM
దేశంలో అత్యధిక వార్షికాదాయం కలిగిన రైల్వేస్టేషన్ల జాబితాలో సికింద్రాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు లభించింది. అటు ఆదాయంతోపాటు ఇటు ప్రయాణికుల సంఖ్యలోనూ టాప్-4వ స్టేషన్‌గా నిలిచింది.
వార్షికాదాయం రూ.1,276 కోట్లు
ప్రయాణికులు 2.78 కోట్లు..
ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్య
అనుసంధానంగా ఉండటంతో కీలకం
వచ్చే ఏడాది 3వ స్థానానికి చేరే
అవకాశం ఉందంటున్న అధికారులు
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): దేశంలో అత్యధిక వార్షికాదాయం కలిగిన రైల్వేస్టేషన్ల జాబితాలో సికింద్రాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు లభించింది. అటు ఆదాయంతోపాటు ఇటు ప్రయాణికుల సంఖ్యలోనూ టాప్-4వ స్టేషన్‌గా నిలిచింది. తొలిస్థానంలో న్యూఢిల్లీ సిటీసెంటర్ రైల్వేస్టేషన్ ఉండగా.. తర్వాత హౌరా, చెన్నై రైల్వేస్టేషన్లు ఉన్నాయి. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,276.29 కోట్ల (ప్రయాణికుల) ఆదాయంరాగా, సుమారు 2.78 కోట్ల మంది రాకపోకలు సాగించారు. రైల్వే తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా వంటి ఇతర ప్రధాన నగరాలను అనుసంధించడంలో సికింద్రాబాద్ స్టేషన్ కీలకంకావడంతో టాప్ స్టేషన్లలో నిలిచిందని రైల్వేశాఖ వెల్లడించింది.రూ.714కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునరాభివృద్ధి పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది జూన్ నాటికి పనులు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి (సీపీఆర్‌ఓ) శ్రీధర్ తెలిపారు. ప్రపంచ స్థాయి సదుపాయాల కల్పనతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ మరిన్ని రైళ్లకు, భారీ సంఖ్యలో ప్రయాణికులకు సేవలు అందించగలుగుతుందని వివరించారు. దీనితో టాప్-3వ స్థానానికి చేరే అవకాశమూ ఉందన్నారు. సికింద్రాబాద్ స్టేషన్ ఉత్తర, దక్షిణ భారత రాష్ట్రాల మధ్య అనుసంధాన కేంద్రంగా ఉందని చెప్పారు.
టాప్-10 రైల్వేస్టేషన్ల వివరాలివీ..
రైల్వేస్టేషన్ | వార్షికాదాయం (రూ.కోట్లలో) | ప్రయాణికుల సంఖ్య (కోట్లలో) |
న్యూఢిల్లీ మెట్రోసిటీసెంటర్ | 3,337.66 | 3.93 |
హౌరా రైల్వే స్టేషన్ | 1,692.40 | 6.13 |
ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ | 1,299.31 | 3.06 |
సికింద్రాబాద్ | 1,276.29 | 2.78 |
హజరత్ నిజాముద్దీన్ | 1,227.28 | 1.46 |
లోకమాన్యతిలక్ టెర్మినస్ | 1,036.76 | 1.47 |
అహ్మదాబాద్ | 1,010.36 | 1.47 |
ముంబై | 982.21 | 5.16 |
పుణె రైల్వేస్టేషన్ | 976.00 | 2.22 |
ఆనంద్ విహార్ టెర్మినల్ | 844.99 | 1.23 |
ఈ వార్తలు కూడా చదవండి
కొండా సురేఖ అంశంపై ఎటువంటి ఆదేశాలు లేవు
ఆర్థికమంత్రి భార్యపై చర్యలు ఉండవా?