మాదక ద్రవ్యాల రహిత సమాజమే లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు
ABN , Publish Date - Apr 26 , 2026 | 03:12 PM
గుట్కా, పాన్ మసాలా, ఖైనీ, డ్రగ్స్ వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు.
హైదరాబాద్, ఏప్రిల్ 26: గుట్కా, పాన్ మసాలా, ఖైనీ, డ్రగ్స్ వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల వాడకం హానికరమని, వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం రాయదుర్గంలోని సత్త్వ నాలెడ్జ్ పార్క్ వద్ద గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన నోటి క్యాన్సర్ అవగాహన మరాథాన్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మంత్రి శ్రీధర్ బాబు.. 10కే రన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పొగాకు ఉత్పత్తుల వాడకం వల్ల దేశంలో నోటి క్యాన్సర్ కేసులు ప్రమాదకరంగా పెరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి’ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని యువతను ఉత్సాహపరిచారు. మరోవైపు సైబరాబాద్ సీపీ రమేశ్ 5కే రన్‌ను ప్రారంభించి, శాంతిభద్రతల పరిరక్షణతో పాటూ సామాజిక బాధ్యతగా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు అవసరమని పేర్కొన్నారు. అలాగే డా. వకుళాభరణం కృష్ణ మోహన్ రావు 2కే రన్‌ను ప్రారంభించి, క్యాన్సర్ రహిత సమాజం కోసం వైద్యులు, పౌరులు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి
వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది.. మంత్రి నారాయణ ధ్వజం
ట్రంప్ కార్యక్రమం సందర్భంగా కాల్పులు.. అదే హోటల్‌లో కేఏ పాల్..