Share News

25 కాలేజీలకే.. రూ.5వేల కోట్లు

ABN , Publish Date - Apr 13 , 2026 | 05:25 AM

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు.. రాష్ట్రంలోని కళాశాలలు, ప్రభుత్వానికి మధ్య ఇబ్బందికరంగా మారిన అంశం. పెద్ద మొత్తంలో బకాయిలు పేరుకుపోవడంతో ఇటు కళాశాలల యాజమాన్యాలు....

25 కాలేజీలకే.. రూ.5వేల కోట్లు

  • ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలివి..

  • ఆ 25 హైదరాబాద్‌, పరిసర ప్రాంతాల్లోనివే

  • రాష్ట్రంలో మొత్తం 2,400 కళాశాలలు

  • మిగిలిన 2,375 కాలేజీలకు మరో రూ.5 వేల కోట్ల బకాయిలు

  • చెల్లింపులపై సర్కారు సమాలోచనలు

  • నెలాఖరులోపు చెల్లింపు విధానాన్ని హైకోర్టుకు తెలపనున్న రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 12(ఆంధ్రజ్యోతి): ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు.. రాష్ట్రంలోని కళాశాలలు, ప్రభుత్వానికి మధ్య ఇబ్బందికరంగా మారిన అంశం. పెద్ద మొత్తంలో బకాయిలు పేరుకుపోవడంతో ఇటు కళాశాలల యాజమాన్యాలు, అటు విద్యార్థులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇంటర్‌, డిగ్రీ, ఇంజనీరింగ్‌, ఫార్మసీ, నర్సింగ్‌, మేనేజ్‌మెంట్‌, బీఈడీ, పాలిటెక్నిక్‌.. ఇలా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,400 కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలలకు గత ఐదేళ్లుగా ప్రభుత్వం ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.10 వేల కోట్ల దాకా ఉన్నాయి. ఈ మొత్తంలో హైదరాబాద్‌, పరిసరాల్లోని 25 కళాశాలల వాటానే 50 శాతం.. దాదాపు రూ.5,000 కోట్లు ఉండడం గమనార్హం. సగం బకాయి ఒక శాతం కాలేజీలకే ఉండగా.. మిగిలిన 2,375 కాలేజీల వాటా రూ.5వేల కోట్లుగా ఉంది. అయితే, కేవలం 25 కాలేజీలకే రూ.5వేల కోట్లు చెల్లించాలనే అంశంపై ప్రభుత్వంలో ప్రధానంగా చర్చ నడుస్తోంది. 2025-26 విద్యా సంవత్సరాన్ని కలుపుకుంటే మొత్తం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల విలువ రూ. 10వేల కోట్లకు చేరింది. ఇందులో బీఆర్‌ఎస్‌సర్కారు హయాంలోని బకాయిలే సగం దాకా ఉన్నాయి. బీఆర్‌ఎస్‌ హయాంలో చివరి రెండేళ్లు ప్రభుత్వం నుంచి కళాశాలలకు ఎలాంటి చెల్లింపులు జరగలేదు. దాంతో అసంతృప్తిగా ఉన్న కళాశాల యాజమాన్యాలు.. కాంగ్రెస్‌ అధికారం చేపట్టిన తర్వాత రెండేళ్లు ఓపిక పట్టి ఆ తర్వాత ఆందోళన బాటపట్టాయి. సంప్రదింపుల అనంతరం ప్రభుత్వం రూ.750కోట్లు దాకా నిధులు విడుదల చేసింది. అయితే, మొత్తం బకాయిల్లో సగం మొత్తాన్ని అయినా విడుదల చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నాయి. ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తుండగా.. కొన్ని ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలలు హైకోర్టును ఆశ్రయించాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో సంబంధం లేకుండా పూర్తి ఫీజును విద్యార్థి నుంచి వసూలు చేసుకునేందుకు అనుమతి కోరాయి.


ఈ వినతికి అనుమతించిన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశంపై ప్రభుత్వం ఈ నెల 30లోపు న్యాయస్థానానికి తన వాదనలు వినిపించనుంది. విద్యాశాఖ బాధ్యతలు కూడా చూస్తున్న సీఎం రేవంత్‌ రెడ్డి ఇటీవల ఈ అంశంపై ఉన్నతాధికారులతో చర్చించినట్టు కూడా తెలిసింది. రాష్ట్రంలో ఇంటర్‌, డిగ్రీ, ఇంజనీరింగ్‌, కాలేజీల సంఖ్య దాదాపు 2,400 ఉండగా.. 85 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు ఇందులోని 170 ఇంజనీరింగ్‌ కళాశాలలకే వెళుతున్నాయి. మిగతా కాలేజీల్లో 800 జూనియర్‌, 700 డిగ్రీ కాలేజీలున్నాయి. 250 మేనేజ్‌మెంట్‌, 205 బీఈడీ, 123 ఫార్మసీ, 100 నర్సింగ్‌, 55 పాలిటెక్నిక్‌ తదితర కాలేజీలున్నాయి. ఈ లెక్కన రాష్ట్రంలోని మొత్తం కాలేజీల్లో 7శాతం ఇంజనీరింగ్‌ కాలేజీలకు 85 శాతం బకాయిలు ఉన్నాయి. 25 కాలేజీలకే సగం బకాయిలు ఇవ్వాల్సి ఉండగా.. మొత్తం కాలేజీల్లో వీటి వాటా కేవలం 1 శాతం మాత్రమే. ఇవన్నీ హైదరాబాద్‌, పరిసరాల్లోని ప్రముఖ ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీలే.

విడతల వారీగా ఇవ్వాలని..

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై ప్రభుత్వం తన అభిప్రాయాన్ని ఈ నెలాఖరులోపు హైకోర్టుకు తెలపాల్సి ఉండటంతో అనేక అంశాలపై చర్చ నడుస్తోంది. గత నాలుగేళ్ల బకాయిలను విడతల వారీగా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. ప్రతి ఏటా క్రమం తప్పకుండా కనీస నిధులు విడుదల చేయాలని భావిస్తోంది. ఇదే విషయాన్ని హైకోర్టుకు తెలుపనుందని సమాచారం.

Updated Date - Apr 13 , 2026 | 05:25 AM