Share News

విజయన్‌కు మోదీ గాడ్‌ఫాదర్‌

ABN , Publish Date - Apr 08 , 2026 | 05:55 AM

కేరళం సీఎం పినరాయి విజయన్‌కు ప్రధాని మోదీ గాడ్‌ఫాదర్‌ అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అందుకే శబరిమల బంగారం చోరీ, బంగారం స్మగ్లింగ్‌ కేసుల నుంచి విజయన్‌ను ప్రధాని మోదీ రక్షిస్తున్నారని ఆరోపించారు.

విజయన్‌కు మోదీ గాడ్‌ఫాదర్‌

  • అందుకే బంగారం చోరీ, స్మగ్లింగ్‌ కేసుల్లో ఆయనకు రక్షణ

  • మూడింట రెండొంతుల మెజారిటీతో యూడీఎఫ్‌ గెలవబోతోంది

  • కేరళం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు

  • ఆ రాష్ట్రంలో విజయాలన్నీ యూడీఎఫ్‌ ప్రభుత్వాల హయాంలోనే

  • విజయన్‌ లేఖకు రేవంత్‌ ప్రత్యుత్తరం

హైదరాబాద్‌, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): కేరళం సీఎం పినరాయి విజయన్‌కు ప్రధాని మోదీ గాడ్‌ఫాదర్‌ అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అందుకే శబరిమల బంగారం చోరీ, బంగారం స్మగ్లింగ్‌ కేసుల నుంచి విజయన్‌ను ప్రధాని మోదీ రక్షిస్తున్నారని ఆరోపించారు. దేశం కోసం జీవితాలు, ఆస్తులను త్యాగం చేసిన గాంధీ కుటుంబాన్ని మాత్రం రకరకాల కేసులతో మోదీ ప్రభుత్వం వేధిస్తోందన్నారు. కేజ్రీవాల్‌ సహా అనేక మంది ప్రతపక్ష నేతలపై ఈడీ కేసులు నమోదు చేసి అరెస్టు చేసిన మోదీ సర్కారు.. బంగారం చోరీ, స్మగ్లింగ్‌ కేసుల్లో విజయన్‌ జోలికి ఎందుకు రావడంలేదని ప్రశ్నించారు. మోదీ, విజయన్‌ మధ్య ఉన్న అవగాహన వల్లే ఆయనపై కేసులు, అరెస్టులు లేవన్నారు. వారిద్దరి మధ్య ఉన్న బంధాన్ని అర్థం చేసుకున్న కేరళం ప్రజలు.. సరైన నిర్ణయం తీసుకుంటారని, ఈసారి రాష్ట్రంలో మార్పు తథ్యమని అన్నారు. కేరళం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కోవలం, మావెలికర, పఠానాపురం రోడ్‌షోల్లో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. విజయన్‌ తనకు ఓ లేఖ రాసారని, అయితే అందులో తెలంగాణకు సంబంధించి 2014-23 మధ్య విషయాలను ప్రస్తావించారని తెలిపారు. ఆ కాలంలో విజయన్‌ సన్నిహిత మిత్రుడు కేసీఆర్‌.. తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్నారని గుర్తు చేశారు. విజయన్‌ లేఖలో పేర్కొన్నట్లుగా.. తప్పులు జరిగినందుకే తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను మార్చేశారని, ఇప్పుడు కేరళం ప్రజలు కూడా విజయన్‌ను మార్చేస్తారని వ్యాఖ్యానించారు. కేరళంలో పంచాయతీరాజ్‌ వ్యవస్థ విజయం సాధించిందని, అయితే ఈ ఘనత కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు కరుణాకరన్‌, ఊమెన్‌ చాందీదని అన్నారు. ఎక్కడైనా మంచి జరిగితే కచ్చితంగా అభినందిస్తామని, వైఫల్యాలను ఎత్తి చూపుతామని స్పష్టం చేశారు. తాను పినరాయి విజయన్‌ హయాంలోని వైఫల్యాలను ఎత్తి చూపానన్నారు. 120 నెలల విజయన్‌ పాలన కాలం.. వైఫల్యాలకు ప్రతీకగా నిలిచిందని ఆరోపించారు. ఇక ఆయన వైదొలిగే సమయం ఆసన్నమైందన్నారు.


వృద్ధులు, చిన్నపిల్లలే కనిపిస్తున్నారు..

కేరళం ఎన్నికల్లో మూడింట రెండొంతుల మెజారిటీతో యూడీఎఫ్‌ గెలవబోతోందని, గెలిచిన తర్వాత ఊమెన్‌ చాందీ తరహా పాలనను అందిస్తామని చెప్పారు. కేరళంలో సరైన అవకాశాలు లేకపోవడం వల్లనే యువత.. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లారని, ప్రస్తుతం వృద్ధులు, చిన్నపిల్లలే కనిపిస్తున్నారన్నాని, ఇది దురదృష్టకరమని రేవంత్‌ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యావంతులు, నైపుణ్యం ఉన్న యువత విదేశాలకు వెళ్లడం సరికాదని, వారు ఇక్కడికి తిరిగి వచ్చి ఉపాధి పొందేలా చూస్తామని తెలిపారు. తెలంగాణలో మాదిరిగానే అభివృద్ధి మౌలిక వసతుల కల్పన, ఉద్యోగ నియామకాలు, స్వీయ ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం వంటివి కేరళంలో అమలు చేస్తామన్నారు. తెలంగాణలో తాము 67 వేల ఉద్యోగాలు ఇచ్చామని, 25 లక్షల రైతు కుటుంబాలకు చెందిన రూ.20,670 కోట్ల రుణమాఫీ చేశామని, 4 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామని, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ సరఫరా చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని చెప్పారు. ‘‘పినరాయి విజయన్‌తో పాటు కేరళ కమ్యూనిస్టు నాయకులను తెలంగాణకు ఆహ్వానిస్తున్నా.. వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లు మేం చేస్తాం. తెలంగాణలోని ఏ మూలకైనా వెళ్లి మేం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వారు పరిశీలించవచ్చు’’ అని రేవంత్‌ సవాల్‌ విసిరారు. కేరళంలో ప్రచారం ముగించుకొని మంగళవారం రాత్రి తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నారు.


మీ ప్రభుత్వం స్వచ్చమైనదే అయితే..

కేరళంలో పినరాయి విజయన్‌ నేతృత్వంలోని ఎల్డీఎఫ్‌ ప్రభుత్వం స్వచ్చమైనదే అయితే.. బంగారం స్మగ్లింగ్‌ కేసు ఇంకా అపరిష్కృతంగానే ఎందుకు ఉందని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ కేసులో సీఎంవో ఉన్నతాధికారులు, కీలకమైన వ్యక్తులకు సంబంధాలున్నట్లుగా డాక్యుమెంట్లతో సహా నిరూపితమైందని పేర్కొన్నారు. శబరిమల అయ్యప్ప ఆలయం నుంచి 4.5 కిలోల బంగారం అక్రమ తరలింపు ఆరోపణలపై సీఎం విజయన్‌ ఎందుకు జవాబు చెప్పడం లేదని నిలదీశారు. కేరళం రాష్ట్రం ఇప్పటిదాకా సాధించిన విజయాలన్నీ యూడీఎఫ్‌ ప్రభుత్వాల పనితీరు ఫలితమేనన్నారు. గడిచిన పదేళ్ల ఎల్డీఎఫ్‌ ప్రభుత్వ హయాంలో ఏం చేశారన్నది కేరళ ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ సీఎంతో చర్చకు దిగే ఉద్దేశం తనకు లేదంటూ కేరళ సీఎం పినరాయి విజయన్‌ రాసిన లేఖకు రేవంత్‌రెడ్డి ఈ మేరకు ప్రత్యుత్తరం రాశారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నీతి ఆయోగ్‌ ఎస్డీజీ సూచిక 2023-24ను విజయన్‌ ఉదహరిస్తున్నారని, అయితే అది పదేళ్ల బీఆర్‌ఎస్‌, బీజేపీ దుష్పరిపాలన చివరి దశ అని పేర్కొన్నారు. గడిచిన 28 నెలల ప్రజాప్రభుత్వ పనితీరు ఆధారంగా తమను అంచనా వేయాలని విజయన్‌కు సూచించారు. 2024-25లో తెలంగాణ జీఎస్డీపీ రూ.16.12 లక్షల కోట్లుగా నమోదైందని, ఇది 10.7 శాతం వృద్ధి రేటుతో జాతీయ సగటు 9.9 శాతం కంటే ఎక్కువ అని తెలిపారు. తెలంగాణ తలసరి ఆదాయం రూ.3.87 లక్షలకు చేరుకుందని, దేశంలోనే ముందు స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. ఆర్‌బీఐ హ్యాండ్‌బుక్‌ 2024-25 గణాంకాల ప్రకారం కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళం రాష్ర్టాలను తెలంగాణ అధిగమించిందని తెలిపారు.


ఆ కుటుంబాలు పథకాలు ఎలా పొందుతున్నాయి?

2025 చివరి నాటికి తీవ్ర పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించిన మొదటి రాష్ట్రంగా కేరళం నిలవనున్నట్లు విజయన్‌ ట్వీట్‌ చేశారని సీఎం రేవంత్‌ తెలిపారు. కానీ, ఆయన తనకు రాసిన లేఖలో 64,006 కుటుంబాలు ఇప్పటికీ పథకాలను పొందుతున్నాయని పేర్కొన్నారని గుర్తు చేశారు. తమ ప్రజా ప్రభుత్వం తెలంగాణ రైజింగ్‌-2047 దార్శనికతతో ముందుకు వెళుతోందని తెలిపారు. హైదరాబాద్‌ సమీపంలోని ఫ్యూచర్‌ సిటీ, జహీరాబాద్‌లోని జాతీయ పారిశ్రామిక కారిడార్‌ వంటివి నిర్మించి ఒక దశాబ్దంలోనే రూ.1 ట్రిలియన్‌ ఆర్థిక వ్యవస్థను సాధించడమే లక్ష్యంగా తాము ముందుకు వెళుతున్నట్లు వివరించారు. అలాగే కేరళంలో రాబోయే కొద్ది రోజుల్లో ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వం ‘నవ కేరళం’ దార్శనికతను అమలు చేస్తుందని తాను బలంగా విశ్వసిస్తున్నట్లు రేవంత్‌రెడ్డి తెలిపారు. కేరళం ప్రజలు త్వరలోనే ఈ మేరకు నిర్ణయం తీసుకుంటారని, జరగాల్సినది కూడా అదేనని అన్నారు.

Updated Date - Apr 08 , 2026 | 06:35 AM