రాక్షసులను మళ్లీ రానివ్వం
ABN , Publish Date - Apr 07 , 2026 | 05:14 AM
ఆనాడు నిజాం ప్రభుత్వ హయాంలో ఆదిలాబాద్ బిడ్డలు రాంజీ గోండు, కుమ్రం భీం గడీలను బద్దలు కొట్టారు. అదే గడ్డపై నుంచి చెబుతున్నా.. మళ్లీ గడీల పాలన రానివ్వం. రాక్షసులను మరోసారి పాలించనివ్వబోం.....
గత ప్రభుత్వ హయాంలో భార్యాభర్తలూ మాట్లాడుకునే పరిస్థితి ఉండేది కాదు
ఇప్పుడు ప్రజలంతా స్వేచ్ఛగా బతుకుతున్నారు
6 గ్యారెంటీల్లో కొన్ని అమలు.. దశలవారీగా అన్నీ
తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల నిర్మిస్తాం
ఈసారి బతుకమ్మ పండుగకు చిలుకపచ్చ చీరలు
పిప్రి బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ సీఎంల కృషీ మీ ఖాతాలోనేనా?
పినరాయి వ్యాఖ్యలపై రేవంత్ 6 పేజీల లేఖ
నేడు కేరళకు రేవంత్.. 4 రోడ్‌షోలు
ఆదిలాబాద్, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): ‘‘ఆనాడు నిజాం ప్రభుత్వ హయాంలో ఆదిలాబాద్ బిడ్డలు రాంజీ గోండు, కుమ్రం భీం గడీలను బద్దలు కొట్టారు. అదే గడ్డపై నుంచి చెబుతున్నా.. మళ్లీ గడీల పాలన రానివ్వం. రాక్షసులను మరోసారి పాలించనివ్వబోం’’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతినబూనారు. గత ప్రభుత్వ హయాంలో ఆలుమగలు (భార్యభర్తలు) మాట్లాడుకునే పరిస్థితి ఉండేది కాదని గుర్తు చేశారు. అవి మాట్లాడుకోవడానికే భయపడే రోజులని, కానీ, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు పూర్తి స్వేచ్ఛతో బతుకుతున్నారని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో రూ.1,238 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు సోమవారం సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రజా పాలన-ప్రగతి బాట బహిరంగ సభకు హాజరై ప్రసంగించారు. ఆరు గ్యారంటీల్లో కొన్నింటిని అమలు చేస్తున్నామని, దేనికైనా కొంత ఓపిక ఉండాలని, దశలవారీగా పథకాలను అమలు చేస్తామని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వంద సీట్లు సాధించి మళ్లీ ప్రజా ప్రభుత్వం వస్తుందని భరోసా వ్యక్తం చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు ఉంటాయని, ప్రతిపక్షాలు రాజకీయ ప్రత్యర్థులే తప్ప శాశ్వత శత్రువులు కాదని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాజకీయాలకు అతీతంగా తమ ప్రభుత్వ పాలన ఉంటుందన్నారు. ‘‘చట్టసభలు, బహిరంగ సభల్లో ప్రతిపక్ష నేతలకూ మాట్లాడే అవకాశం మా ప్రభుత్వం కల్పిస్తోంది. మా ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లోనూ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో ఈ సంస్కృతి ఉండేదా!?’’ అని ఆయన ప్రశ్నించారు.
హామీలను నెరవేర్చేందుకే వచ్చాం
‘‘ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిప్రి గ్రామం నుంచే పీపుల్స్ మార్చ్‌ను ప్రారంభించారు. ప్రజల గుండెను తడుతూ వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆనాడు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకే మళ్లీ పిప్రి గ్రామానికి వచ్చాం’’ అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే పుష్కరాల్లోపు బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి నది వెంట ఉన్న ఆలయాలను అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేస్తామన్నారు. పాలమూరు జిల్లాతో సమానంగా ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేస్తామన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగునీటిని అందిస్తామని తెలిపారు. ఎర్రబస్సు ఎరగని ఆదిలాబాద్ జిల్లాలో వచ్చే జూన్ 2వ తేదీలోపు ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులను ప్రారంభిస్తామని చెప్పారు. ‘‘జిల్లాల సరిహద్దులను మార్చవద్దని కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. 2029 మార్చి 31 వరకు మండలాలు, రెవెన్యూ డివిజన్లను మార్పు చేసే అవకాశం లేదు. ఆ తర్వాత కమిషన్ వేసి బోథ్‌తోపాటు ఇతర ప్రాంతాలను రెవెన్యూ డివిజన్‌గా మార్చే అవకాశం ఉంది’’ అని హామీ ఇచ్చారు. బతుకమ్మ పండుగకు గతంలో ఆడబిడ్డలకు పాలపిట్ట రంగు చీరలను పంపిణీ చేశామని, వచ్చే పండుగకు చిలుక పచ్చ రంగు చీరల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.

అంతరాలు లేని సమాజమే మా ప్రభుత్వ లక్ష్యం: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
అంతరాలు లేని సమాజం కోసం రాష్ట్రవ్యాప్తంగా 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని, వీటిలో అంతర్జాతీయ వసతులు, సౌకర్యాలను కల్పిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి చెప్పారు. పిప్రి బహిరంగ సభ ఏర్పాటు ఆలోచన ముఖ్యమంత్రిదేనని, అది తన ఆలోచన కాదని తెలిపారు. ఈ రాష్ట్రంలో పుట్టడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. పీపుల్స్ మార్చ్ సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చేందుకే పిప్రి గ్రామానికి మళ్లీ వచ్చామని చెప్పారు. పిప్రి నుంచి ఖమ్మం జిల్లా వరకు 1,400 కి.మీల మేర ప్రజలకు అనేక హామీలు ఇచ్చామని, వాటన్నింటినీ ప్రజా ప్రభుత్వం నెరవేరుస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి మానవత్వం ఉందని, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తో 5 లక్షల జీవితా బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నామని అన్నారు. తనతోపాటు సీఎం, క్యాబినెట్‌లో ఉన్న వారంతా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారేనని, పేదల సమస్యలు, బాధలన్నీ తెలుసని అన్నారు.