కలవమంది కేంద్రంతోనే!
ABN , Publish Date - May 12 , 2026 | 04:32 AM
ప్రధాని నరేంద్ర మోదీ తనను కలవమని చెప్పింది కేంద్ర ప్రభుత్వంతో మాత్రమేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అది కూడా రాష్ట్ర అభివృద్ధి కోసమేనని తేల్చిచెప్పారు.
మోదీ చెప్పింది రాష్ట్రాభివృద్ధి గురించే.. అందులో రాజకీయాలకు తావులేదు
వేరేగా అనుకుంటే అవగాహన లోపమే
బీజేపీ ప్రజల్ని విభజించి పాలించే పార్టీ
కలిసిరాకుంటే ఖతం చేయడం వారి విధానం
మోదీ.. గాలి తిని బతకమంటున్నారు
తెలంగాణలో గెలుస్తామని భ్రమ పడుతున్నారు
బీజేపీ తిరిగి రెండు సీట్ల పార్టీగా మారుతుంది
మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి
బడుల ప్రారంభం రోజే డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ
విద్యార్థులకు విద్యా సామగ్రి కిట్ల పంపిణీ
గవర్నర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ ఆహ్వానం
హైదరాబాద్, మే 11 (ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్ర మోదీ తనను కలవమని చెప్పింది కేంద్ర ప్రభుత్వంతో మాత్రమేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అది కూడా రాష్ట్ర అభివృద్ధి కోసమేనని తేల్చిచెప్పారు. దాన్ని వేరేవిధంగా అర్థం చేసుకున్నారంటే అది వారి అవగాహన లోపమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు సహకరించాలని తాను కోరానని గుర్తు చేశారు. ప్రధాని కూడా అదే ఉద్దేశంతో స్పందిస్తూ, కేంద్రంతో కలవాలని ఆహ్వానించారని, అందులో ఎలాంటి రాజకీయాలకు తావులేదని స్పష్టం చేశారు. అభివృద్ధి ఒక్కరితోనే సాధ్యం కాదని, కేంద్రంతో కలిసి పని చేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్న భావనతోనే మోదీ అలా అన్నారని తెలిపారు. ఆదివారం హెచ్‌ఐసీసీలో ఏర్పాటు చేసింది అధికారిక కార్యక్రమం అని చెప్పారు. అభివృద్ధి-సంక్షేమంలో కేంద్రంతో కలిసి వెళ్లేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. సోమవారం రేవంత్‌రెడ్డి తన నివాసంలో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లేదని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పలు ప్రాజెక్టులకు ఆమోదం రావడం లేదని చెప్పారు. గత పదేళ్లలో కేసీఆర్ కేంద్రాన్ని ఏమీ అడగలేదని, పైగా మీ నిధులు వద్దని, ప్రేమ చాలంటూ మెదక్ సభలో మోదీతో కేసీఆర్ అన్నారని గుర్తు చేశారు. దేశ ప్రజలు ఏడాది పాటు బంగారం కొనొద్దని, పెట్రోల్, డీజీల్ వినియోగాన్ని తగ్గించాలని, విమానం ఎక్కొద్దంటూ మోదీ పిలుపునివ్వడాన్ని రేవంత్ తీవ్రంగా తప్పుబట్టారు. కేంద్రం వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజలపై నిషేధం విధిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షోభం పీకల మీదకు వచ్చాక మోదీ ప్రజలకు పొదుపు మంత్రం ఉపదేశిస్తున్నారని మండిపడ్డారు. విదేశాంగ విధానంలో ప్రతిపక్షాల సూచనలను తీసుకోకుండా అహంకారంతో వ్యవహరించి దేశాన్ని సంక్షోభంలోకి నెట్టారన్నారు. తెలంగాణ ప్రజలను గాలి తిని గాల్లో బతకమని మోదీ చెప్పి వెళ్లారని ఎద్దేవా చేశారు. బీజేపీకి సంక్షోభాలు సృష్టించడమే తప్ప మేనేజ్ చేయడం చేతకాదన్నారు. రాహుల్‌గాంధీ గత ఆర్నెల్లుగా చెబుతున్న విషయాన్నే ఇప్పుడు కేంద్రం చెబుతోందని వ్యాఖ్యానించారు. ఈ ఏడాది నుంచి పాఠశాల దరఖాస్తుల్లో యాంటీ డ్రగ్ అనే కాలమ్ పెట్టామని రేవంత్ తెలిపారు. మూసీ మొదటి దశకు రూ.7,500కోట్లు అవసరమని తేలిందని చెప్పారు.

బీజేపీ అంటే బ్రిటీష్ జనతా పార్టీ
కేంద్ర ప్రభుత్వం రీజినల్ రింగు రోడ్డు దక్షిణభాగం, మెట్రో రెండో దశ సహా పలు అంశాలపై జాప్యం చేస్తోందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తరభాగం, మామునూరు విమానాశ్రయం, ఎలివేటెడ్ కారిడార్లకు రక్షణ శాఖ భూములు, మూసీకి ఏడీబీ నుంచి రుణం, బుల్లెట్ రైళ్లు లాంటి కొన్నింటినే ఇచ్చిందని తెలిపారు. అవి కూడా ఎప్పుడో రావాల్సినవని, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇన్నాళ్లు పెండింగ్‌లో పడ్డాయని చెప్పారు. రెండు లోకసభ స్థానాలతో మొదలు పెట్టిన బీజేపీ తిరిగి అక్కడికే వెళుతుందని రేవంత్ వ్యాఖ్యానించారు. బీజేపీ అంటే బ్రిటీష్ జనతా పార్టీ అని, విభజించి పాలించడమే వారి విధానమని విమర్శించారు. మావోయిస్టులు, ముస్లింలు ఈ దేశ ప్రజలు కాదా అని రేవంత్ ప్రశ్నించారు. ప్రధాని హోదాలో మోదీ ముస్లింలు, మావోయిస్టులపై అలా మాట్లాడడం దురదృష్టకరమన్నారు. తమ సిద్ధాంతాన్ని కాదన్న వారిని ఖతం చేసేది బీజేపీ అయితే కన్విన్స్ చేసేది కాంగ్రెస్ అని చెప్పారు. సంక్షేమం, ఇల్లు, సామాజిక న్యాయం కోసం మావోయిస్టులు కొట్లాడారని, ఇప్పుడు ఆ సమస్యలు తగ్గిపోయాయి కాబట్టి వారి ప్రాబల్యం తగ్గిపోయిందని చెప్పారు. వారిని అంతం చేయాలన్న ఆలోచన తప్పని వ్యాఖ్యానించారు. మావోయిస్టులను ఎన్‌కౌంటర్ చేసి చంపడం సమంజసం కాదన్నారు. తమ ప్రభుత్వంలో 818 మంది మావోయిస్టులు ఆయుధాలతో లొంగి పోయారని చెప్పారు. ఒక్క ప్రాణం కూడా పోకుండా మావోలను శాంతి మార్గంలోకి తీసుకొచ్చామన్నారు.
‘సర్’ బీజేపీ ఆయుధం
బీజేపీ ఎన్నికల వ్యూహం నిజానికి జెమినీ సర్కస్ లాంటిదని, దాన్ని నమ్ముకొని తెలంగాణలో అధికారంలోకి వస్తామని సంబరపడుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)ను ఆయుధంగా ఉపయోగిస్తోందని రేవంత్ మండిపడ్డారు. బెంగాల్లో 90 లక్షల ఓట్లను తొలగించి, ఎవరూ పరిష్కరించలేని సంక్షోభాన్ని సృష్టించారని గుర్తు చేశారు. ఏ రాష్ట్రంలో గెలవాలంటే అక్కడ ‘సర్’ను ప్రయోగిస్తున్నారని తెలిపారు. తెలంగాణలో ‘సర్’పై ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పారు. యూరియాను కేంద్రం ఇస్తే రాష్ట్రాలు సక్రమంగా పంపిణీ చేయాలని, రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం రాష్ట్రమే యూరియా ఇవ్వాలన్నట్లు హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణలో బీజేపీ-బీఆర్‌ఎస్ కలిసే ఉన్నాయని సీఎం వ్యాఖ్యానించారు. ఎంఐఎంతో కాంగ్రెస్ కుమ్మక్కయిందని బీజేపీ, బీజేపీతో అయ్యారని బీఆర్‌ఎస్ వాళ్లు, బీఆర్‌ఎ్‌సతో కమ్మక్కయ్యారంటూ ఎంఐఎం నేతలు కాంగ్రెస్‌ను నిందిస్తున్నారని ప్రస్తావించారు. తాము నిజానికి కమ్యూనిస్టులు, కోదండరాంతో కలిసి ఉన్నామని తేల్చిచెప్పారు. హైదరాబాద్ సభలో మోదీ సీఎంను విమర్శించకుండా కాంగ్రెస్‌ను మాత్రమే విమర్శించారని విలేకరులు ప్రస్తావించగా, కాంగ్రెస్ ను విమర్శిస్తే తనను విమర్శించినట్లేనని చెప్పారు.
తుమ్మిడిహెట్టిపై ప్రధానికి లేఖ రాశా
తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై ఇప్పటికే మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాశానని, మహారాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించేలా చూడాలని ప్రధాని మోదీకి కూడా మరో లేఖ రాశానని రేవంత్ వెల్లడించారు. రెండు రాష్ట్రాల మధ్య ప్రధాని పెద్దరికం వహిస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు.రాష్ట్రంలో యాసంగి దిగుబడి విపరీతంగా వచ్చిందని, కొన్నిచోట్ల ధాన్యం తడిసిందని, అది కూడా కొంటున్నామన్నారు. రాష్ట్రంలో పంట మార్పిడిపై విస్తృతంగా చర్చ జరగాలని, తానూ రైతులతో మాట్లాడతానని చెప్పారు.
కేసీఆర్, హరీశ్‌కు ఉరిశిక్ష పడేంత పనైంది..
కాళేశ్వరం కమిషన్ నివేదికతో కేసీఆర్, హరీశ్‌లకు ఉరిశిక్ష పడ్డంత పనైందని, కప్పిపుచ్చుకోవడానికిదొంగ మాటలు మాట్లాడుతున్నారని సీఎం అన్నారు. హ్యామ్ రోడ్లపై టెండర్లు అధిక ధరలకు వేశారని హరీశ్ ఆరోపిస్తున్నారని టెండర్లు తెరవకుండానే ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ హయాంలో ఎక్సెస్ ధరలకు ఇచ్చిన పనులను బయటకు తీసి విచారణ చేయిస్తే జైళ్లలో గోచీలతో ఉండాల్సి వస్తుందని హెచ్చరించారు. కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్లు, ఫార్ములా ఈ కారు రేసు సహా విచారణలు జరుగుతున్నాయని, శిక్షలు వేయడం కోర్టుల పని అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల ఇళ్లకు మోదీ వెళ్లడంపై రేవంత్‌రెడ్డి స్పందిస్తూ ఎవరు ఎవరినైనా ప్రేమించుకోవచ్చని వ్యాఖ్యానించారు.
సీట్ల పెంపుపై అభ్యంతరాలు ఉన్నాయి
మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన, జమిలి ఎన్నికలు, జనగణన... నాలుగూ పరస్పరం సంబంధం లేని అంశాలని, బీజేపీ వాటిని ఒకదానికొకటి ముడి పెడుతోందని రేవంత్‌రెడ్డి విమర్శించారు. మహిళా రిజర్వేషన్లను 2011 జనాభా లెక్కల ఆధారంగా యథాతథంగా అమలు చేస్తామంటే ఎవరూ అభ్యంతరం చెప్పరని అన్నారు. లోకసభ నియోజకవర్గాలను 50 శాతం పెంచడంలో ఒక ఫార్ములా ఏమీ లేదన్నారు. ఈశాన్య రాష్ట్రాలకు జనాభా ప్రకారం చేస్తామంటే ఎలా కుదురుతుందని, వారికి రాజ్యాంగంలోనే ప్రత్యేక మినహాయింపు ఉందని గుర్తుచేశారు. పునర్విభజనతో సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్లను, జమిలి ఎన్నికలను నిర్వహించుకోవచ్చని చెప్పారు. అసలు సీట్ల పెంపును వాజ్‌పేయు తరహాలో మరో 25ఏళ్లు వాయిదా వేసినా నష్టం లేదన్నారు. దేశంలోని అన్ని జిల్లాల్లో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పబ్లిక్ హియరింగ్ నిర్వహించి సీట్ల పెంపు మీద నిర్ణయం తీసుకోవాలని రేవంత్ డిమాండ్ చేశారు. యాభై శాతం రిజర్వేషన్లు, యాభై శాతం మెరిట్ అని సుప్రీంకోర్టే చెప్పిందని, నియోజకవర్గాల పునర్విభజనకు కూడా అదే సూత్రం వర్తింపజేయాలని సూచించారు. రాష్ట్రంలో నియోకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపడితే పూర్తి కావడానికి కనీసం ఏడాది పడుతుందని చెప్పారు. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు కోసం విజయ్ పార్టీకి తొలుత గవర్నర్ అవకాశం ఇవ్వకపోవడంపై విలేకరులు అడగ్గా బీజేపీకి ప్రజాస్వామ్యంపై గౌరవం లేదని చెప్పారు.