కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థి మాత్రమే.. శత్రువు కాదు: సీఎం రేవంత్ రెడ్డి
ABN , Publish Date - Apr 27 , 2026 | 03:13 PM
కేసీఆర్ తనకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని, వ్యక్తిగతంగా ఆయనపై ఎలాంటి ద్వేషం లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ ఆరోగ్యంగా ఉంటేనే తనకు మంచిదని, రాజకీయంగా ఆయనను ఎదుర్కోవడం కూడా సులభమవుతుందని తెలిపారు.
హైదరాబాద్: మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై తాను ఎప్పుడూ నెగటివ్‌గా ఆలోచించలేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ తనకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని, శత్రువు కాదని అన్నారు. కేసీఆర్ ఆరోగ్యంగా ఉండటం తనకే మంచిదని, రాజకీయంగా ఎదుర్కోవడం సులభమవుతుందని వ్యాఖ్యానించారు. విశ్రాంతి తీసుకుంటున్న ప్రజా ప్రతినిధి గురించి చెడు కోరుకోవడం తన స్వభావం కాదని తెలిపారు. కేసీఆర్‌కు గాయమైనప్పుడు ఆస్పత్రికి వెళ్లి పరామర్శించానని, అసెంబ్లీకి వచ్చినప్పుడు కూడా ఆయన్ను కలిసి యోగక్షేమాలు అడిగానని రేవంత్ రెడ్డి తెలిపారు. రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా గౌరవం ఉందని పేర్కొన్నారు. కేసీఆర్‌కు చెడు జరగాలని ఆయన కుటుంబ సభ్యులే కోరుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ బతికి ఉంటే తమకు అధికారం రాదని ఆయన కుటుంబ సభ్యులే భావిస్తున్నారని వ్యాఖ్యానించారు.
వాళ్ళంతా ఒక్కటే..
కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని మంత్రులతో ప్రకటనలు చేయించారని ఆరోపించారు. అధికార పంపకాల విషయంలో తేడాలు రావడంతో కుటుంబంలో విభేదాలు వచ్చాయని అన్నారు. అయితే, వాళ్లంతా ఒక్కటేనని వ్యాఖ్యానించారు. అనుబంధ సంఘాలను ప్రభుత్వంపై రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్‌కు ఓటమి కొత్తేమీ కాదు..
కేసీఆర్‌ను ఇప్పటికే రెండు సార్లు ఓడించానని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్‌కు ఓటమి కొత్త విషయం కాదని, అలాగే గెలుపు కాంగ్రెస్ పార్టీకి కొత్త కాదని అన్నారు. మహేష్ గౌడ్ వర్సెస్ కేసీఆర్‌గా జరిగిన స్థానిక సంస్థల పోరులో కూడా కేసీఆర్ ఓటమి చవిచూశారని గుర్తు చేశారు. తాము వివక్ష లేకుండా ప్రభుత్వం నడుపుతున్నామని, అన్ని వర్గాల ప్రజలకూ సమన్యాయం చేస్తూ పాలన కొనసాగిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Also Read:
అషురెడ్డి కేసులో షాకింగ్ ట్విస్ట్.. సూసైడ్ బెదిరింపుల ఆరోపణలు
ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాం ప్రమాణ స్వీకారం.. హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి
For More latest News