Share News

ఇప్పుడు వెళ్తున్నా.. మళ్లీ ఆరోజు తిరిగి వస్తా

ABN , Publish Date - Apr 27 , 2026 | 02:52 PM

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత ప్రచారానికి మరి కొద్ది గంటల్లోనే తెరపడనుంది. ర్యాలీలు, రోడ్‌షోలతో విస్తృత ప్రచారం సాగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చివరిసారిగా బరాక్‌పూర్‌లో సోమవారం జరిగిన ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు.

ఇప్పుడు వెళ్తున్నా.. మళ్లీ ఆరోజు తిరిగి వస్తా
PM Modi

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత ప్రచారానికి మరి కొద్ది గంటల్లోనే తెరపడనుంది. ర్యాలీలు, రోడ్‌షోలతో విస్తృత ప్రచారం సాగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) చివరిసారిగా బరాక్‌పూర్‌లో సోమవారం జరిగిన ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. ఇదే తన చివరి ప్రచార ర్యాలీ అని, పార్టీ చక్కటి ఫలితాలు రాబడుతుందనే నమ్మకం ఉందని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుందనే సంకేతాలు ఇస్తూ, బీజేపీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి మళ్లీ వస్తానని తెలిపారు.


'ఈ ఎన్నికలకు సంబంధించి ఇదే నా చివరి ర్యాలీ. మే 4న ఫలితాలు వెలువడిన తర్వాత బీజేపీ ప్రమాణస్వీకారానికి కచ్చితంగా వస్తాననే నమ్మకంతో తిరిగి వెళ్తున్నారు. హెలిపాడ్ నుంచి నేను రెండు కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడకు వచ్చారు. దారికి రెండు వైపులా వేలాది మంది ప్రజలు బారులు తీరారు. ఇంత పొద్దున్నే జనం పెద్ద సంఖ్యలో నన్ను ఆశీర్వదించడానికి వస్తారని ఊహించలేదు' అని మోదీ ఆనందం వ్యక్తం చేశారు.


టీఎంసీపై విమర్శల దాడి

అధికార తృణమూల్ కాంగ్రెస్‌పై మోదీ విమర్శలు గుప్పించారు. టీఎంసీ పాలనలో రాష్ట్రంలో పారిశ్రామిక కార్యకలాపాలు తగ్గిపోయాయని, ఫ్యాక్టరీలు మూతపడ్డాయని, పశ్చిమబెంగాల్ భవిష్యత్ అభివృద్ధికి సంబంధించిన రోడ్‌మ్యాప్ టీఎంసీ ప్రభుత్వం వద్ద లేదని అన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం అవసరం ఇక్కడ ఎంతైనా ఉందని, కేంద్ర-రాష్ట్రాల సమన్వయంతోనే వేగవంతమైన వృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. టీఎంసీ సిండికేట్ వ్యవస్థ భూస్థాపితం కావాలన్నారు, నిర్మాణాత్మక పాలనకు బదులు బెదిరింపులు, మోసపూరిత రాజకీయాలపైనే టీఎంసీ ఆధారపడిందని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలకు ఏమాత్రం భద్రత లేదని, ప్రజావిశ్వాసాన్ని టీఎంసీ కోల్పోయిందని, అది గుర్తుంచుకుని మహిళా ఓటర్లు ఓటు వేయాలని కోరారు.


లండన్‌ తరహాలో కోల్‌కతా అభివృద్ధి చేస్తామని టీఎంసీ గతంలో ఇచ్చిన హామీలను మోదీ ప్రస్తావిస్తూ, గత 15 ఏళ్లుగా కోల్‌కతా తన గుర్తింపును కోల్పోయిందని, అక్రమ చొరబాటుదారులు సిటీలో సెటిల్ అయ్యారని అన్నారు. నగర పూర్వ వైభవాన్ని పరిరక్షించేందుకు కోల్‌కతా వాసులంతా సమష్టిగా కృషి చేయాలని కోరారు. మెరుగైన శాంతి భద్రతల కోసం ఓటర్లు 'కమలం' గుర్తును ఎంచుకోవాలని కోరారు. యువతకు సకాలంలో ప్రభుత్వ నియామకాలు జరుపుతామని, ఖాళీ ఉన్న పోస్టులు భర్తీ చేస్తామని, ఉద్యోగులకు 7వ వేతన కమిషన్ ప్రయోజనాలు చూకూరుస్తామని, జీరామ్‌జీ గ్రామీణ ఉపాధి పథకం అమలు చేస్తామని చెప్పారు. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలివిడత పోలింగ్ ఈనెల 23న జరుగగా, 29న తుది విడత పోలింగ్ జరుగనుంది. మే 4న ఫలితాలు వెలువడతాయి.


ఇవి కూడా చదవండి..

బీజేపీలో ఆప్ ఎంపీల విలీనానికి రాజ్యసభ ఛైర్మన్ గ్రీన్ సిగ్నల్..

మోదీ 'ఝల్ మురీ' తింటే.. మమతకు ఎందుకు కోపం వచ్చింది?

Updated Date - Apr 27 , 2026 | 03:35 PM