మోదీ 'ఝల్ మురీ' తింటే.. మమతకు ఎందుకు కోపం వచ్చింది?
ABN , Publish Date - Apr 27 , 2026 | 08:02 AM
ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాజకీయాలు 'మరమరాల మిక్చర్' ప్రధానాంశంగా నడుస్తున్నాయి. మోదీ, మమతా బెనర్జీ మధ్య ఒకప్పుడు కేవలం ఆహారం, ఆరోగ్యం గురించి ఇదే మిక్చర్ మీద జరిగిన చర్చ, ఇప్పుడు ఇద్దరు అగ్రనేతల మధ్య ప్రధాన విమర్శనాస్త్రంగా మారింది.
ఇంటర్నెట్ డెస్క్, ఏప్రిల్ 27: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరిన వేళ ప్రధాని మోదీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్య 'ఝల్ మురీ' (మరమరాల మిక్చర్) చుట్టూ ఆసక్తికరమైన రాజకీయ పోరు సాగుతోంది. గత వారం ఏప్రిల్ 19, 2026 (ఆదివారం) బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జార్గ్రామ్ (Jhargram)లో ర్యాలీ ముగించుకుని వెళ్తుండగా ప్రధాని మోదీ హఠాత్తుగా తన కాన్వాయ్‌ను ఆపి, రోడ్డు పక్కన ఉన్న ఒక చిన్న బండి వద్ద 'ఝల్ మురీ' తిన్నారు. ఈ సందర్భాన్ని మోదీ తన ఎక్స్ ఖాతా ద్వారా నెటిజన్లతో పంచుకున్నారు.
మోదీ ఝల్ మురీ తినడంపై సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇది కేవలం మోదీ చేస్తున్న ఎన్నికల స్టంట్ గా దీదీ విమర్శలు చేస్తున్నారు. ఓటర్లను ఆకర్షించడానికి మోదీ ఆడిన ప్రీప్లాన్డ్ నాటకం అంటున్నారు. ప్రధాని ఆగుతారని అక్కడ కెమెరాలు, మైకులు ముందే ఎలా సిద్ధంగా ఉన్నాయి? ఎస్పీజీ భద్రత మధ్య అప్పటికప్పుడు ఝల్ మురీ ఎలా వస్తుంది? అని ఆమె ప్రశ్నించారు. అంతేకాకుండా, మోదీ స్నాక్ బ్రేక్ వల్ల ఆ ప్రాంతంలో నో-ఫ్లై జోన్ విధించారని, దీనివల్ల జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ హెలికాప్టర్ ప్రయాణానికి ఆటంకం కలిగిందని ఆమె ఆరోపిస్తున్నారు. ఇది గిరిజన నేతలను అవమానించడమేనని కూడా ఆమె విమర్శించారు.
ఇది ప్రస్తుత ఉదంతం అయితే, ఇంతకు ముందు కూడా మోదీ-మమత మధ్య 'ఝల్ మురీ' టాక్ నడిచింది. ప్రధాని నరేంద్ర మోదీ మే 2015లో పశ్చిమ బెంగాల్ పర్యటనకు వెళ్ళారు. కోల్‌కతాలో వివిధ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత, ప్రధాని మోదీ తిరుగు ప్రయాణంలో విమానాశ్రయానికి వెళ్తుండగా మమతా బెనర్జీ కూడా ఆయనతో కలిసి ప్రయాణించారు. ఆ సమయంలో ఆయనకు బెంగాల్ స్పెషల్ అయిన 'ఝల్ మురీ' రుచి చూడాలని అనిపించింది. దీంతో విమానాశ్రయానికి వెళ్లే దారిలో మోదీ, సీఎం మమతతో 'నాకు కొంచెం ఝల్ మురీ తినాలని ఉంది, ఎక్కడ దొరుకుతుంది?' అని అడిగారు. దానికి ఆమె నవ్వుతూ.. 'నేను మీకు ఝల్ మురీ ఇవ్వలేను, కావాలంటే తాజా కూరగాయలు (Veggies) ఇస్తాను, అవి ఆరోగ్యానికి మంచివి' అని చెప్పారు. తాను ఎప్పుడూ నూనె పదార్థాల కంటే ఆరోగ్యకరమైన ఆహారానికే ప్రాధాన్యత ఇస్తానని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.
అయితే, భద్రతా కారణాలు లేదా సమయాభావం వల్ల అప్పుడు వెంటనే ప్రధాని మోదీకి ఝల్ మురీ ఇవ్వడం మమతకు సాధ్యం కాలేదు. కానీ, మోదీ విమానం ఎక్కే లోపు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరపున ప్రత్యేకంగా ఝల్ మురీ, సందేష్, సమోసాలను ప్యాక్ చేసి ఇచ్చారు. ఈ విషయాల్ని మమతా బెనర్జీ మే 10, 2015న విలేకరులతో మాట్లాడుతూ సరదాగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఇదే 'ఝల్ మురీ' రాజకీయ విమర్శలకు కారణం కావడం గమనార్హం.
ఇలా ఉండగా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ప్రస్తుతం జరుగుతున్నాయి. భారత ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, మొత్తం 294 నియోజకవర్గాలకు గాను రెండు దశల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. మొదటి దశ ఏప్రిల్ 23, 2026 (గురువారం) 152 స్థానాలకు పోలింగ్ ఇప్పటికే ముగిసింది. రెండవ దశ ఏప్రిల్ 29, 2026 (బుధవారం) మిగిలిన 142 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి మే 4, 2026 (సోమవారం) జరుగుతుంది.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఎన్నికల నిబంధనల ప్రకారం, పోలింగ్ ముగియడానికి 48 గంటల ముందే ప్రచారం ముగియాలి. ఆ లెక్కన పశ్చిమ బెంగాల్ రెండో దశ ఎన్నికల ప్రచార గడువు ఏప్రిల్ 27, 2026 (ఈరోజు) సాయంత్రం 6 గంటలకి ప్రచార పర్వం ముగుస్తుంది. అంటే, నేటి సాయంత్రం నుంచి అభ్యర్థులు బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహించడానికి వీలుండదు. కేవలం ఇంటింటి ప్రచారానికి మాత్రమే అనుమతి ఉంటుంది. మే 4వ తేదీన బెంగాల్ పీఠాన్ని ఏ పార్టీ అధిరోహించబోతుంది అన్నది తేలిపోతుంది.

ఇక్కడ మరో విశేషమేంటంటే, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిన్న సాయంత్రం ఒక ర్యాలీ నుంచి తిరిగి వస్తుండగా భవానిపూర్‌లో కూరగాయలు కొనుగోలు చేశారు. ముఖ్యమంత్రి అప్పుడప్పుడు తన నియోజకవర్గంలోని కూరగాయల మార్కెట్‌ను సందర్శించడం తెలిసిందే అయినప్పటికీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 'ఝల్ మురీ' విరామంతో వార్తల్లో నిలిచిన కొద్ది రోజులకే ఆమె కూరగాయలు, పండ్లు కొనుగోలు చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. 71 ఏళ్ల ముఖ్యమంత్రి, ఆరోగ్యకరమైన ఎంపికల వైపే మొగ్గుచూపుతూ, తన షాపింగ్ బుట్టలో కొన్ని పండ్లను కూడా వేసుకుని ముందుకు సాగారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ప్రజావాణి సేవల విస్తరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
నటి అషురెడ్డి కుటుంబంపై నాన్ బెయిలబుల్ కేసు