మీ కరెంట్‌ను ఇక అమ్ముకోవచ్చు.. ఎనర్జీ ట్రేడింగ్‌ను తెచ్చిన స్టార్టప్ ‘రెంజీ’
ABN , Publish Date - May 23 , 2026 | 08:20 PM
భారతదేశ ఇంధన రంగాన్ని సరికొత్త పుంతలు తొక్కించేలా, దేశంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత రెసిడెన్షియల్ సోలార్ సర్వీసెస్ ప్లాట్‌ఫారమ్ 'రెంజీ అందుబాటులోకి వచ్చింది. దీంతో మీ ఇంట్లోనే విద్యుత్ ఉత్పత్తి చేసి అమ్ముకోవచ్చు.
హైదరాబాద్, నాలెడ్జ్ సిటీ, మే 23: భారతదేశ ఇంధన రంగాన్ని సరికొత్త పుంతలు తొక్కించేలా, దేశంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత రెసిడెన్షియల్ సోలార్ సర్వీసెస్ ప్లాట్‌ఫారమ్ 'రెంజీ (RENGY)' అందుబాటులోకి వచ్చింది. ఇవాళ (శనివారం) హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో జరిగిన 'రెనర్జైజ్ 2026' జాతీయ స్థాయి కాంక్లేవ్‌లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఈ సరికొత్త సేవలను అధికారికంగా ప్రారంభించారు.
భారతదేశ క్లీన్ ఎనర్జీ, స్టార్టప్ అండ్ పాలసీ లీడర్‌షిప్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సుకు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మైహోమ్స్ గ్రూప్ ఛైర్మన్ రామేశ్వర్ రావు, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం. రమేష్ రెడ్డి, తెలంగాణ రెడ్కో ఎండీ అనిలా వావిళ్ల తదితర ప్రముఖులు హాజరయ్యారు.
‘రెంజీ’ వినూత్న ఫీచర్లు.. కరెంట్‌ను అమ్ముకునే సరికొత్త సాంకేతికత!
ఈ సదస్సులో ‘రెంజీ’ సంస్థ వినియోగదారుల కోసం రెండు కీలకమైన విప్లవాత్మక ఫీచర్లను ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించింది.
పీర్-టు-పీర్ (P2P) ఎనర్జీ ట్రేడింగ్: గృహ వినియోగదారులు తమ రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్‌లో, తమ అవసరాలకు పోను మిగిలిన అదనపు కరెంట్‌ను ఈ ప్లాట్‌ఫారమ్ నెట్‌వర్క్ ద్వారా ఇతరులకు నేరుగా అమ్ముకోవచ్చు. ఇది సామాన్యులకు అదనపు ఆదాయ వనరుగా మారడమే కాకుండా గ్రిడ్ సామర్థ్యాన్ని పెంచుతుంది.
కస్టమర్ యాప్ & AMC ప్లాట్‌ఫారమ్: రూఫ్‌టాప్ సోలార్ రంగంలో విక్రయాల తర్వాతి సేవలు, మెయింటెనెన్స్ లోపాలను సరిదిద్దడానికి ఈ ప్రత్యేక యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ (AMC) యాప్‌ను తెచ్చారు. ఇది సోలార్ సిస్టమ్స్ దీర్ఘకాలం సమర్థవంతంగా పనిచేసేలా చూస్తుంది.

క్లీన్ ఎనర్జీ ఇప్పుడు ఒక ప్రజా ఉద్యమం: కిషన్ రెడ్డి
ఈ సందర్భంగా ‘రెంజీ’ సంస్థ వ్యవస్థాపకుడు ఆకుల మణికంఠ ప్రయత్నాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశంలో 'క్లీన్ ఎనర్జీ విప్లవం' నడుస్తోందని, పునరుత్పాదక ఇంధన వినియోగం అనేది ఇప్పుడు కేవలం ప్రభుత్వ విధానంగా కాకుండా ఒక శక్తివంతమైన ప్రజా ఉద్యమంగా మారిందని మంత్రి పేర్కొన్నారు. ఇంటింటికీ సోలార్ విద్యుత్ అందించే ‘పీఎం సూర్య ఘర్ యోజన’, రైతుల కోసం ‘పీఎం కుసుమ్ యోజన’, ‘నేషనల్ సోలార్ మిషన్’ వంటి పథకాల ద్వారా కేంద్రం ఇంధన రంగంలో దేశాన్ని అగ్రగామిగా నిలబెడుతోందని గుర్తుచేశారు.
రాష్ట్ర ప్రభుత్వ అలసత్వంపై కేంద్ర మంత్రి అసంతృప్తి
తెలంగాణలో ఇంధన ప్రాజెక్టుల విస్తరణపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణలో సోలార్, విండ్ ఎనర్జీతో పాటు పంప్డ్ స్టోరేజీ, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (BESS) ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన ఎన్‌ఎల్‌సీ (NLC), కోల్ ఇండియా (CIL) రూ. 10,000 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇందుకోసం గత ఏడాది అక్టోబర్‌లోనే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినా, ఇప్పటివరకు ఎలాంటి సమాధానం రాలేదు' అని మంత్రి అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి, అవసరమైన భూమి కేటాయింపులు జరిపి ఈ రూ. 10,000 కోట్ల భారీ నిధులను, పెట్టుబడులను ఉపయోగించుకోవాలని కిషన్ రెడ్డి కోరారు.
భారతదేశంలో వికేంద్రీకృత ఇంధన వ్యవస్థలను (Decentralized Energy Systems) బలోపేతం చేయడానికి, సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి పర్యావరణ అనుకూల ఇంధన స్వయంసమృద్ధిని సాధించడానికి 'రెనర్జైజ్ 2026' సదస్సు ఒక దిక్సూచిగా నిలుస్తుందని వక్తలు వెల్లడించారు.

ఇవీ చదవండి:
కూలిన హెలికాప్టర్.. మేజర్ జనరల్ సెల్ఫీ..
మరణానికి ముందు సెలూన్‌ను సందర్శించిన ట్విషా.. యజమాని సంచలన ఆరోపణలు