Share News

299 టీఎంసీల ఒప్పందంపై ఎందుకు సంతకం చేశారు?

ABN , Publish Date - Nov 25 , 2026 | 04:38 AM

కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా 512 టీఎంసీలకు గానూ 299 టీఎంసీలకే పరిమితమైన ఒప్పందంపైనే అప్పట్లో ఎందుకు సంతకం చేసిందో బీఆర్‌ఎస్‌ చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు డిమాండ్‌ చేశారు.

299 టీఎంసీల ఒప్పందంపై ఎందుకు సంతకం చేశారు?

  • కృష్ణా వాటాపై బీఆర్‌ఎస్‌ నోరు విప్పాలి..

  • వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో, కర్ణాటకలో కాంగ్రెస్‌కు ఓటమే

  • కాంగ్రెస్‌ పార్టీకి 90 సీట్లలో విజయం కాదు.. డిపాజిట్లు గల్లంతు.. సీఎం రేవంత్‌కు అదే బెంగ

  • భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

హైదరాబాద్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా 512 టీఎంసీలకు గానూ 299 టీఎంసీలకే పరిమితమైన ఒప్పందంపైనే అప్పట్లో ఎందుకు సంతకం చేసిందో బీఆర్‌ఎస్‌ చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు డిమాండ్‌ చేశారు. నీటి సమస్యపై తెలంగాణ సెంటిమెంట్‌ను రగిలిస్తూ ప్రజలను మరోసారి మోసగించడానికి కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రానికి కేంద్రం ఏం ఇచ్చిందంటూ ప్రచారం చేసిన గత బీఆర్‌ఎస్‌ సర్కారుకు దిమ్మ తిరిగేలా ప్రజాతీర్పు రావడంతో ఆ పార్టీ అధినేత కేసీఆర్‌.. ఫామ్‌ హౌస్‌కు పరిమితం అయ్యారని మంగళవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాకు చెప్పారు.


ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వానికీ అదే గతి పడుతుందని స్పష్టం చేశారు. తెలంగాణకు కేంద్రం ఏం ఇచ్చిందని అడిగే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదన్న రాంచందర్‌రావు.. రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌కు అధికార పార్టీ చేసిందేమిటో ప్రజలకు మంత్రులు సమాధానం చెప్పాలన్నారు. గతంలో రాష్ట్రాన్ని మోసగాడిలా బీఆర్‌ఎస్‌ పాలిస్తే.. ఇప్పుడు మోసగాళ్లకు మోసగాడు సినిమాను తలపించేలా కాంగ్రెస్‌ పాలన సాగుతోందన్నారు. ఈ రెండు పార్టీల ఆట కట్టించడానికి రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి రాబోతుందన్నారు. కానీ, అసదుద్దీన్‌ ఒవైసీ మధ్యవర్తిత్వంతో ‘కొడంగల్‌ టిల్లు’, ‘ట్విట్టర్‌ టిల్లు’ కలిసి బీజేపీని అణచివేయడానికి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 90 సీట్లు గెలుస్తామని చెబుతున్న సీఎం రేవంత్‌రెడ్డి సహా కాంగ్రెస్‌ నేతలను 90 సీట్లలో డిపాజిట్లు గల్లంతవుతాయన్న బెంగ వెంటాడుతోందన్నారు. రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి చెబుతున్నారని, కానీ రాబోయే రోజుల్లో కర్ణాటక, తెలంగాణల్లో అధికారం కోల్పోనున్న కాంగ్రెస్‌ పార్టీ.. జాతీయ స్థాయి నుంచి ప్రాంతీయ పార్టీ స్థాయికి పడిపోతుందన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

మారిషస్‌‌లో భూకంపం.. రిక్టర్‌ స్కేలుపై 6.4 తీవ్రత నమోదు..

సంజయ్ గాంధీని దొంగ అన్నాడని చెంపదెబ్బ కొట్టా: ప్రియాంక గాంధీ

Updated Date - Nov 25 , 2026 | 04:40 AM