నగల బ్యాగ్‌ను పోగొట్టుకున్న బధిర అన్నాచెల్లెళ్లు.. పోలీసుల చొరవతో తిరిగి అప్పగింత
ABN , Publish Date - Aug 20 , 2026 | 10:07 AM
హైదరాబాద్‌లోని తుకారాంగేట్‌లో బధిర అన్నాచెల్లెళ్లు బంగారు నగలను పోగొట్టుకున్నారు. సుమారు రూ.3 లక్షల విలువైన బంగారు నగలు, ఇతర విలువైన వస్తువులతో కూడిన బ్యాగ్‌ను.. పోలీసులు సీసీ కెమెరాల సహాయంతో గుర్తించి, తిరిగి బాధితులకు అప్పగించారు.
హైదరాబాద్, ఆగస్టు 20: హైదరాబాద్‌లోని తుకారాంగేట్‌లో బధిర అన్నాచెల్లెళ్లు బంగారు నగలను పోగొట్టుకున్నారు. సుమారు రూ.3 లక్షల విలువైన బంగారు నగలు, ఇతర విలువైన వస్తువులతో కూడిన బ్యాగ్‌ను.. పోలీసులు సీసీ కెమెరాల సహాయంతో గుర్తించి, తిరిగి బాధితులకు అప్పగించారు. సికింద్రాబాద్‌లో ట్యూషన్ చెప్పి యాక్టివాపై ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో బధిర అన్నాచెల్లెళ్లు నగల బ్యాగ్‌ను పోగొట్టుకున్నారు. వారి తల్లి బంగారు నగలను బ్యాగ్‌లో పెట్టి మర్చిపోయింది. బ్యాగ్‌లో నగలు ఉన్న విషయం తెలియకుండానే అన్నాచెల్లెళ్లు ఇంటికి వెళ్లారు.
ఇదిలా ఉండగా, రోడ్డుపై బ్యాగ్ దొరకడంతో అంకిత్ అనే వ్యక్తి దానిని ట్రాఫిక్ ఏఎస్ఐ జాన్‌కు అప్పగించారు. బ్యాగ్‌ను పరిశీలించిన పోలీసులు అందులో సుమారు రెండున్నర తులాల బంగారు గొలుసుతో పాటు ఖరీదైన వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. బ్యాగ్ యజమానులను గుర్తించేందుకు దాదాపు 60కి పైగా సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. సీసీ ఫుటేజీల ఆధారంగా బాధితుల బైక్ నంబర్‌ను గుర్తించి, దాని ద్వారా వారి వివరాలను సేకరించారు.
అయితే బాధితులు ఫోన్‌లో మాట్లాడలేకపోవడంతో పోలీసులు వాట్సాప్ ద్వారా వారిని సంప్రదించారు. ఈ క్రమంలో అన్నాచెల్లెళ్లతో పాటు వారి తల్లిదండ్రులు కూడా మాట్లాడలేరని పోలీసులు గుర్తించారు. అనంతరం బ్యాగ్‌లోని వస్తువులు, బాధితుల వివరాలను నిర్ధారించుకుని వారిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. తుకారాంగేట్ సీఐ బషీర్ అహ్మద్, క్రైమ్ ఇన్‌స్పెక్టర్ అహ్మద్ చేతుల మీదుగా బంగారు నగల బ్యాగ్‌ను బాధిత కుటుంబానికి తిరిగి అప్పగించారు. పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందడంతో పోలీసులకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు బాధితులకు నగలను తిరిగి అందించడంలో పోలీసు చూపిన చొరవపై అంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం.. ఏపీ హైకోర్టుకు పోలీసుల నివేదిక..
తెలంగాణలో సెక్షన్ 22Aపై రాహుల్‌కు హరీశ్ లేఖ.. కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు
Read Latest Telangana News And Telugu News