Phone Tapping Case: ముగిసిన ఎమ్మెల్సీ నవీన్ రావు విచారణ..
ABN , Publish Date - Jan 04 , 2026 | 09:23 PM
గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలకు సంబంధించి సిట్ విచారణ వేగవంతం చేసింది. పెన్ డ్రైవ్‌లోని ఫోన్ నంబర్లు ఆధారంగా SIT విచారణ ముందుకు సాగుతోంది. ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు రెండో దఫా విచారణకు హాజరయ్యారు.
ఆంధ్రజ్యోతి, జనవరి 4: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో భారత్ రాష్ట్ర సమితి (BRS) ఎమ్మెల్సీ నవీన్ రావు రెండోసారి విచారణ ముగిసింది. ఇవాళ(ఆదివారం) ఉదయం నుంచీ రాత్రి వరకూ విచారణ సాగింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) అధికారులు ఆయనను ప్రశ్నించారు. 2024 సెప్టెంబర్‌లో 3 గంటలపాటు విచారించిన అధికారులు.. నేడు ఉదయం నుంచీ ప్రశ్నల వర్షం కురిపించారు. దాదాపు ఎనిమిది గంటలపాటు ఏకధాటికి ప్రశ్నలు సంధించారు.
ఫోన్ ట్యాపింగ్ సంబంధిత వ్యక్తులతో నవీన్ రావుకు ఉన్న పరిచయాలు, సంబంధాలపై ప్రధానంగా సిట్ అధికారులు ప్రశ్నలు వేశారు. విచారణ అనంతరం నవీన్ రావు మాట్లాడుతూ.. 'గత విచారణలో అడిగిన విషయాలే మళ్లీ ప్రస్తావించారు. విచారణకు అన్ని విధాలా సహకరించా. మళ్లీ రావాలని చెప్పలేదు, కానీ ఎప్పుడు పిలిచినా రావడానికి సిద్ధం. డివైస్‌లు ఉపయోగించి ఫోన్ ట్యాపింగ్ చేశానన్న ఆరోపణలు అవాస్తవం' అని చెప్పారు.
ఇక, కూకట్‌పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు దీనిపై మాట్లాడుతూ, 'ఎలాంటి ఆధారాలు లేకుండా విచారణ చేస్తున్నారు. ఇది రాజకీయ కుట్రలో భాగం. ఒక్క సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి వేధిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్, కార్ రేసు పేరుతో BRS పార్టీపై దాడి జరుగుతోంది' అని ఆరోపించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎయిర్ పోర్ట్‌పై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు: ఎంపీ కలిశెట్టి
మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొడుతున్న బీఆర్ఎస్ నేతలు: జగ్గారెడ్డి
For More AP News And Telugu News