క్యూ కట్టిన రాజధాని
ABN , Publish Date - Mar 26 , 2026 | 05:39 AM
పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్‌కు కొరత లేదని అటు కేంద్ర ప్రభుత్వం.. ఇటు రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చెబుతున్నాయి! రాష్ట్రంలో పెట్రోల్ కొరత లేదని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ బుధవారం ప్రకటన.....
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 30 శాతం బంకులు మూత
మిగిలిన 70 శాతం పెట్రోల్ బంకుల వద్ద చాంతాడంత క్యూలు
తెరిచి ఉన్న బంకుల్లోనూ ఒక పరిమితి మేరకే ఇంధనం
ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో చమురు సంస్థలు క్రెడిట్ సౌకర్యం నిలిపేయడమే బంకుల మూసివేతకు కారణం
గ్యాస్, పెట్రోల్, డీజిల్‌కు కొరత లేదంటూ ప్రభుత్వ ప్రకటనలు
అధికారులదీ అదే మాట.. క్షేత్రస్థాయిలో భిన్నమైన పరిస్థితి
గ్యాస్‌పైనా కేంద్రం మాటలకు, చర్యలకు కుదరని పొంతన
వంట గ్యాస్ బుక్ కాదు.. అయినా నెల దాకా రాని పరిస్థితి
కరెంట్ కుక్కర్లు, ఇండక్షన్ స్టవ్‌లతో భారీగా కరెంటు బిల్లులు
చమురు కష్టాలతో వర్క్ ఫ్రమ్ హోమ్ బాటలో ఐటీ కంపెనీలు
అన్ని కంపెనీలూ ఆ అవకాశమిస్తే పరిస్థితి అదుపులోకి!
హైదరాబాద్ సిటీ, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్‌కు కొరత లేదని అటు కేంద్ర ప్రభుత్వం.. ఇటు రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చెబుతున్నాయి! రాష్ట్రంలో పెట్రోల్ కొరత లేదని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ బుధవారం ప్రకటన కూడా విడుదల చేసింది. రెండు నెలలకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని.. కొన్ని పెట్రోల్ బంకులకు నిర్ణీత సమయానికి ట్యాంకర్లు చేరుకోకపోవడంతో నో స్టాక్ బోర్డులు పెట్టారని, కొరత కారణంగా కాదని మంత్రి ఉత్తమ్ వివరణ ఇచ్చారు! జిల్లా కలెక్టర్, పోలీసులు, పౌరసరఫరాల శాఖ అధికారులు.. అందరిదీ అదే మాట. తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్పష్టం చేయగా.. ప్రజల సౌకర్యార్థం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన తెలిపారు! కానీ.. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పెట్రోల్ బంకుల్లో 30 శాతం మేర మూతబడ్డాయి. తెరిచి ఉన్న ఏ పెట్రోల్ బంకు వద్ద చూసినా బారులు తీరిన కార్లు... ద్విచక్రవాహనాలు.. రోడ్లపైకి చేరిన క్యూలు.. ఇదీ పరిస్థితి.
బంకుల వద్ద పెట్రోల్ కోసం రెండు రోజుల నుంచి వాహనదారులు పడిగాపులు పడుతున్నారు. గంటలకొద్దీ క్యూల్లో నిరీక్షిస్తున్నారు. కొన్ని బంకుల వద్ద 2-3 గంటల వ్యవధిలోనే పెట్రోల్ అయిపోతుండడంతో నో స్టాక్ బోర్డులు పెట్టేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 2400 బంకులు ఉండగా అందులో 700పైగా బంకులు ఖాళీ అయ్యాయి. ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో.. మార్చి నెలలో అయిల్ కంపెనీలు కచ్చితంగా నగదు చెల్లిస్తేనే పెట్రోల్, డీజిల్ ట్యాంకర్లను పంపిస్తామన్న నిబంధనను చమురు సంస్థలు అమలు చేయడమే ఇందుకు కారణమని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్రెడిట్ సౌకర్యాన్ని నిలిపివేయడంతో పాటు రూ.లక్షల్లో ఉన్న పాత బకాయిలు చెల్లిస్తేనే ఇండెంట్‌పై చమురు పంపిస్తామని అయిల్ కంపెనీలు స్పష్టం చేసినట్టు సమాచారం. నగరంలోని పలువురు యాజమానులు అలా డబ్బులు చెల్లించలేపోతుండడంతో సరఫరాలో అటంకాలు ఎదరవుతున్నాయని తెలుస్తోంది. కారణమేదైనాగానీ.. 30 శాతం బంకులు మూతబడ్డంతో మిగతా 70 శాతం బంకులపై దాదాపు 50 శాతం మేర అధికంగా భారం పడింది. దీంతో వాహనదారుల రద్దీని అదుపుచేసేందుకు బారికేడ్లు ఏర్పాటు చేసి, ట్రాఫిక్ పోలీసులను సైతం మోహరించాల్సి వచ్చిందంటే పరిస్థితి ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. ‘‘చాలా మంది డబ్బాల్లో పెట్రోల్/డీజీల్ కొనుక్కెళ్తున్నారు.. చమురు కొరత ఉందన్న వదంతులు నమ్మి ఆందోళనతో ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు’’ అని అధికారులు అంటున్నారుగానీ.. పెట్రోల్ బంకుల వద్ద కనిపిస్తున్న దృశ్యాలు అలా లేవు. తెరిచి ఉన్న ఏ బంకు వద్ద చూసినా వందల కొద్దీ వాహనాలు గంటలతరబడి బారులుతీరి ఉంటున్నాయి తప్ప.. డబ్బాలు పట్టుకుని ఉన్నవారు అరుదుగా కనిపిస్తున్నారు. చాలా బంకుల్లో అసలు అలా డబ్బాల్లో పెట్రోల్/డీజీల్ పోయడానికి నిరాకరిస్తున్నారు. వచ్చిన వాహనాలకు సైతం ట్యాంక్ మొత్తం నింపట్లేదు. ఒక పరిమితి మేరకే పోస్తున్నారు. అలా పోసినా కూడా కొద్దిసేపట్లోనే నిల్వలు నిండుకోవడంతో ‘నోస్టాక్’ బోర్డు పెట్టేస్తున్నారు. పెట్రోల్/డీజిల్ కోసం పెద్ద ఎత్తున వాహనదారులు బంకుల వద్దకు ఉదయాన్నే చేరుకోవడంతో.. బుధవారం పొద్దున 10 గంటలలోపే 20 శాతానికి పైగా బంకుల్లో ఇందనం ఖాళీ అయిపోయినట్లు తెలిసింది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 22న 3,024 కిలోలీటర్ల ఇంధనం అమ్ముడవగా.. తప్పుడు ప్రచారాల వల్ల 23న ఆ సంఖ్య రెట్టింపై 6,400 కిలోలీటర్లకు చేరుకుందని సీపీ సజ్జనార్ తెలిపారు. ఇలా డిమాండ్ పెరిగి, సరఫరా తగ్గడంతో.. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే బస్సులు, వ్యాన్లు, ఆటోల డైవ్రర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అసలే పెట్రోల్, డీజిల్ దొరక్క ఇబ్బందులు పడుతుంటే.. కొన్ని పెట్రోల్ బంకుల్లో కేవలం నగదు చెల్లిస్తేనే పెట్రోల్ పోస్తామని, ఆన్‌లైన్ పేమెంట్లను అంగీకరించబోమని బోర్డులు పెట్టడం గమనార్హం.

ఇంత కష్టకాలంలో ఆ నిబంధన ఎందుకు?
గుర్తుందా? విమాన పైలట్లకు అలసట తగ్గించడానికిగాను వారి విశ్రాంతి సమయాన్ని పెంచుతూ పలు నిబంధనలతో పౌర విమాన యాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) నిరుడు ‘ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్’ను అమల్లోకి తెచ్చింది. కానీ, ఆ నిబంధనలను ఇండిగో సంస్థ పాటించకపోవడంతో.. గత ఏడాది డిసెంబరులో పలు విమానాలు రద్దయిపోయి, విమానాశ్రయాలన్నీ రద్దీతో బస్టాండ్లను తలపించాయి! దీంతో రంగంలోకి దిగిన డీజీసీఏ.. పైలట్ల వారాంతపు విశ్రాంతి నిబంధనలను తాత్కాలికంగా సడలించింది. కానీ, యుద్ధం కారణంగా అసలే ఇంధన సరఫరాపై ఆందోళనతో ప్రజలు ఇప్పటికే బిక్కుబిక్కుమంటున్న సమయంలో.. ‘ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో నగదు చెల్లిస్తేనే పెట్రోల్, డీజిల్ ట్యాంకర్లను బంకులకు పంపిస్తాం’ అనే నిబంధనను ఇంత కచ్చితంగా అమలు చేయడం, బంకు యజమానులకు క్రెడిట్ సౌకర్యాన్ని నిలిపివేయడమే కాక పాత బకాయిలు చెల్లించాలని పట్టుబట్టడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. పైగా.. ఎఫ్‌డీటీఎల్ నిబంధనలు విమాన ప్రయాణికుల ప్రాణాలకు, వారి భద్రతకు సంబంధించిన అంశం. అలాంటి విషయంలోనే సర్కారు నిబంధనలు సడలించగా.. కేవలం ఆర్థికపరమైన ఈ విషయంలో చమురు సంస్థలు ఎందుకింత పట్టుదలగా వ్యవహరిస్తున్నాయని ప్రజలు నిలదీస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆ నిబంధనను ఎత్తివేసి.. మూతబడ్డ పెట్రోల్ బంకులను వీలైనంత త్వరగా తెరిచే ఏర్పాట్లు చేయాలని, అప్పుడే పరిస్థితి అదుపులోకి వస్తుందని సూచిస్తున్నారు.
ఐటీ ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రం హోమ్
ఐటీ కారిడార్‌లో మళ్లీ వర్క్ ఫ్రం హోమ్ విధానం మొదలైంది! కరోనా సమయంలో ఈ విధానాన్ని అనుసరించిన కంపెనీలు.. ఇప్పుడు తాజాగా తలెత్తిన చమురు సంక్షోభం నేపథ్యంలో మరోమారు అదే నిర్ణయాన్ని తీసుకున్నాయి. రెండు రోజులుగా విప్రో, యాక్సెంచర్, టీసీఎస్ వంటి కంపెనీలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే వెసులుబాటును కల్పిస్తున్నాయి. కొన్ని కంపెనీలు మాత్రం.. 50-50 విధానం అనుసరిస్తున్నాయి. ఐటీ కంపెనీలన్నీ వీలైనంత మందితో వర్క్ ఫ్రమ్ హోం చేయిస్తే పెట్రోల్ బంకుల వద్ద హడావుడి బాగా తగ్గే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంటి నుంచి పని చేయించుకోగలిగే అవకాశం ఉన్న అన్ని సంస్థలూ ఈ విధానంపై దృష్టి సారిస్తే 2-3 రోజుల్లోనే పరిస్థితి అదుపులోకి వస్తుందని పలువురు పేర్కొంటున్నారు. హైదరాబాద్‌లో 9.5 లక్షల మంది ఐటీ ఉద్యోగులున్నారు. వీళ్లలో సగం మంది కార్లు, మిగిలిన సగం మంది బైక్‌ల్లో రాకపోకలు సాగిస్తున్నారు. ప్రస్తుతం పెట్రోల్ బంక్‌ల వద్ద క్యూల్లో వీరే ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారు


గ్యాస్ పరిస్థితి మరీ ఘోరం..
గ్యాస్ విషయంలో కేంద్ర ప్రభుత్వం చెబుతున్న మాటలకు, తీసుకుంటున్న చర్యలకు మధ్య పొంతన ఉండట్లేదు. ఉదాహరణకు.. ఇండేన్ గ్యాస్ ఐవీఆర్‌ఎస్ విధానంలో గ్యాస్ బుక్ చేసుకునే విధానానికి స్వస్తి పలికింది. నిజంగా గ్యాస్ కొరతే లేకుంటే ఐవీఆర్‌ఎస్ బుకింగ్ ఎందుకు ఎత్తేయాలి? అనే ప్రశ్నకు సమాధానం లేదు. అలాగే.. పైప్‌డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) అందుబాటులో ఉన్న చోట ఎల్పీజీ వినియోగదారులంతా మూడు నెలల్లోగా దానికి మళ్లాలని.. లేదంటే గృహవినియోగదారులకు ఎల్పీజీ సిలిండర్ల సరఫరాను నిలిపివేస్తామని కేంద్రం ప్రకటించింది. ఇక, వాణిజ్య గ్యాస్ కొరత సమస్య ఇప్పటికీ తీరనే లేదు. ఎక్కువ డబ్బులు పెట్టి గ్యాస్‌ను బ్లాక్‌లో కొంటున్న పలు హోటళ్లు, రెస్టారెంట్లు.. బిల్లులో ఆహారపదార్థాలతోపాటు గ్యాస్‌కు కూడా అదనంగా బిల్లులు వేస్తున్నాయి! దీంతో సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ రంగంలోకి దిగి.. అలా వసూలు చేయడం చట్టవిరుద్ధమని, అలాంటి అదనపు బిల్లులను వినియోగదారులు చెల్లించాల్సిన పని లేదని ప్రకటించడం గమనార్హం. ఇక, ‘‘గృహ వినియోగ గ్యాస్‌కు కొరత అస్సలు లేదు..’’ అని ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తున్నా క్షేత్రస్ధాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఒక సిలిండర్ బుక్ చేసిన తరువాత రెండో సిలిండర్ బుక్ చేయడానికి 25రోజులు ఆగాలని ప్రభుత్వం చెబుతుండగా.. 30 రోజులు పూర్తయినా సిలిండర్ బుక్ కావట్లేదని చాలా మంది వాపోతున్నారు. చచ్చీచెడీ బుక్ చేసినా.. గ్యాస్ సరఫరాకు 20-25 రోజుల పైగానే సమయం తీసుకుంటున్నారని ఆవేదన వెలిబుచ్చుతున్నారు. గ్యాస్ కష్టాలకు ప్రత్యామ్నాయంగా కరెంట్ కుక్కర్లు, ఇండక్షన్ స్టవ్‌లను వాడుతున్న వారు.. గిర్రున తిరుగుతున్న విద్యుత్తు మీటర్లను చూస్తే గుండె ఝల్లుమంటోందని చెబుతున్నారు.
అమ్మకాలు మూడు రెట్లు పెరిగాయి
ఇంతకుముందుతో పోలిస్తే.. గడిచిన రెండు రోజుల్లో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు రెండున్నర నుంచి మూడు రెట్లు పెరిగాయని.. తమ వద్ద ఉన్న స్టాక్ అయిపోవడంతోనే ‘నో స్టాక్’ బోర్డులు ఏర్పాటు చేస్తున్నామని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.అమరేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వినోద్ విశ్వనాథ్‌లు ఒక ప్రకటనలో తెలిపారు. హెచ్‌పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ కంపెనీల వద్ద సరిపడా స్టాక్ అందుబాటులో ఉందన్నారు. కాగా.. సాధారణంగా జిల్లాల్లో రోజూ సగటున 12 వేల కిలో లీటర్ల పెట్రోల్, 15 వేల లీటర్ల డీజిల్ అమ్మకాలు జరుగుతుంటాయని, సోమవారం 15 వేల కిలోలీటర్లు, మంగళవారం 25 వేల కిలోలీ టర్ల పెట్రోల్ అమ్ముడుపోవడంతో కొరత ఏర్పడిందని హైదరాబాద్ జిల్లా చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ తెలిపారు.
