Share News

ఒయాసిస్‌ ఫెర్టిలిటీ కేంద్రాల్లో ఉన్న వారిని.. ప్రభుత్వ ఐవీఎఫ్‌ కేంద్రాలకు తరలించాలి

ABN , Publish Date - Nov 19 , 2026 | 05:47 AM

సద్గురు హెల్త్‌కేర్‌ సర్వీసెస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ ఆధ్వర్యంలోని ఒయాసిస్‌ ఫెర్టిలిటీ కేంద్రాల్లో.. కృత్రిమ గర్భధారణ చికిత్స పొందుతున్న వారి పర్యవేక్షణకు వైద్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

ఒయాసిస్‌ ఫెర్టిలిటీ కేంద్రాల్లో ఉన్న వారిని.. ప్రభుత్వ ఐవీఎఫ్‌ కేంద్రాలకు తరలించాలి

  • వారి పర్యవేక్షణకు వైద్యులతో కమిటీ వేయాలి: హైకోర్టు

  • ఈ కేసులో దర్యాప్తు కొనసాగించొచ్చని స్పష్టీకరణ

  • సద్గురు హెల్త్‌ కేర్‌ ఇన్‌ఛార్జ్‌ ఆనందరాజు అరెస్ట్‌

హైదరాబాద్‌ సిటీ, హైదరాబాద్‌, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): సద్గురు హెల్త్‌కేర్‌ సర్వీసెస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ ఆధ్వర్యంలోని ఒయాసిస్‌ ఫెర్టిలిటీ కేంద్రాల్లో.. కృత్రిమ గర్భధారణ చికిత్స పొందుతున్న వారి పర్యవేక్షణకు వైద్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. చికిత్స పొందుతున్న 51 మందిని.. కమిటీ పర్యవేక్షణలోనే సమీపంలోని ప్రభుత్వ ఐవీఎఫ్‌ కేంద్రాలకు తరలించాలని వైద్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది.


అలాగే, ఒయాసిస్‌ ఫెర్టిలిటీ కేంద్రాల్లో నిల్వ చేసిన అండాల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. ‘ఒయాసిస్‌ ఫెర్టిలిటీ’ కేంద్రాల్లో పోలీసులు, ఇతర అధికారులు జోక్యం చేసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సద్గురు హెల్త్‌కేర్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ ఎన్‌.వి.శ్రవణ్‌కుమార్‌ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగించవచ్చని, దీనికి ఆస్పత్రి వర్గాలు సహకరించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను డిసెంబర్‌ 2కు వాయిదా వేసింది.


66 మంది మహిళల నుంచి అండాల సేకరణ

అక్రమ అండాల సేకరణ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సద్గురు హెల్త్‌కేర్‌ ఇన్‌ఛార్జ్‌ ఆనందరాజు, షేక్‌ సుభానీని అరెస్టు చేశారు. ఎండీ దుర్గారావు ఆదేశాలతోనే.. గత ఏడాది కాలంలో 66 మంది మహిళల నుంచి అక్రమంగా అండాలు సేకరించినట్లు తెలిసింది. ఇందులో 19 మంది డేటా గల్లంతైనట్లు పోలీసులు తేల్చారు. యూపీ, పశ్చిమబెంగాల్‌ ప్రాంతాల నుంచి మహిళలను నగరానికి తీసుకురావడానికి మొత్తం 9 మంది ఏజెంట్లను నిర్వాహకులు ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కో దానానికి రూ. 30వేలు చెల్లిస్తామన్న హామీతో వారిని తీసుకొచ్చి... హార్మోన్‌ ఇంజక్షన్‌లతో ఎక్కువసార్లు అండాలు సేకరించి. రూ. 65 వేలతో సరిపెట్టినట్టు తెలిసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ ఓటర్ల జాబితాపై ఈసీ కీలక నిర్ణయం

బాబా బర్త్‌డే స్పెషల్‌.. బెంగళూరు-ధర్మవరం మధ్య ప్రత్యేక ప్యాసింజరు రైలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 19 , 2026 | 05:47 AM