నేపాల్‌లో చిక్కుకున్న 23 మంది తెలంగాణ వాసుల గుర్తింపు: మంత్రి పొంగులేటి
ABN , Publish Date - Aug 27 , 2026 | 08:02 PM
నేపాల్‌లో చిక్కుకున్న 23 మంది తెలంగాణ వాసులను ప్రాథమికంగా గుర్తించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వారి వివరాలను కేంద్ర విదేశాంగ శాఖకు పంపినట్లు వెల్లడించారు.
హైదరాబాద్: నేపాల్‌లో చిక్కుకున్న తెలంగాణకు చెందిన 23 మందిని ప్రాథమికంగా గుర్తించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వీరికి సంబంధించిన వివరాలను కేంద్ర విదేశాంగ శాఖకు పంపించినట్లు వెల్లడించారు. నేపాల్‌లో ఉన్న తెలంగాణ ప్రజల భద్రతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం సమన్వయం చేసుకుంటోందని మంత్రి తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు
నేపాల్ రాజధాని కాఠ్మాండులోని భారత రాయబార కార్యాలయంతో పాటు నేపాల్ అధికారులతో కూడా రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అక్కడ చిక్కుకున్న తెలంగాణ వాసుల పరిస్థితి, వారి భద్రతకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు చెప్పారు.
ప్రత్యేక హెల్ప్‌లైన్, కంట్రోల్ రూమ్
తెలంగాణ భవన్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్, కోఆర్డినేషన్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్ర సచివాలయంలోనూ ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. నేపాల్‌లో చిక్కుకున్న వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. బాధితుల కుటుంబాలకు అవసరమైన సమాచారం అందించేందుకు, సహాయక చర్యలను సమన్వయం చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా పనిచేస్తోందని చెప్పారు. నేపాల్‌లో ఇంకా ఎవరైనా తెలంగాణకు చెందిన వారు చిక్కుకుని ఉంటే వారి వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని మంత్రి కోరారు. బాధితుల వివరాలు అందిన వెంటనే వారి పరిస్థితిని తెలుసుకుని అవసరమైన సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగలేటి తెలిపారు.
Also Read:
ధాన్యం నిల్వకు తెలంగాణ సర్కార్ భారీ ప్లాన్
ప్రకృతి విపత్తు కంటే అతి పెద్ద విపత్తు గొడ్డలి పార్టీ: అచ్చెన్నాయుడు