Share News

ధాన్యం నిల్వకు తెలంగాణ సర్కార్‌ భారీ ప్లాన్‌

ABN , Publish Date - Aug 27 , 2026 | 07:26 PM

తెలంగాణలో పెరుగుతున్న ధాన్యం ఉత్పత్తి, సేకరణకు అనుగుణంగా ఆధునిక నిల్వ సదుపాయాలను పెంచేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా 5 నుంచి 10 లక్షల మెట్రిక్‌ టన్నుల అదనపు సామర్థ్యంతో ఆధునిక ధాన్య సైలోలను నిర్మించనున్నట్లు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు.

ధాన్యం నిల్వకు తెలంగాణ సర్కార్‌ భారీ ప్లాన్‌
Telangana Modern Grain Storage

హైదరాబాద్‌: తెలంగాణలో పెరుగుతున్న వరి ఉత్పత్తి, ధాన్యం సేకరణకు అనుగుణంగా ఆధునిక నిల్వ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో ఆధునిక ధాన్య సైలోలను నిర్మించనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు.


పౌరసరఫరాల శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి ఈ అంశాలపై చర్చించారు. భవిష్యత్‌లో ధాన్యం నిల్వ అవసరాలను తీర్చేందుకు సంప్రదాయ గోదాములపై మాత్రమే ఆధారపడటం సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు. కొత్తగా నిర్మించే సైలోల ద్వారా అదనంగా 5 నుంచి 10 లక్షల మెట్రిక్‌ టన్నుల శాస్త్రీయ నిల్వ సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

రబీలో 90 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు సన్నద్ధత

రానున్న రబీ సీజన్‌లో రాష్ట్రంలో 90 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు ధాన్యం సేకరించే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. దీనికి అనుగుణంగా ముందస్తు నిల్వ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. తక్షణ అవసరాల కోసం సుమారు 12 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని నిల్వ చేసే ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ వద్ద సుమారు 6 లక్షల మెట్రిక్‌ టన్నుల నిల్వ సామర్థ్యం మాత్రమే ఉందని అధికారులు మంత్రికి వివరించారు.

ఆధునిక సాంకేతికతతో సైలోలు

కొత్తగా ఏర్పాటు చేయనున్న సైలోల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నారు. ధాన్యం లోడింగ్‌, అన్‌లోడింగ్‌ కోసం ఆటోమేటెడ్‌ హ్యాండ్లింగ్‌ వ్యవస్థలు, యాంత్రిక రవాణా సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. నిల్వ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు డిజిటల్‌ మానిటరింగ్‌ వ్యవస్థలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. దీంతో ధాన్యంలో తేమ, పురుగులు, ఇతర కారణాల వల్ల కలిగే నష్టాలను గణనీయంగా తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.


Also Read:

ప్రకృతి విపత్తు కంటే అతి పెద్ద విపత్తు గొడ్డలి పార్టీ: అచ్చెన్నాయుడు

నేపాల్‌కు చైనా వార్నింగ్.. మరో ఉపద్రవం ముంచుకొస్తోందా?

Updated Date - Aug 27 , 2026 | 07:26 PM