Share News

ప్రజల భాగస్వామ్యంతోనే మూసీ అభివృద్ధి.. కేబినెట్ సబ్ కమిటీ

ABN , Publish Date - May 08 , 2026 | 03:48 PM

మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టును ప్రజల భాగస్వామ్యంతోనే అమలు చేస్తామని కేబినెట్ సబ్ కమిటీ స్పష్టం చేసింది. అభివృద్ధి పేరుతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, ప్రజల ఆస్తులకు నష్టం లేకుండా ప్రాజెక్టును రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రజల భాగస్వామ్యంతోనే మూసీ అభివృద్ధి.. కేబినెట్ సబ్ కమిటీ
Musi River project

హైదరాబాద్, మే 8: ప్రజా భవన్‌లో మూసీ నది పునరుజ్జీవనం ప్రాజెక్టుపై కేబినెట్ సబ్ కమిటీ ఈరోజు(శుక్రవారం) సమావేశమైంది. మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టును ప్రజల భాగస్వామ్యంతోనే అమలు చేస్తామని కేబినెట్ సబ్ కమిటీ స్పష్టం చేసింది. అభివృద్ధి పేరుతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, ప్రజల ఆస్తులకు నష్టం లేకుండా ప్రాజెక్టును రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అలైన్‌మెంట్ మార్పులు చేసి నిర్మాణాలపై ప్రభావం తగ్గించేలా ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. మూసీ నది పునరుజ్జీవనం ప్రాజెక్టును మొత్తం 55 కిలోమీటర్ల మేర 5 దశల్లో అభివృద్ధి చేపట్టనున్నారు. ఫేజ్-1కు 7,055 కోట్ల రూపాయల వ్యయం అంచనా వేశారు. ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ADB) నిధుల కోసం సాంకేతిక, ఆర్థిక చర్చలు పూర్తి అయ్యాయి.


హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు, ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తొలి 5 కిలోమీటర్ల పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులను కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది. నదిలోని చెత్తను తొలగించి, రివర్ బెడ్ ప్రొఫైలింగ్‌ను ప్రభుత్వం చేపట్టనుంది. వరద నియంత్రణకు రిటైనింగ్ వాల్స్‌ను నిర్మించనున్నారు. మూసీ రెండు వైపులా రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం, నీటి నిల్వ కోసం బ్యారేజీలు, రివర్ ఫ్రంట్ అభివృద్ధి వంటి పనులు చేపట్టనున్నారు. నార్సింగి నుంచి గౌరెల్లి వరకు 55 కి.మీ. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఉప్పల్ భగాయత్ నుంచి గౌరెల్లి వరకు విస్తరణకు డీపీఆర్‌ను తయారీకి నిర్ణయం తీసుకున్నారు.


ప్రాజెక్టు వివరాలను నగరవ్యాప్తంగా ప్రచారం చేయాలని సబ్ కమిటీ ఆదేశించింది. బస్టాండ్లు, ప్రధాన రోడ్లు, థియేటర్లలో ప్రచార వీడియోలు ప్రదర్శించనున్నారు. 2026 ఆగస్టు నాటికి పనులు ప్రారంభించడం లక్ష్యంగా నిర్ణయించారు. డిసెంబర్ 2027 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్ట్ సాంకేతిక పర్యవేక్షణకు IIT, JNTUల సహకారం తీసుకోనున్నారు. ఈ సమావేశంలో మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి..

ఎన్ని ఇబ్బందులున్నా ప్రాణహిత ప్రాజెక్ట్‌ను నిర్మించి తీరుతాం: మంత్రి జూపల్లి కృష్ణారావు

కరీంనగర్ ఘటనపై డీజీపీకి బీఆర్‌ఎస్ నేతల ఫిర్యాదు

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 08 , 2026 | 03:58 PM