ముద్రగడ మృతి.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు తీవ్ర దిగ్భ్రాంతి..
ABN , Publish Date - Jul 14 , 2026 | 09:56 PM
మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి మృతిపై బీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజలకు ముద్రగడ చేసిన సేవలను ప్రశంసించారు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి ఆయన చేసిన కృషిని బీఆర్ఎస్ అగ్రనేతలు కొనియాడారు.
హైదరాబాద్: మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి మృతిపై బీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజలకు ముద్రగడ చేసిన సేవలను వారు ప్రశంసించారు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి ఆయన చేసిన కృషిని కొనియాడారు. ఈ సందర్భంగా పద్మనాభరెడ్డి కుటుంబసభ్యులకు బీఆర్ఎస్ పార్టీ తరఫున తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ముద్రగడది రాజీలేని పోరాటం: కేసీఆర్
నమ్మిన సిద్ధాంతం కోసం రాజీలేని పోరాటం చేసిన నేత ముద్రగడ పద్మనాభరెడ్డి అని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిగా పనిచేసిన ఆయన గొప్ప ప్రజానాయకుడని ప్రశంసించారు. ముఖ్యంగా కాపు వర్గాల అభ్యున్నతి కోసం ముద్రగడ చేసిన కృషి గొప్పదని కొనియాడారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపులు, అనుబంధ కులాలకు అందించాలనే తపనతో జీవితాంతం కృషి చేశారన్నారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం జీవితకాలం రాజీలేని పోరాటం చేసిన ప్రత్యామ్నాయ రాజకీయవేత్త అని కేసీఆర్ కొనియాడారు. ఆయన మరణం సామాజిక ఉద్యమాలకు తీరని లోటుగా అభివర్ణించారు. ఈ సందర్భంగా ముద్రగడ కుటుంబ సభ్యులు, అభిమానులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కాపు నేతగా నిలిచిపోతారు: కేటీఆర్
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభరెడ్డి మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజలకు విశిష్ట సేవలందించిన ఆయన.. కాపు సామాజిక వర్గ హక్కుల సాధన కోసం పోరాడిన నేతగా నిలిచిపోతారని పేర్కొన్నారు. ముద్రగడ మరణం తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు, ముఖ్యంగా సామాజిక ఉద్యమాలకు తీరని లోటుగా కేటీఆర్ అభివర్ణించారు. ఈ దుఃఖ సమయంలో వారి కుటుంబ సభ్యులు, అభిమానులు, అనుచరులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు.
నిరంతరం పోరాడిన నాయకుడు: హరీశ్ రావు
ప్రజా జీవితంలో ముద్రగడ పద్మనాభరెడ్డి తనదైన ముద్ర వేశారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఆయన మృతి తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. కాపు సామాజిక వర్గ హక్కుల కోసం నిరంతరం పోరాడిన నాయకుడిగా ముద్రగడ గుర్తింపు పొందారని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ్యుడిగా, మంత్రిగా ప్రజలకు సేవలందించిన ఆయన రాజకీయ ప్రస్థానం చిరస్మరణీయమైందని ప్రశంసించారు. ముద్రగడ మరణం తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ముద్రగడ కుటుంబ సభ్యులు, అభిమానులు, అనుచరులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి కన్నుమూత..
గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వాసుపత్రుల అభివృద్ధికి కొత్త పాలసీ: మంత్రి దామోదర రాజ నర్సింహా