Share News

60 మందితో పార్టీ.. అరవింద సమేత!

ABN , Publish Date - Sep 08 , 2026 | 06:53 AM

జూబ్లీహిల్స్‌లో ఉన్న హోటల్‌ దసపల్లాలోని కారాకారా పబ్‌లో 60మందితో పార్టీ చేసు కునేందుకు ఎంపీ అనిల్‌ యాదవ్‌ సోదరుడు అరవింద్‌యాదవ్‌ బుక్‌ చేసినట్టు తెలిసింది. అయితే, ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా ధ్రువీకరించడం లేదు.

60 మందితో పార్టీ.. అరవింద సమేత!
pub brawl

  • పబ్‌లో పార్టీ బుక్‌ చేసింది ఎంపీ సోదరుడే

  • పాతబస్తీకి చెందిన స్నేహితులపైనే దాడి

  • కారాకారా పబ్‌ ఘటనపై 3 కేసుల నమోదు

  • పబ్‌ లైస్సెన్స్‌ రద్దుకు పోలీసుల సిఫారసు

బంజారాహిల్స్‌, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌లో ఉన్న హోటల్‌ దసపల్లాలోని కారాకారా పబ్‌లో 60మందితో పార్టీ చేసు కునేందుకు ఎంపీ అనిల్‌ యాదవ్‌ సోదరుడు అరవింద్‌యాదవ్‌ బుక్‌ చేసినట్టు తెలిసింది. అయితే, ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా ధ్రువీకరించడం లేదు. కారాకారా పబ్‌లో జరిగిన భీభత్సంపై జూబ్లీహిల్స్‌ పోలీసులు 3 కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బహిరంగ ప్రదేశంలో ఘర్షణకు దిగి శాంతిభద్రతలకు విఘాతం కలిగించినందుకు రెండు వర్గాలపై పోలీసులు సుమోటోగా ఓ కేసు నమోదు చేశారు. అలాగే, పబ్‌ పార్కింగ్‌ నుంచి వాహనంలో ఇంటికి బయలు దేరు తుండగా కొందరు దాడి చేసి, కారును ధ్వంసం చేశారంటూ వసీమ్‌ ఖాన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఓ కేసు, అనుమతించిన సమయం కంటే ఎక్కువ సేపు నిర్వహించినందుకు కారా కారా పబ్‌ యాజమాన్యంపై మరో కేసు నమోదు చేశారు. మూడు కేసులపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. సీసీ ఫుటేజీ ద్వారా నిందితులను గుర్తించే ప్రక్రియ ప్రారంభించారు. ఎంపీ అనిల్‌ యాదవ్‌ సోదరుడు అరవింద్‌ యాదవ్‌ అహ్వానం మేరకే పాతబస్తీకి చెందిన సులేమాన్‌, అఫ్సర్‌ ఖాన్‌తో పాటు పలువురు పబ్‌కు వచ్చినట్లు సమాచారం. అర్ధరాత్రి దాటాక కూడా వారంతా మద్యం తాగుతూ పార్టీలో మునిగిపోయినట్లు తెలిసింది. ఈ క్రమంలో అరవింద్‌ యాదవ్‌, ఓ యువతి నిలబడి ఉండగా.. సులేమాన్‌ వారి వైపు వచ్చినట్లు సమాచారం. దారి లేనప్పుడు ఎందుకు ఇటు వచ్చావంటూ సులేమాన్‌ను అరవింద్‌ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో సులేమాన్‌పై కొందరు దాడి చేసేందుకు యత్నించారు. అతడు తప్పించుకోవడంతో అఫ్సర్‌ఖాన్‌ వారికి టార్గెట్‌ అయినట్లు సమాచారం. అప్పటికే మద్యం మత్తులో ఉన్న అఫ్సర్‌ వారి నుంచి తప్పించుకొని.. కిందకు వచ్చి కారు ఎక్కుతుండగా అరవింద్‌, అతడి స్నేహితులు పవన్‌, సందీప్‌ వచ్చి దాడి చేశారు. పార్కింగ్‌ కోన్‌లతో వసీమ్‌ అనే వ్యక్తిని కొట్టడంతోపాటు కారు అద్దాలను ధ్వంసం చేశారు. గొడవకు కారణమైన ఎంపీ సోదరుడి పేరును పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చకపోవడం చర్చనీయాంశమైంది. కాగా, అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచినందుకు గతంలోనూ కారాకారా పబ్‌పై కేసులు నమోదయ్యాయి. తాజా ఘటనతో పబ్‌ లైస్సెన్స్‌ను రద్దు చేయాలని పోలీసులు ఎక్సైజ్‌ శాఖకు లేఖ రాసినట్లు తెలిసింది.


ఈ వార్తలు కూడా చదవండి..
తలపై కొట్టి చంపి.. ఇనుప పెట్టెలో కుక్కి..

మోదీ ఓటమికి సర్‌లోనే పునాది

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 08 , 2026 | 06:53 AM