Share News

సీఏ విద్యార్థి జనార్దన్ మృతిపై వీడిన మిస్టరీ.. కీలక వివరాలు వెల్లడించిన పోలీసులు

ABN , Publish Date - May 16 , 2026 | 10:10 AM

మియాపూర్‌లో సీఏ విద్యార్థి జనార్దన్ అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు కీలక వివరాలు వెల్లడించారు. గదిలో రక్తపు మరకలు కనిపించడంతో కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ, దర్యాప్తులో ఇది ఆత్మహత్యేనని పోలీసులు నిర్ధారించారు.

సీఏ విద్యార్థి జనార్దన్ మృతిపై వీడిన మిస్టరీ.. కీలక వివరాలు వెల్లడించిన పోలీసులు
Miyapur CA Student Case

హైదరాబాద్‌: మియాపూర్ ప్రాంతంలో సీఏ విద్యార్థి జనార్దన్ మృతి కేసులో పోలీసులు కీలక వివరాలు వెల్లడించారు. మొదట ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమైనప్పటికీ, దర్యాప్తు అనంతరం ఇది ఆత్మహత్యేనని పోలీసులు నిర్ధారించారు.


కాగా, కర్నూలు జిల్లా ఉప్పలపాడు గ్రామానికి చెందిన ఆంజనేయులు కుమారుడు జనార్దన్‌ (27) చెన్నైలో సీఏ చదువుతున్నాడు. చివరి సంవత్సరం పరీక్షలు రాయకపోవడంతో పాటు కొన్ని సబ్జెక్టుల్లో బ్యాక్‌లాగ్స్ ఉండటంతో మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో మియాపూర్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్‌లో నివసిస్తున్న తన స్నేహితుల వద్దకు వచ్చి ఉంటున్నాడు.

గురువారం సాయంత్రం గదిలో ఒంటరిగా ఉన్న సమయంలో జనార్దన్ తన గదిలో ఉరివేసుకుని మృతిచెందిన స్థితిలో కనిపించాడు. స్నేహితులు అతడిని ఆ స్థితిలో చూసి వెంటనే కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. అయితే గది మొత్తం రక్తంతో నిండిపోవడం కుటుంబ సభ్యుల్లో అనుమానాలకు దారితీసింది. ఒకవైపు ఉరివేసుకున్న స్థితిలో ఉండగా, మరోవైపు గదిలో రక్తపు మరకలు ఎక్కువగా కనిపించడంతో తల్లిదండ్రులు మృతిపై సందేహాలు వ్యక్తం చేశారు.


పోలీసులు ఘటనపై విచారణ చేపట్టి, సూసైడ్ నోట్‌తో పాటు ఇతర ఆధారాల ఆధారంగా ఇది ఆత్మహత్యేనని ప్రాథమికంగా నిర్ధారించారు. జనార్దన్ ముందుగా తన నాలుక కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు, అనంతరం లుంగీతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. జనార్దన్ రెండు పేజీల సూసైడ్ నోట్ రాసినట్లు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి:

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటల సమయం

గోల్డ్, సిల్వర్ రేట్స్ పతనం.. ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయంటే..

Read Latest AP News And Telangana News 

Updated Date - May 16 , 2026 | 10:10 AM