Share News

హైదరాబాద్‌ను లైఫ్ సైన్సెస్, ఫార్మా హబ్‌గా మార్చడమే లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు

ABN , Publish Date - Feb 17 , 2026 | 03:44 PM

25 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సాధించాలన్నదే తెలంగాణ లైఫ్ సైన్సెస్ పాలసీ టార్గెట్‌ అని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.

హైదరాబాద్‌ను లైఫ్ సైన్సెస్, ఫార్మా హబ్‌గా మార్చడమే లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు
Minister Sridhar Babu

హైదరాబాద్, ఫిబ్రవరి 17: బయో ఆసియా 2026 సదస్సులో పారిశ్రామికవేత్తలు, పరిశోధనా సంస్థల ప్రతినిధులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. టెక్నాలజీ ద్వారా బౌగోళిక, ఆర్థిక, రాజకీయ మార్పులకు అనుగుణంగా సదస్సు విజన్‌ను రూపొందించారన్నారు. లైఫ్ సైన్సెస్ కంపెనీలు.. ఏఐ టెక్నాలజీని వినియోగించుకుని ముందుకు వెళ్లాలని మంత్రి పిలుపునిచ్చారు. హెల్త్ కేర్ సేవలను ప్రజలకు అందుబాటులో, అఫర్డబుల్‌గా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సాధించాలన్నదే తెలంగాణ లైఫ్ సైన్సెస్ పాలసీ టార్గెట్‌ అని అన్నారు.


రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. కొందరు పెట్టుబడులు రాకుండా దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రెండు దశాబ్దాలుగా తెలంగాణలో సేవలు అందిస్తున్న నోవార్టిస్ కంపెనీని ముఖ్యమంత్రి అభినందించారన్నారు. ఫ్రాన్స్‌కు చెందిన గ్లోబల్ హెల్త్ కేర్ కంపెనీ Opella పెట్టుబడులతో ముందుకు వచ్చిందని అన్నారు. అమెరికాకు చెందిన Trident AI కంపెనీ 300 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుందని వివరించారు. Rx Propellant 1000 కోట్ల పెట్టుబడులతో సహా అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయని వివరించారు.


ఇది రాష్ట్రానికి శుభ సంకేతమని, ఈ పెట్టుబడులు ఉపాధి అవకాశాలను విస్తృతంగా పెంచుతాయని మంత్రి వ్యాఖ్యానించారు. మార్పులకు అనుగుణంగా లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగంలో అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించుకుంటామని తెలిపారు. హైదరాబాద్‌ను లైఫ్ సైన్సెస్, ఫార్మా హబ్‌గా మార్చడమే లక్ష్యమని పేర్కొన్నారు. జినోమ్ వ్యాలీ ఫేజ్ 4ను 100 ఎకరాలతో విస్తరిస్తున్నట్లు ప్రకటించారు. అత్యాధునిక మౌలిక వసతులతో జీనోమ్ వ్యాలీ ఫేజ్ 4 ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు.


2035 నాటికి లైఫ్ సైన్సెస్ రంగంలో 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. కొత్తగా 5 లక్షల ఉద్యోగాలు యువతకు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. తెలంగాణను ప్రపంచంలోని టాప్-3 లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో ఒకటిగా నిలపడమే టార్గెట్ అన్నారు. ఏఐ ఆధారిత డ్రగ్ డిస్కవరీ వంటి ఆధునిక రంగాల్లో యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తారన్నారు. తెలంగాణ స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా రెడీ-టు-వర్క్ వర్క్‌ఫోర్స్ తయారు చేస్తున్నారని తెలిపారు. సీబీఆర్‌ఐ గ్లోబల్ లైఫ్ సైన్సెస్ అట్లాస్ 2025 ప్రకారం గ్లోబల్ హబ్‌ల సరసన హైదరాబాద్ నిలిచిందన్నారు. ఉత్పత్తి మాత్రమే కాకుండా కొత్త ఔషధాల పరిశోధన కేంద్రంగా హైదరాబాద్ అభివృద్ధి చెందుతోందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

విషాదం.. టిప్పర్ లారీ కింద పడి ఐటీఐ విద్యార్థి మృతి

నటి ప్రత్యూష కేసులో నిందితుడికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 17 , 2026 | 04:58 PM