ఎమ్మెల్యేలు సభకు రాకపోతే జీతాలు కట్.. ప్రజలు రీకాల్ చేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
ABN , Publish Date - Feb 17 , 2026 | 01:26 PM
వైసీపీపై విరుచుకుపడ్డారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు. వైసీపీ సభ్యులు ఏదైనా రాజకీయం చేస్తారన్నారు. శాసనసభకు రాని వైసీపీ ఎమ్మెల్యేలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ స్పష్టం చేశారు
అమరావతి, ఫిబ్రవరి 17: ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Session) ఈరోజు (మంగళవారం) గంట ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. దీనిపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పందించారు. మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. ఉదయం సభ ఆలస్యంగా ప్రారంభమైందని, దీనికి కారణం సాఫ్ట్‌వేర్ సమస్య అని వెల్లడించారు. ‘టెక్నికల్ ప్రాబ్లెమ్ వచ్చినప్పుడు ఎవరు ఏం చేయగలరు? వైసీపీ వాళ్లు ఏదైనా రాజకీయం చేస్తారు. ఇంతకు ముందు ఫేస్ టు ఫేస్ రాజకీయాలు ఉండేవి. ఇప్పుడు వెనకాల నుంచి గుంతలు తవ్వుతున్నారు’ అని స్పీకర్ వ్యాఖ్యానించారు.
అయితే కోరం పూర్తిగా ఉందని, చాలా మంది సభ్యులు సమయానికి హాజరయ్యారని స్పీకర్ అయ్యన్న తెలిపారు. డిజిటల్ అటెండెన్స్ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోందన్నారు. సభ్యులు అసెంబ్లీకి రావడమే కాకుండా సభలో ఎన్ని గంటలు, నిమిషాలు కూర్చున్నారో కూడా నమోదవుతోందని చెప్పారు. శాసనసభకు రాని వైసీపీ ఎమ్మెల్యేలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ‘విధులు సక్రమంగా నిర్వర్తించని ఎమ్మెల్యేలను ప్రజలు రీకాల్ చేయాలి. శాసనసభకు రావటం ఎమ్మెల్యేల విధి. కొందరు అసలు సభకే రాకుండా జీతభత్యాలు తీసుకోవటం తగదు. వారికి జీతం కట్ చేయాలి’ అని స్పష్టం చేశారు. ఉద్యోగులు రాకపోతే జీతాలు కట్ చేసి చర్యలు తీసుకునే నిబంధన ఎమ్మెల్యేలకు ఎందుకు వర్తించకూడదని స్పీకర్ ప్రశ్నించారు.
విశాఖపట్నంలో జరిగిన సభలో ఈ విషయం ప్రస్తావించగా 80 శాతం ప్రజలు తనతో ఏకీభవించారని స్పీకర్ తెలిపారు. లక్నోలో జరిగిన స్పీకర్ల సమావేశంలో జీతాలు తీసుకుంటూ అసెంబ్లీకి రాని వాళ్లను రీకాల్ చేయాలని సూచించానని చెప్పారు. చాలా దేశాల్లో రీకాల్ విధానం ఉందని, మనది ప్రజాస్వామ్య దేశం కావడంతో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోందని అన్నారు. చిన్న పిల్లల మాక్ అసెంబ్లీ అద్భుతంగా జరిగిందని స్పీకర్ తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేల కంటే వారే బాగా మాట్లాడారని స్పీకర్ ప్రశంసించారు. ప్రస్తుతం పాఠశాలల నుంచి దాదాపు 200 అప్లికేషన్లు వచ్చాయన్నారు. విశాఖ నుంచి రాయలసీమ వరకు వివిధ ప్రాంతాల నుంచి పిల్లలు అసెంబ్లీని చూడడానికి వస్తున్నారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు.
ఇవి కూడా చదవండి...
నటి ప్రత్యూష కేసులో నిందితుడికి సుప్రీంకోర్టులో చుక్కెదురు
హర్యానా నిట్ క్యాంపస్‌లో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి
Read Latest AP News And Telugu News