Share News

ధరణి సమస్యలు భూ-భారతితో పరిష్కారం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ABN , Publish Date - Apr 18 , 2026 | 06:47 PM

త్వరలోనే భూముల మార్కెట్ విలువలను పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ధరణి సమస్యలు భూ -భారతితో పరిష్కారమవుతాయని చెప్పారు.

ధరణి సమస్యలు భూ-భారతితో పరిష్కారం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
Ponguleti Srinivasa Reddy

ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చిట్‌చాట్‌లో పలు కీలక అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భూముల ధరల పెంపు, రిజిస్ట్రేషన్ విధానంలో మార్పులు, రెవెన్యూ పాలసీ వంటి విషయాలపై స్పష్టత ఇచ్చారు. మంత్రి మాట్లాడుతూ, త్వరలోనే భూముల మార్కెట్ విలువలను పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు ల్యాండ్ వ్యాల్యూ పెంపు జరగలేదని, త్వరలో ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.


కేబినెట్ విస్తరణపై చర్చ

ధరణి పోర్టల్‌కు సంబంధించిన సమస్యలను ‘భూ-భారతి’ ద్వారా పరిష్కరించనున్నట్లు వెల్లడించారు. భూముల రిజిస్ట్రేషన్‌ను మ్యాప్‌తో అనుసంధానం చేస్తూ ఈ నెల 20వ తేదీ నుంచి కొత్త విధానం ప్రారంభమవుతుందని చెప్పారు. మ్యాప్‌తో కూడిన తొలి రిజిస్ట్రేషన్ పాలేరు ప్రాంతంలో ప్రారంభం కానుందని తెలిపారు. రెవెన్యూ శాఖలో కొత్త పాలసీ తీసుకురావడానికి కసరత్తు జరుగుతోందని, త్వరలోనే దీనిపై పూర్తి వివరాలు వెల్లడిస్తామని మంత్రి చెప్పారు. అలాగే కేబినెట్ విస్తరణపై చర్చ జరుగుతోందని, అది విడతల వారీగా జరిగే అవకాశం ఉందని తెలిపారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా త్వరలోనే చేపడతామని పేర్కొన్నారు.


సమ్మర్ తర్వాత ఎన్నికలు

సమ్మర్ తర్వాత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగే అవకాశముందని ఆయన తెలిపారు. అసైన్డ్ భూములపై వచ్చిన ఫిర్యాదులను త్వరలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇప్పటికే నాలుగు రకాల ఫిర్యాదులను గుర్తించి వాటి పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చామని వెల్లడించారు. ఏ శాఖ ఎవరికీ శాశ్వతం కాదని, శాఖలపై ఆశలు పెట్టుకోవడం సహజమని మంత్రి వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో తనపై ప్రతిపక్షం విమర్శలు చేసినప్పుడు ఇతర మంత్రులు తనకు మద్దతుగా నిలిచారని తెలిపారు. ప్రతిపక్షం ట్రాప్‌లో పడకుండా ఓపికగా సమాధానాలు ఇచ్చానని అన్నారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై లిస్ట్ తయారు అవుతోందని, సరైన సమయంలో అన్ని విషయాలు బయటకు వస్తాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి సమీక్ష

ఇదిలా ఉండగా, తెలంగాణలో ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి పనులపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో విమానాశ్రయాల ఏర్పాటుకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. వరంగల్ విమానాశ్రయం అభివృద్ధి కోసం ఇప్పటికే 953 ఎకరాల భూసేకరణ పూర్తి అయినట్లు తెలిపారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగనున్నట్లు వెల్లడించారు. ఆదిలాబాద్‌లో విమానాశ్రయ అభివృద్ధి పనులను డిఫెన్స్, సివిల్ ఏవియేషన్ విభాగాలు సంయుక్తంగా చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. దీనికి సంబంధించి తక్షణమే మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై సమగ్ర అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని అవసరమైన సాంకేతిక అనుమతులు, మౌలిక వసతుల ఏర్పాటును త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి స్పష్టం చేశారు. ఉత్తర తెలంగాణలో రవాణా సౌకర్యాలను మరింత అభివృద్ధి చేసి, రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.


Also Read:

ఆఫీసులో గంటల తరబడి కూర్చుంటున్నారా? మీ ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్టే!

ప్రకృతి ప్రసాదించిన యాంటీ బయాటిక్స్.. రోగనిరోధక శక్తిని పెంచే 'సూపర్ మసాలాలు' ఇవే!

For More Latest News

Updated Date - Apr 18 , 2026 | 06:58 PM