Share News

సోనియా ఆత్మకథలో తెలంగాణ ప్రస్తావన లేదేం?

ABN , Publish Date - Nov 18 , 2026 | 06:06 AM

తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ అని చెప్పుకొనే కాంగ్రెస్‌ నేతలు.. ఆమె ఆత్మకథలో తెలంగాణ ప్రస్తావన ఎందుకు లేదో సమాధానం చెప్పాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

సోనియా ఆత్మకథలో తెలంగాణ ప్రస్తావన లేదేం?
KTR

  • తెలంగాణ రైజింగ్‌ కాదు.. ఫాలింగ్‌

  • భారత్‌ సమ్మిట్‌తో ప్రజలకు ఒరిగిందేమీ లేదు: కేటీఆర్‌

హైదరాబాద్‌, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ అని చెప్పుకొనే కాంగ్రెస్‌ నేతలు.. ఆమె ఆత్మకథలో తెలంగాణ ప్రస్తావన ఎందుకు లేదో సమాధానం చెప్పాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఉద్యమ ఉప్పెనలో కొట్టుకుపోతామన్న భయంతోనే కాంగ్రెస్‌ పార్టీ అనివార్యంగా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చిందే కానీ.. సోనియాగాంధీ గుండెల్లో తెలంగాణ ఉందని చెప్పడం విడ్డూరమన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుపై కాంగ్రెస్‌ నేతలకు అంత ప్రేమ ఉంటే ఆయన అంత్యక్రియలను ఢిల్లీలో ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. మంగళవారం కేటీఆర్‌ తెలంగాణ భవన్‌లో విలేకర్లతో చిట్‌చాట్‌ చేశారు. గతంలో రాహుల్‌ గాంధీని ముద్దపప్పు అని విమర్శించింది తాము కాదని, రేవంత్‌ రెడ్డేనని, సోనియాను బలిదేవత అని కూడా అన్నారని చెప్పారు.


ఎన్నికలకు ముందు అభయహస్తం.. ఎన్నికల తర్వాత రిక్తహస్తం అన్నట్లుగా కాంగ్రెస్‌ మూడేళ్ల పాలన ఉందన్నారు. మూడేళ్ల తెలంగాణ నాట్‌ రైజింగ్‌.. తెలంగాణ ఫాలింగ్‌ అని వ్యాఖ్యానించారు. మూడేళ్లలో రూ.లక్షల కోట్ల పెట్టుబడులను తెచ్చామని చెబుతున్న ప్రభుత్వం.. ఎన్ని పెట్టుబడులు వాస్తవరూపం దాల్చాయి, ఎన్ని పరిశ్రమలు, ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి? అనే అంశాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. గాంధీ కుటుంబానికి రేవంత్‌ రెడ్డి బాడీగార్డ్‌గా మారారని, ఇది తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనన్నారు. బీజేపీలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోందని విమర్శించారు. తనకంటే ఐదేళ్లు చిన్నవాడైన కేంద్ర మంత్రి అమిత్‌ షా కాళ్లకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు మొక్కడం ఏమిటని, ఆయన చెప్పులు మోయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.


రెండు ఢిల్లీ పార్టీల నాయకత్వం వద్ద తెలంగాణ నాయకులు బానిసలు, గులాముల్లా వ్యవహరిస్తున్న తీరు సిగ్గుచేటని మండిపడ్డారు. కాంగ్రెస్‌ నిర్వహించిన భారత్‌ సమ్మిట్‌తో తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. దీనికోసం తెలంగాణ ప్రజల సొమ్ము రూ.100 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో బీసీ, ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్టర్లకు 72 శాతం కాంట్రాక్టులు కేటాయిస్తామని ఇచ్చిన హామీని మూసీ ప్రాజెక్టు నుంచి అమలు చేస్తారా? లేక నారాయణపేట-కొడంగల్‌ ఎత్తిపోతల పథకం నుంచి ప్రారంభిస్తారా? అని ప్రశ్నించారు. శాసనసభలో తనపై 8 వేల ఎకరాల భూకబ్జా ఆరోపణలు చేసి రెండు నెలలు గడిచినా రేవంత్‌ రెడ్డి ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు చూపలేదన్నారు. కాగా, ముధోల్‌ నియోజకవర్గానికి చెందిన పలువురు బీజేపీ నాయకులు కేటీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అక్వాన్ తుపానుపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు

జగన్‌కు లోకేశ్ మాస్ కౌంటర్.. లెక్కలతో ఫ్యాక్ట్ రిప్లై

రొయ్యల రైతులపై జగన్‌ది కపట ప్రేమ.. మా సర్కారుపై సాక్షిది అసత్య ప్రచారమే.. మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజం

Read Latest AP News And Telangana News

Updated Date - Nov 18 , 2026 | 06:06 AM