డెల్టా నీళ్లపై పీటముడి
ABN , Publish Date - Nov 24 , 2026 | 03:50 AM
కృష్ణా డెల్టా సిస్టమ్ (కేడీఎస్)కు నీటి కేటాయింపుపై తెలుగు రాష్ట్రాల మధ్య పీటముడి పడింది. డెల్టాకు 10 టీఎంసీలు కేటాయించాల్సిందేనని ఏపీ పట్టుబట్టగా, సాగు అవసరాల కోసం నీళ్లిచ్చేందుకు అంగీకరించేది లేదని తెలంగాణ తేల్చిచెప్పింది.
కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ భేటీలో తేలని వాటా
కృష్ణా డెల్టాకు 10 టీఎంసీలు కావాల్సిందే: ఏపీ
సాగు కోసం అడగడమేంటి? ఇవ్వబోం: తెలంగాణ
సాగర్ రెండు కాల్వలకు 9 టీఎంసీలపై అంగీకారం
ఎడమ కాల్వ నుంచి 15, ఏఎమ్మార్పీ నుంచి
6 టీఎంసీలు కోరిన తెలంగాణ
త్వరలో జరిగే బోర్డు పూర్తిస్థాయి భేటీకి పంచాయితీ
హైదరాబాద్, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): కృష్ణా డెల్టా సిస్టమ్ (కేడీఎస్)కు నీటి కేటాయింపుపై తెలుగు రాష్ట్రాల మధ్య పీటముడి పడింది. డెల్టాకు 10 టీఎంసీలు కేటాయించాల్సిందేనని ఏపీ పట్టుబట్టగా, సాగు అవసరాల కోసం నీళ్లిచ్చేందుకు అంగీకరించేది లేదని తెలంగాణ తేల్చిచెప్పింది. నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాల్వల ద్వారా ఏపీకి 9 టీఎంసీల విడుదలపై మాత్రం అంగీకారం కుదిరిందని ఏపీ ఈఎన్‌సీ తెలిపారు. కేడీఎస్ వాటాపై ఏకాభిప్రాయం రాకపోవడంతో త్వరలో జరిగే బోర్డు పూర్తిస్థాయి సమావేశంలోనే తేల్చుకోవాలని నిర్ణయించారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం సోమవారం బోర్డు కార్యాలయంలో కన్వీనర్ సతీష్ కంబోజ్ అధ్యక్షతన జరిగింది.
తెలంగాణ తరఫున ఈఎన్‌సీ (జనరల్) రమే్‌షబాబు, ఏపీ తరఫున జలవనరుల శాఖ ఈఎన్‌సీ నర్సింహామూర్తి హాజరయ్యారు. ఈ నెల 25 నుంచి సాగర్ కుడి కాల్వకు 8 టీఎంసీలు, ఎడమ కాల్వ నుంచి 1 టీఎంసీ ఇవ్వాలన్న ఏపీ విజ్ఞప్తిపై చర్చించడమే అజెండా. అయితే, అనూహ్యంగా కేడీఎస్‌కు 10 టీఎంసీల డిమాండ్‌ను ఏపీ తెరపైకి తెచ్చింది. దాదాపు నాలుగు గంటల పాటు సాగిన భేటీలో ఇరు రాష్ట్రాల మధ్య వాడివేడి చర్చ జరిగింది. ఏపీ డిమాండ్‌ను తెలంగాణ గట్టిగా తిప్పికొట్టింది. ఇప్పటికే కేడీఎస్‌లో 74.32 టీఎంసీలు వాడుకున్నారని, పులిచింతలలో 26.75 టీఎంసీలు, ప్రకాశం బ్యారేజీలో 2.44 టీఎంసీల నిల్వ ఉందని గుర్తు చేసింది.
ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి అవసరాల కోసమే ఆచితూచి వాడుకుంటుంటే, రబీ సాగు కోసం నీళ్లు అడగడమేంటని, నిల్వలు సరిపడా ఉన్నా ఏ ప్రాతిపదికన కోరుతున్నారని నిలదీసింది.సాగర్ నుంచి కేడీఎ్‌సకు నీళ్లివ్వాలని బచావత్ ట్రైబ్యునల్ కూడా తీర్పు ఇవ్వలేదని స్పష్టం చేసింది. సాగర్‌లో ఇప్పటికే 64.03 టీఎంసీల వినియోగం జరిగిందని, కనీస నీటిమట్టంపైన 45.40టీఎంసీలే మిగిలాయని పేర్కొంది. సాగర్ ఎడమ కాల్వ నుంచి 15టీఎంసీలు, ఏఎమ్మార్పీ నుంచి 6టీఎంసీలుకేటాయించాలని కోరింది.
పల్నాడుకు అనుమతి ఏది?: తెలంగాణ
అనుమతి లేకుండానే పల్నాడు తాగునీటి పథకాన్ని ఏపీ చేపట్టిందని తెలంగాణ ఈఎన్‌సీ రమేష్‌బాబు ఆక్షేపించారు. భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సాగర్ ఎడమ కాల్వ నుంచి నెలకు 5 టీఎంసీల చొప్పున మూడు నెలల పాటు కావాలని కోరామన్నారు.సాగర్ కుడి, ఎడమ కాల్వల కింద తాగునీటి అవసరాలకే నీళ్లు కోరాలని, ఎల్‌నినో దృష్ట్యా సాగర్ నిల్వలను తాగునీటికే వాడాలన్నారు. ఏపీ మాత్రం రబీ సాగు కోసం కేడీఎస్‌కు అదనంగా 10టీఎంసీలు కోరుతోందని చెప్పారు.
డెల్టా హక్కులను వదులుకోం: ఏపీ
కేడీఎస్ నీళ్లు కోరడం తమ హక్కు అని, కృష్ణా డెల్టా నీటి హక్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోబోమని ఏపీ ఈఎన్‌సీ నర్సింహామూర్తి స్పష్టం చేశారు. ఈ ఏడాది కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేయలేదని గుర్తు చేశారు. సాగర్ కుడి, ఎడమ కాల్వల ద్వారా కోరిన 9 టీఎంసీలపై అంగీకారం కుదిరిందని, కేడీఎస్‌పై రెండు దఫాలుగా చర్చలు జరిగినా ఏకాభిప్రాయం రాకపోవడంతో రానున్న బోర్డు సమావేశంలో చర్చించి తేల్చుకోవాలని బోర్డు సూచించిందని తెలిపారు. సాగర్‌లో 500 అడుగుల దాకా నీటిని తీసుకునే అవకాశం ఉందన్నారు. పల్నాడు వాటర్ గ్రిడ్‌పై భేటీలో ఎలాంటి చర్చ జరగలేదని చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎన్విడియా చిప్స్ స్మగ్లింగ్ వెనుక చైనా వ్యాపారవేత్త స్కెచ్
భారత్‌లోని వైవిధ్యం ఇతర దేశాలకు కూడా ఆదర్శం: పుతిన్