Share News

కొడంగల్‌కు కోయిల్‌సాగర్‌ నీళ్లు!

ABN , Publish Date - Nov 19 , 2026 | 05:07 AM

సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ నియోజకవర్గంలో నెలకొన్న తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కారంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.

కొడంగల్‌కు కోయిల్‌సాగర్‌ నీళ్లు!

  • రూ.490 కోట్లతో భారీ తాగునీటి పథకం

  • రోజుకు 40 ఎంఎల్‌డీ నీటి సరఫరాకు ప్రణాళిక

  • పోలేపల్లి దాకా ఎత్తిపోతలు, అక్కణ్నుంచి గ్రావిటీ ద్వారా

  • 490 కోట్లతో పనులకు పాలనాపరమైన అనుమతులు

  • టెండర్ల దశలో ప్రక్రియ..

  • 2027 చివరికల్లా పనులు పూర్తి

వికారాబాద్‌ , నవంబరు 18(ఆంధ్రజ్యోతి)/దుద్యాల): సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ నియోజకవర్గంలో నెలకొన్న తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కారంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు నుంచి కొడంగల్‌కు పైప్‌లైన్‌ నెట్‌వర్క్‌ ద్వారా తాగునీటిని తరలించాలని నిర్ణయించింది. నియోజకవర్గ పరిధిలోని కోస్గి, కొడంగల్‌, మద్దూరు మునిసిపాలిటీలు సహా పలు గ్రామాలు, పారిశ్రామిక కారిడార్‌, ఎడ్యుకేషనల్‌ హబ్‌ భవిష్యత్తులో పట్టణీకరణ ద్వారా పెరగనున్న కాలనీల అవసరాలను పరిగణనలోకి తీసుకుని రూ.490 కోట్లతో భారీ పథకానికి రూపకల్పన చేసి పరిపాలనాపరమైన అనుమతలు జారీచేసింది.


ప్రస్తుతం ఈ పథకం టెండర్ల దశలో ఉంది. రూరల్‌ వాటర్‌ సప్లయ్‌, మిషన్‌ భగీరథ ఇంజనీరింగ్‌ విభాగాల ఆధ్వర్యంలో పైపులైన్‌ అలైన్‌మెంట్‌, ఇన్‌టేక్‌ వెల్‌, పంప్‌హౌస్‌ నిర్మాణాలకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. టెండర్ల ఖరారు, కాంట్రాక్టర్లతో ఒప్పందాలు పూర్తవగానే పనులు ప్రారంభమవుతాయి. కోయిల్‌ సాగర్‌ నుంచి పోలేపల్లి శివారు వరకు భారీ మోటార్లతో నీటిని ఎత్తిపోస్తారు. అక్కడి నుంచి నియోజకవర్గం నలువైపులా గ్రావిటీ విధానంలో మునిసిపాలిటీలు, గ్రామాలకు సరఫరా చేస్తారు. అక్కడి నుంచే లగచర్ల మల్టీపర్పస్‌ పారిశ్రామిక కారిడార్‌ పరిధిలో ఏర్పాటవ్వనున్న పరిశ్రమలకు, హకీంపేట్‌ ఎడ్యుకేషన్‌ హబ్‌లోని విద్యాసంస్థల అవసరాలకూ ఈ నీటిని సరఫరా చేయనున్నారు.


ఈ పథకం ద్వారా రోజూ 40 మిలియన్‌ లీటర్ల (ఎంఎల్‌డీ) నీటిని కొడంగల్‌ నియోజకవర్గానికి సరఫరా చేయాలని నిర్ణయించారు. ఈ నీటిలో కోస్గి మునిసిపాలిటీకి 6 ఎంఎల్‌డీ, కొడంగల్‌ మునిసిపాలిటీకి 3 ఎంఎల్‌డీ, మద్దూరు మునిసిపాలిటీకి 3 ఎంఎల్‌డీ నీటిని సరఫరా చేయనున్నారు. లగచర్లలోని మల్టీమర్పస్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌కు 15 ఎంఎల్‌డీ, హకీంపేట్‌ ఎడ్యుకేషనల్‌ హబ్‌కు 2 ఎంఎల్‌డీ నీటిని, సర్జఖాన్‌పేట్‌, తోగాపూర్‌, పోలేపల్లి, హకీంపేట్‌, లగచర్ల తదితర పలు గ్రామాలకు 3 ఎంఎల్‌డీ నీటిని సరఫరా చేయాలని నిర్ణయించారు. 2027 చివరినాటికి పనులు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మొన్నే బుల్లెట్ దిగాల్సింది.. కానీ కొంచెంలో మిస్ అయ్యింది: ఎమ్మెల్యే కోమటిరెడ్డి

ఇందిరమ్మ కుటుంబ బీమా అమలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: సీఎస్ ఆదేశం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 19 , 2026 | 05:14 AM