Share News

కోఠి కాల్పుల కేసు.. పోలీసులను తప్పుదోవ పట్టించిన నిందితులు

ABN , Publish Date - Feb 02 , 2026 | 11:42 AM

కోఠి కాల్పుల కేసులో పోలీసులనే తప్పుదోవ పట్టించేలా దుండగులు ప్రవర్తించారు. ఘటన జరిగిన రోజంతా ఆటోలో తిరుగుతూ టైంపాస్ చేసిన దుండగులు.. తర్వాతి రోజు సిటీ వదిలి పరారైనట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

కోఠి కాల్పుల కేసు.. పోలీసులను తప్పుదోవ పట్టించిన నిందితులు
Koti ATM Shooting Case

హైదరాబాద్, ఫిబ్రవరి 2: హైదరాబాద్‌లోని కోఠి ఎస్‌బీఐ ఏటీఎం వద్ద జరిగిన కాల్పుల కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనలో నిందితులు చాలా తెలివిగా వ్యవహరించి.. పోలీసులనే తప్పుదోవ పట్టించేలా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. గత శనివారం ఉదయం బ్యాంక్ ఏటీఎం‌లో రూ.6 లక్షల నగదు డిపాజిట్ చేయడానికి వెళ్లిన రిన్షద్ అనే వ్యక్తిపై ఇద్దరు దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రిన్షద్ కాలికి బుల్లెట్ తగలడంతో గాయపడ్డారు. అనంతరం దుండగులు.. బాధితుడి స్కూటీపైనే నగదుతో ఉడాయించారు.


ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేపట్టారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా.. దుండగులు స్కూటీపై కాచిగూడ వైపు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అయితే నిందితులు ఘటన జరిగిన రోజంతా పలు ఆటోలు మారుతూ సిటీలోనే తిరుగుతూ టైంపాస్ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆ రోజు హైదరాబాద్ నుంచి బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద స్కూటీని వదిలేసి, స్టేషన్ లోపలికి వెళ్లినట్టు నటించిన దుండగులు.. పోలీసులను తప్పుదోవ పట్టించారు. రైలు ఎక్కి పారిపోయారని ఊహించేలా దారి మళ్లించి ఉడాయించారు.


కానీ.. నిందితులు రైల్వే స్టేషన్ లోపలికి వెళ్లకుండా సమీపంలోని ఓ డీమార్ట్ వద్ద దుస్తులు మార్చుకుని మరో వేషంలో బయటకు వచ్చినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో బయటపడింది. అక్కడి నుంచి ఆటో తీసుకుని చాంద్రాయణగుట్ట వైపు వెళ్లారు. ఘటన జరిగిన వెంటనే ట్రైన్‌లో వెళితే పట్టుబడతామని ఊహించిన నిందితులు.. ప్లాన్ మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఒకరోజు గడిచాక సిటీ వదిలి నార్త్ స్టేట్స్‌కు వెళ్లి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. నెట్‌వర్క్ డేటా, సీసీటీవీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. దుండగుల కాల్పుల్లో గాయపడిన బాధితుడు రిన్షద్.. ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.


ఇవి కూడా చదవండి..

లండన్‌కు మంత్రి నారాయణ.. కీలక ప్రాజెక్టుల పరిశీలన

ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు బాలురు మృతి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 02 , 2026 | 12:47 PM