వికారాబాద్‌లో పెను విషాదం.. బైక్‌పై పడిన జేసీబీ ట్రక్కు.. బాలుడి మృతి
ABN , Publish Date - Feb 02 , 2026 | 11:02 AM
వికారాబాద్ సమీపంలోని బుగ్గ రామేశ్వర ఆలయం మలుపులో ఊహించని విషాదం చోటుచేసుకుంది. జేసీబీని తీసుకెళుతున్న ట్రక్కు బైకుపై బోల్తాపడిన ఘటనలో ఓ బాలుడు మరణించాడు. బాలుడి తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు.
హైదరాబాద్, ఫిబ్రవరి 2: వికారాబాద్ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. జేసీబీని తీసుకెళుతున్న ట్రక్కు.. బైక్‌పై బోల్తాపడిన ఘటనలో ఓ బాలుడు మరణించాడు. బాలుడి తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ధారూరు మండలం కొండాపూర్ కలాన్ నుంచి 8 ఏళ్ల రిత్విక్ తన తండ్రి లాలయ్యతో కలిసి బైక్‌పై వికారాబాద్ వెళుతున్నాడు. బైక్ వెనకాలే స్కూటీపై రిత్విక్ తల్లి మేఘన, చెల్లెలు ఫాలో అవుతున్నారు. వికారాబాద్ సమీపంలోని బుగ్గ రామేశ్వర ఆలయం మలుపులో ఊహించని విషాదం చోటుచేసుకుంది.
జేసీబీని తీసుకెళుతున్న ట్రక్కు మలుపు వద్ద అదుపుతప్పి.. బైక్‌పై బోల్తా పడింది. దీంతో రిత్విక్ అక్కడికక్కడే చనిపోయాడు. లాలయ్య కాలు విరిగింది. స్కూటీపై వెళ్తున్న తల్లీకూతుళ్లకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే స్పందించి.. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది. ట్రక్కు డ్రైవర్ తాగి ఉన్నాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రిత్విక్ మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
కర్నూలు జిల్లాలో ప్రమాదం.. కార్మికుడు మృతి
పాకిస్థాన్ ఎప్పుడూ ఒక్క మాట మీద నిలబడదు: సునీల్ గావస్కర్