యాదాద్రి థర్మల్‌కు బొగ్గు సరఫరా చేస్తాం
ABN , Publish Date - Oct 17 , 2026 | 05:16 AM
రాష్ట్రానికి విద్యుత్ కొరత సమస్య రాకుండా యాదాద్రి థర్మల్ ప్లాంట్‌కు బొగ్గు సరఫరా చేస్తామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు.
సింగరేణిలో బొగ్గు మాయం అనేది అసత్యం
రాజకీయాల కోసం రేవంత్, కేటీఆర్ పరస్పర ఆరోపణలు
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి విద్యుత్ కొరత సమస్య రాకుండా యాదాద్రి థర్మల్ ప్లాంట్‌కు బొగ్గు సరఫరా చేస్తామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి మేరకు యాదాద్రికి బొగ్గు సరఫరా అంశం లో అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. సింగరేణిలో ఉత్పత్తి తగ్గి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కు బొగ్గు సరఫరా నిలిచిపోయిందని, రాష్ట్రంలో విద్యుత్ కొరత రాకుండా కోల్ ఇండియా నుంచి బొగ్గు కేటాయించాలని ముఖ్యమంత్రి తనని కోరారని కిషన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ బిడ్డగా, కేంద్రమంత్రిగా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా విద్యుత్ కొరత రాకుండా యాదాద్రి ప్లాంట్‌కు బొగ్గు సరఫరా చేస్తామని చెప్పారు.
మహానది కోల్ ఫీల్డ్స్ లేదా వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ నుంచి లింకేజీలను వర్కవుట్ చేసి రాష్ట్రానికి బొగ్గు అందిస్తామని వెల్లడించారు. సాధారణంగా రోజుకు 350 రైల్వే రేక్‌ల బొగ్గును లోడ్ చేసే స్థానంలో రికార్డు స్థాయిలో 496 రేక్‌లు లోడ్ చేసి పవర్ ప్లాంట్లకు తరలిస్తున్నామని కిషన్‌రెడ్డి వివరించారు. సింగరేణిలో 46 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయమైందంటూ జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి ఖండించారు. బొగ్గు దొంగతనం జరగలేదని, అధికారుల ‘బుక్ అడ్జ్‌స్టమెంట్’లో జరిగిన తప్పిదం మాత్రమేనని స్పష్టం చేశారు. దీనిపై సంబంధిత అధికారులకు ఇప్పటికే నోటీసులు ఇచ్చారని తెలిపారు. కానీ, రాజకీయాల కోసం రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. తెలంగాణలో బీజేపీ ఇంకా ఆట ప్రారంభించలేదని పేర్కొంటూ రేవంత్, కేటీఆర్ సంగతి తేలుస్తామని అన్నారు.
మోదీకి వ్యతిరేకంగా అంతర్జాతీయ కుట్ర
భారతదేశ అభివృద్ధిని జీర్ణించుకోలేక అంతర్జాతీయ పెట్టుబడిదారీ శక్తులు, దేశీయ విద్రోహ శక్తులు ఏకమై పెద్ద కుట్రకు తెరలేపాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. రాజ్యాంగబద్థ సంస్థలను నిర్వీర్యం చేేసందుకు, ఎన్నికల కమిషన్‌పై బురదజల్లేందుకు రాహుల్ గాంధీ నిరంతరం ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్ను రాజకీయాల్లోకి లాగడం అత్యంత దుర్మార్గమైన చర్య అని కిషన్ రెడ్డి అన్నారు. పోలీసు అధికారులు, సీబీఐ, ఈడీ, విదేశాంగ శాఖల అధికారులు తనకు టచ్‌లో ఉండి సమాచారం లీక్ చేస్తున్నారని రాహుల్ ప్రగల్భాలు పలకడం హాస్యాస్పదమని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
హైదరాబాద్‌లో కార్ల తయారీ ప్లాంట్ పెట్టండి
పట్టాపగ్గాల్లేని విద్యుత్ డిమాండ్
క్షేత్రస్థాయిలో కరెంటు యంత్రాంగం
Read Latest AP News And Telangana News And International