అరగంటపాటు గుండెను ఆపి.. ఆపరేషన్!
ABN , Publish Date - Sep 29 , 2026 | 05:44 AM
శరీరంలో ప్రధాన రక్తనాళమైన అయోర్టాలో ప్రమాదకరంగా ఏర్పడిన చీలిక(అక్యూట్ అయోర్టా డిసెక్షన్)కు కొండాపూర్‌లోని కిమ్స్ ఆసుపత్రి వైద్యులు అత్యంత సంక్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు.
అయోర్టా ప్రధాన రక్తనాళంలో చీలికకు చికిత్స
కిమ్స్-కొండాపూర్ వైద్యుల అరుదైన సర్జరీ
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): శరీరంలో ప్రధాన రక్తనాళమైన అయోర్టాలో ప్రమాదకరంగా ఏర్పడిన చీలిక(అక్యూట్ అయోర్టా డిసెక్షన్)కు కొండాపూర్‌లోని కిమ్స్ ఆసుపత్రి వైద్యులు అత్యంత సంక్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. పేషంట్ గుండెకు అరగంటపాటు రక్తప్రసారాన్ని నిలిపివేసి మరీ 10 గంటల ఆపరేషన్ జరిపారు. దీనికి సంబంధించిన వివరాలను ఆసుపత్రి చీఫ్ కార్డియోథొరాసిక్ సర్జన్, మినిమల్లీ ఇన్వేసివ్ రొబోటిక్ సర్జన్ డాక్టర్ నిసర్గ వెల్లడించారు. మెదక్ జిల్లాకు చెందిన విశ్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సూర్యకళ(64) పదేళ్లుగా అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. ఈ నెల 17వ తేదీన తెల్లవారుజామున ఆమెకు అకస్మాత్తుగా తీవ్రమైన ఛాతినొప్పి వచ్చింది. తొలుత స్థానిక ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నా నొప్పి తగ్గకపోవడంతో కొంపల్లిలోని మరో ఆసుపత్రిలో చేరారు.
అక్కడ గుండె వైద్య నిపుణులు సీటీ స్కాన్ ద్వారా.. ఆమెకు అయోర్టాలో తీవ్రమైన చీలిక ఉన్నట్లు గుర్తించారు. పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉండటంతో కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చీఫ్ కార్డియాలజిస్టు డాక్టర్ రవి కుమార్ అలూరి, చీఫ్ కార్డియోథొరాసిక్ సర్జన్, మినిమల్లీ ఇన్వేసివ్ రొబోటిక్ సర్జన్ డాక్టర్ నిసర్గ నేతృత్వంలోని వైద్య బృందం అత్యవసర శస్త్రచికిత్స జరిపారు. దెబ్బతిన్న అయోర్టా భాగాన్ని తొలగించి, ప్రత్యేకమైన జెలటిన్ సీల్డ్ పాలిస్టర్ వాస్క్యులర్ గ్రాఫ్ట్‌తో అయోర్టాను పునర్నిర్మించారు. ఈ ప్రక్రియ 10 గంటల పాటు కొనసాగింది.
గుండెను అరగంట పాటు ఆపి, బైపాస్ యంత్రాన్ని నిలిపివేసి, సుమారు 30 నిమిషాలు పల్స్, రక్తపోటు, సాధారణ రక్తప్రసరణ లేకుండా నియంత్రిత పరిస్థితుల్లో అయోర్టా ఆర్చ్ పునర్నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఈ కీలక దశలో శరీర ఉష్ణోగ్రతను 18 డిగ్రీల సెంటీగ్రెడ్‌కు తగ్గించారు. శస్త్రచికిత్స అనంతరం రక్తప్రసరణను క్రమంగా పునరుద్ధరించి, శరీర ఉష్ణోగ్రతను మెల్లగా సాధారణ స్థాయికి తీసుకువచ్చామని వైద్యులు వివరించారు. దీంతో గుండె తిరిగి పనిచేయడం ప్రారంభించిందని, ఆమెకు కొన్ని గంటల వ్యవధిలోనే వెంటిలేటర్ తొలగించామని, మరుసటి రోజే స్పష్టంగా మాట్లాడారని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
నేతన్నల సంక్షేమమే అస్త్రంగా.. సిరిసిల్లపై సీఎం గురి!
తులం బంగారం ఇస్తామన్న వాళ్ల ఫొటోలు పోలీస్ స్టేషన్లలో పెట్టాలి!
Read Latest AP News And Telangana News And International News And Telugu New