కేసీఆర్ రాజీనామా చేయాలి.. ఆందోళనలకు పిలుపునిచ్చిన సీఎం
ABN , Publish Date - Aug 31 , 2026 | 08:01 PM
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు, బంధువులకు పదవులు ఇచ్చారని ఆరోపించారు. తాను సీఎం అయ్యాక ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పదవులు ఇచ్చామని చెప్పారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఘాటైన వ్యాఖ్యలతో తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్‌కు.. నాకు పోలిక ఏంటి? అంటూ సీఎం ఫైర్ అయ్యారు. కేసీఆర్ సీఎం అయితే ఆయన కుటుంబ సభ్యులకు, బంధువులకు పదవులు కట్టబెట్టారని విమర్శించారు. తాను సీఎం అయ్యాక ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పదవులు ఇచ్చామని చెప్పుకొచ్చారు. దేశంలోనే ప్రధాన ప్రతిపక్ష నేత వైఫల్యం చెందిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వ్యాఖ్యానించారు. ‘పదేళ్లలో మీరు ఏం చేశారో.. రెండున్నరేళ్లలో మేం ఏం చేశామో అసెంబ్లీకి చర్చకు సిద్ధం’ అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం ముసారాంబాగ్ హైలెవెల్ బ్రిడ్జిని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా అంబర్‌పేట మున్సిపల్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలపై తీవ్ర విమర్శలు చేశారు.
ప్రణాళికాబద్ధంగా హైదరాబాద్ అభివృద్ధి..
హైదరాబాద్ అతివేగంగా విస్తరిస్తోందని.. ఈ మహానగరాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ విశ్వనగరంగా మారిందని.. ప్రపంచంతో హైదరాబాద్ పోటీ పడుతోందన్నారు సీఎం. వివిధ రంగాలకు హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిందన్నారు. మౌలిక వసతుల విస్తరణ కూడా అవసరం అని పేర్కొన్న సీఎం.. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతుల విస్తరణ జరగడం లేదన్నారు. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌ను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని సీఎం చెప్పారు.
3 భాగాలుగా తెలంగాణ..
అభివృద్ధి కోసం తెలంగాణను 3 భాగాలుగా విభజించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మూసీ పక్కన నివసించేవారి పరిస్థితి అత్యంత దయనీయం అని.. మూసీకి వరదలు వస్తే ప్రజలు ఎంతో నష్టపోతున్నారని అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ముసారాంబాగ్ వంతెనను ఎందుకు నిర్మించలేదని సీఎం రేవంత్ ప్రశ్నించారు. తమ ప్రభుత్వం వచ్చిన తరువాత రెండేళ్లలోనే బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేశామన్నారు. పదేళ్లలో అంబర్‌పేట్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టారా? అని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. ఎక్కడో ఊరి బయట డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టారంటూ విమర్శించారు.
ప్రజల సమస్యలను పట్టించుకోలేదు..
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోలేదని సీఎం రేవంత్ ఆరోపించారు. పేదల కష్టాలు తమకు తెలుసునని.. అందుకే ఇళ్లు కట్టిస్తున్నామని సీఎం అన్నారు. బతుకమ్మకుంటను చెరబట్టింది ఎవరో అందరికీ తెలుసునని బీఆర్ఎస్ నేతలనుద్దేశించి ఆరోపణలు గుప్పించారు సీఎం. బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు చెరువు లేకుండా.. బతుకమ్మకుంటను కబ్జా చేశారన్నారు. హైడ్రాను పంపి బతుకమ్మకుంట చెర విడిపించామని చెప్పారు. ఆడబిడ్డలకు బతుకమ్మకుంటను బహుమతిగా ఇచ్చామన్నారు. మళ్లీ బతుకమ్మకుంట కబ్జాకు యత్నిస్తున్నారంటూ సీఎం ఆరోపించారు. చెరువుల్లో ఆక్రమణలు తొలగిస్తున్నాం తప్ప.. వాటిలో విల్లాలు, ఫామ్‌హౌస్‌లు తాము కట్టుకోలేదన్నారు.
1000 రోజుల ప్రజాపాలన..
ప్రజాపాలన ఏర్పడి 1000 రోజులు పూర్తయ్యాయని సీఎం రేవంత్ తెలిపారు. ప్రజా ప్రభుత్వంపై బురద జల్లాలను కుట్రలు చేస్తున్నారంటూ విపక్షాలపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం విఫలమైందని కొందరు విమర్శిస్తున్నారన్నారు. తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసి ఆశ్చర్యపోయామన్నారు సీఎం. ధనిక రాష్ట్రంగా తెలంగాణను కేసీఆర్‌కు అప్పగిస్తే.. అప్పులకుప్ప చేశారంటూ విమర్శలు గుప్పించారు. పదేళ్లలో రూ.8 లక్షల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు. కేసీఆర్‌కు ముందు ఉన్న సీఎంలు చేసిన అప్పు రూ.70 వేల కోట్లు కాగా.. కేసీఆర్ ఒక్కరే రూ.7.50 లక్షల కోట్ల అప్పు చేశారన్నారు సీఎం రేవంత్. ఈ అప్పుల కోసం నెలకు రూ.7,500 కోట్ల అసలు, వడ్డీ కడుతున్నామని వివరించారు. ఏడాదికి రూ.80-90 వేల కోట్ల అప్పు కడుతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.
సమయానికి వేతనాలు..
ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలు ఇస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. నెలకు వెయ్యిమంది ఉద్యోగులు రిటైర్ అవుతున్నారని.. ఒక్కో ఉద్యోగికి బెనిఫిట్స్ కింద రూ.కోటి ఇవ్వాల్సివస్తోందన్నారు. గత 100 రోజుల్లో రూ.6 వేల కోట్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేశామన్నారు. గతంలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు 6 నెలలకు ఓసారి వేతనాలు ఇచ్చేవారని.. ఇప్పుడు టైమ్ టు టైమ్ వేతనాలు చెల్లిస్తున్నామని సీఎం తెలిపారు.
వికాసం వైపు తెలంగాణ..
విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపిస్తున్నామన్నారు సీఎం రేవంత్. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఉద్యోగ నియామకాలు చేపట్టలేదని.. రెండేళ్లలో 72 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారాయన. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం.. ఆర్టీసీకి రూ.11 వేల కోట్లు కట్టామన్నారు. రైతుల కోసం రూ.లక్షా 70 వేల కోట్లు ఖర్చు చేశామని సీఎం వెల్లడించారు. తమది ప్రజా ప్రభుత్వం.. ప్రజాపాలన అంటే ఇదే అని పేర్కొన్నారు. తాము అమలు చేస్తున్న పథకాల గురించి ప్రజలు ఆలోచించాలని సీఎం రేవంత్ కోరారు. 3 కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తున్నామని చెప్పారు. పేదలకు ఇళ్లు కట్టించి ఇస్తున్నామన్నారు. కేసీఆర్ ఏనాడైనా రేషన్ కార్డుల గురించి ఆలోచన చేశారా? అని ప్రశ్నించారు. అల్వాల్ టిమ్స్‌కు మాజీ సీఎం అంజయ్య పేరు పెడతామని సీఎం ప్రకటించారు. వరంగల్ టిమ్స్‌కు ప్రొ. జయశంకర్ పేరు పెడతామన్నారు. ఎల్బీనగర్ టిమ్స్‌కు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడతామని ముఖ్యమంత్రి ప్రకటించారు.
కేసీఆర్‌కు.. నాకు పోలిక ఏంటి..?
‘కేసీఆర్‌కు.. నాకు పోలిక ఏంటి..? కేసీఆర్ సీఎం అయితే ఆయన కుటుంబ సభ్యులు, బంధువులకు పదవులు కట్టబెట్టారు. నేను సీఎం అయ్యాక ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పదవులు ఇచ్చాం. దేశంలోనే ప్రధాన ప్రతిపక్ష నేత వైఫల్యం చెందిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. పదేళ్లలో మీరు ఏం చేశారో.. రెండున్నరేళ్లలో.. మేం ఏం చేశామో అసెంబ్లీలో చర్చకు సిద్ధం. ఈ వెయ్యి రోజుల్లో జనం కోసం కేసీఆర్ ఒక్కసారైనా బయటకు వచ్చారా? ఈ వెయ్యి రోజుల్లో ప్రధాన ప్రతిపక్ష నేత రూ.22.24 కోట్ల ప్రభుత్వ వేతనం తీసుకున్నారు. రేపటి నుంచి 6 రోజులపాటు ప్రధాన ప్రతిపక్ష నేత రాజీనామా చేయాలంటూ ఆందోళనలు చేయాలి.’ అని ప్రతిపక్ష నేతపై సీఎం రేవంత్ ఘాటైన విమర్శలు చేశారు.
ఇవి కూడా చదవండి..
ఇరాన్‌లో లక్ష మందికి పైగా నిరసనకారుల హత్య: ట్రంప్ సంచలన ఆరోపణలు..
భారత్, బంగ్లాదేశ్ సిరీస్‌పై బీసీబీ చీఫ్ కీలక అప్‌డేట్!
ఇందిరమ్మ ఇళ్లు ఉన్న గ్రామాల్లోనే మేము ఓట్లు అడుగుతాం: మంత్రి పొంగులేటి