బీసీల జనాభా తక్కువగా చూపే కుట్ర.. కేంద్రంపై కవిత విమర్శలు
ABN , Publish Date - Sep 18 , 2026 | 04:44 PM
బీసీ కులాల జనాభాను తక్కువ చేసి చూపే కుట్ర జరుగుతోందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత విమర్శించారు. కేంద్రం చేసే జనగణనలో బీసీ ఉప కులాలను కూడా కలిపి లెక్కించాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 18: బీసీ కులాల జనాభాను తక్కువ చేసి చూపే కుట్ర జరుగుతోందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత విమర్శించారు. ది యునైటెడ్ ఫోరం ఫర్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్, సకల జన సేవా సంస్థాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘పాలిటిక్స్ బియాండ్ క్యాస్ట్’ సదస్సులో మాట్లాడుతూ.. కేంద్రం చేసే జనగణనలో బీసీ ఉప కులాలను కూడా కలిపి లెక్కించాలని డిమాండ్ చేశారు. కులం కోసం ప్రత్యేక కాలం ఉండాల్సిందే అని స్పష్టం చేశారు. కులగణనకు ఇంకా నాలుగు నెలల సమయం ఉందని.. కేంద్రం వెంటనే నిర్ణయం తీసుకోవాలన్నారు. ఆలోచనా విధానం మారితేనే కుల వివక్ష నిర్మూలన సాధ్యమవుతుందని తెలిపారు. కులం అనేది చాలా కోణాలతో కూడిన జఠిలమైన సమస్య అని అన్నారు. ఈ సమస్య పరిష్కారానికి కూడా చాలా పరిష్కారాలు అవసరం ఉంటాయని తెలిపారు. ముఖ్యంగా రాజ్యాధికారంలో అన్ని కులాలను భాగస్వామ్యం చేస్తూనే వారిని ఆర్థికంగా బాగుచేయాలని సూచించారు. ఈ కుల వివక్ష అనే రోగాన్ని కచ్చితంగా పొగొట్టాల్సిన అవసరం ఉందన్నారు.
తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ అనేందుకు భయపడిన వాళ్లను కూడా బయటకు వచ్చి గట్టిగా మద్దతు తెలిపేలా చేశామని కవిత అన్నారు. బతుకమ్మ, బోనాలు ఎత్తుకుంటే లక్షలాది మంది ఆడవాళ్లు వచ్చి తెలంగాణ ఉద్యమానికి జై కొట్టారని చెప్పారు. ఆ పోరాటాల ఫలితంగా తెలంగాణను సాధించుకున్నామని.. అదే విధంగా కులాల విషయంలోనూ పరిష్కారాలు వెతకాల్సి ఉందన్నారు. కేంద్రం చేసే జనాభా గణనలో కులాల జాబితాలో ఓబీసీ కాలం పెట్టాల్సిందే అని అన్నారు. అదే విధంగా డ్రాప్ బాక్స్ అనేది కూడా కులగణనలో ఉండాలన్నారు. కేంద్రం జనాభా గణనలో బీసీ అనే కాలం మాత్రమే పెడతామని చెబుతోందని.. కానీ బీసీల్లో ఉపకులాల కాలం కూడా ఉండాలనే కోరుతున్నామని తెలిపారు. దేశంలో ఒకే కులానికి సంబంధించి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో స్టేటస్ ఉందన్నారు.
ఉపకులాలను కూడా లెక్కించకపోతే ఆయా కులాల జనాభా చాలా తక్కువగా ఉన్నట్లు చూపే పరిస్థితి వస్తుందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ చెప్పారు. కేంద్ర చేసే కులగణనలో ఒకే కాలం పెడితే ఉపకులాలుగా ఉండే వారి లెక్క వేరే ఉండి అవి మరో కులంగా మారుతుందని.. దాని కారణంగా కులాల జనాభా తక్కువగా ఉండే పరిస్థితి ఉంటుందని అన్నారు. కులాలను జనాభాను తక్కువ చేసి చూపే కుట్ర జరుగుతున్నట్లు అనుమానం కలుగుతోందన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం బీసీల లెక్క తక్కువ చేసి చూపిందని విమర్శించారు. గ్రామాల వారీగా కులాల జనాభాను ఇవ్వాలని అడిగితే ఇవ్వటం లేదని.. దానికి తోడు కేంద్రం ఉపకులాల కాలం పెట్టమని చెబుతోందన్నారు. ఇది కచ్చితంగా బీసీల సంఖ్యను తక్కువ చేసే కుట్రే అని ఆరోపించారు. కుల వివక్ష నిర్మూలనకు అంతా కష్టపడాలని కవిత పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
జగన్నాటకంతో ఒకరిని ఒకరు కాపాడుకుంటున్నారు.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌పై మహేశ్వర్ రెడ్డి ఫైర్
తెలంగాణపై ఎల్‌నినో ఎఫెక్ట్.. నీటి నిల్వలు భారీగా తగ్గాయి: మంత్రి ఉత్తమ్ కుమార్
Read Latest Telangana News And Telugu News