Share News

పదేళ్ల దోపిడీ డబ్బును.. ఇప్పటికీ లెక్కపెడుతున్నారు

ABN , Publish Date - Sep 01 , 2026 | 05:33 AM

బంగారు తెలంగాణ పేరుతో అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌.. అడ్డగోలుగా అవినీతికి పాల్పడిందని తెలంగాణ రక్షణసేన (టీఆర్‌ఎస్‌) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. పదేళ్లలో దోచుకున్న డబ్బులను ఆ పార్టీ నాయకులు ఇప్పటికీ లెక్కపెడుతున్నారని అన్నారు.

పదేళ్ల దోపిడీ డబ్బును.. ఇప్పటికీ లెక్కపెడుతున్నారు
kalvakuntla kavitha

  • అడ్డగోలుగా అవినీతికి పాల్పడిన బీఆర్‌ఎస్‌

  • కాంగ్రెస్‌ వైఫల్యాలను ఎందుకు ప్రశ్నించడంలేదు?

  • ప్రశాంత్‌రెడ్డికి నా ఉసురు తగులుతుంది

  • హరీశ్‌రావు, సంతోష్‌రావును క్షమిస్తానేమోగానీ..

  • నా తండ్రితో ఎడబాపిన ప్రశాంత్‌రెడ్డిని క్షమించను

  • ఏ తప్పూ చేయకున్నా పార్టీ నుంచి పంపించారు

  • నిజామాబాద్‌ సభలో కంటతడి పెట్టిన కవిత

నిజామాబాద్‌, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): బంగారు తెలంగాణ పేరుతో అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌.. అడ్డగోలుగా అవినీతికి పాల్పడిందని తెలంగాణ రక్షణసేన (టీఆర్‌ఎస్‌) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. పదేళ్లలో దోచుకున్న డబ్బులను ఆ పార్టీ నాయకులు ఇప్పటికీ లెక్కపెడుతున్నారని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ప్రధాన ప్రతిపక్షంగా ప్రశ్నించాల్సిన బీఆర్‌ఎస్‌ మౌనంగా ఎందుకు ఉందని ప్రశ్నించారు. అవినీతి కారణంగా కాంగ్రె్‌సతో ఆ పార్టీ మిలాఖత్‌ అయిందన్నారు. సోమవారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభలో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పదేళ్లు బీఆర్‌ఎ్‌సకు అధికారం ఇస్తే రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరంతో నిజామాబాద్‌లో ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదని విమర్శించారు. ఆ పార్టీ హయాంలో నాలుగు ఇళ్లే బంగారుమయం అయ్యాయన్నారు. తన తండ్రితో తనను ప్రశాంత్‌రెడ్డి ఎడబాపారని కవిత ఆరోపించారు. ఆయనకు తన ఉసురు తగులుతుందన్నారు. హరీశ్‌రావు, సంతోష్‌రావును క్షమిస్తానేమోగానీ ప్రశాంత్‌రెడ్డిని జీవితంలో క్షమించనని అన్నారు. బీఆర్‌ఎస్‌ అధికారం కోల్పోయిన రెండో రోజే ప్రశాంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నించారని తెలిపారు. ‘బీజేపీ ఎంపీ అరవింద్‌ సైతం కాంగ్రెస్‌ నేత కేసీ వేణుగోపాల్‌ను కలిసారట’ అని కవిత చెప్పారు. ఆడబిడ్డ కష్టాల్లో ఉంటే అక్కున చేర్చుకోవాల్సిన పుట్టిటోంళ్లే కుట్రచేసి తరిమేశారని కవిత ఆరోపించారు. మెట్టినింట అత్తమామలు కన్నకూతురిలా కడుపులో పెట్టి చూసుకున్నారంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఏ తప్పూ చేయకపోయినా తనను తిహాడ్‌ జైల్లో పెట్టారని, నాలుగేళ్లు ఈడీ, సీబీఐతో ఇబ్బందులు పెట్టారని తెలిపారు. అయినా తాను ధైర్యం కోల్పోలేదని, దారి తప్పలేదని అన్నారు. తాను ఏ తప్పూ చేయలేదని సుప్రీంకోర్టే స్వయంగా చెప్పిందని, దేశంలో ఎప్పుడూ లేనిధంగా సీబీఐ ఆఫీసర్‌ పైనే విచారణ చేయాలని తీర్పు చెప్పిందని గుర్తు చేశారు. తనను పార్టీ నుంచి ఎందుకు తీసేశారో అర్థం కావడంలేదని, సొంతూరుకు వచ్చాక ఆపుదామనుకున్నా కన్నీళ్లు ఆగడంలేదంటూ కవిత కంటతడి పెట్టారు. పదవుల కోసమే అయితే ఏ పార్టీలోకి అయినా వెళ్లవచ్చని, ప్రజల జీవితాల్లో మార్పు కోసమే పంతం పట్టి పార్టీ పెట్టానన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులవుతున్నా..ఒక్క హామీ కూడా అమలు చేయలేదని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీగా బీఆర్‌ఎస్‌ నిద్రపోతోందని, వారి నైజాన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు. రేవంత్‌రెడ్డి ఎన్నికలు వచ్చినపుడు దేవుళ్లపై ఒట్లు వేస్తారని, ఆ తర్వాత తిట్లు మొదలుపెడతారని విమర్శించారు.


ఇవి కూడా చదవండి

ప్రజల ఆశీస్సులకు అనుగుణంగా పాలన

చంపేసి.. ఆపై అత్యాచారం

Updated Date - Sep 01 , 2026 | 05:33 AM