కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత
ABN , Publish Date - Apr 25 , 2026 | 09:09 AM
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పేరు శనివారం ప్రకటించనున్నారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో ఏర్పాటు చేసిన సభలో పార్టీ పేరును ఆమె ప్రకటించనున్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 25: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పేరు శనివారం ప్రకటించనున్నారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో ఏర్పాటు చేసిన సభలో ఈ రోజు ఉదయం పార్టీ పేరును ఆమె ప్రకటించనున్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఎజెండాపై గంటన్నర పాటు కవిత ప్రసంగించనున్నారు. పార్టీ జెండాలో నీలం, ఆకుపచ్చ, పసుపు రంగులతో రూపొందించారు. నీలం రంగు.. బడుగు బలహీన వర్గాలు, ఆకుపచ్చ.. పంటలు, రైతులు.. పసుపు శుభసూచకంగా పార్టీ జెండా తయారు చేశారు.
రైతులు, మహిళలు, యువత, ఉద్యమకారులు, కుల సంఘాలు, కార్మిక సాధికారత లక్ష్యంగా 60 అంశాలతో పార్టీ ఎజెండాను రూపొందించారు. 20 ఎకరాల విస్తీర్ణంలో ఈ సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 50 వేల మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. కవిత సభ కోసం వివిధ జిల్లాల నుంచి పాదయాత్రలు, ఎడ్లబండ్లపై ప్రజలు తరలి వస్తున్నారు. ఈ సభకు వచ్చే వారి కోసం 34 రకాల తెలంగాణ వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేశారు.
కవిత కొత్త పార్టీ కోసం ఏర్పాటు చేసిన సభకు ప్రొఫెసర్ జయశంకర్ ప్రాంగణంగా నామకరణం చేశారు. కవిత స్థాపించే కొత్త పార్టీ పేర్లపై ప్రచారం జరుగుతుంది. మొన్నటి వరకు.. తెలంగాణ ప్రజా జాగృతి, నిన్న.. తెలంగాణ వికాస సమితి, నేడు తెలంగాణ రాష్ట్రీయ సమితి అంటూ ప్రచారం జరుగుతుంది. వీటిలో ఒక పేరును కవిత ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
రాత్రంతా పోలీసుల విచారణ.. సహకరించని అనంతబాబు
For More TG News And Telugu News